Tollywood : ‘అతి’ ఫార్ములాను మార్చుకోరా?

ABN , First Publish Date - 2022-08-28T15:05:11+05:30 IST

ఈ మధ్య ప్రీరిలీజ్ ఈవెంట్స్.. ‘అతి’ కి అడ్డాగా మారుతున్నాయి. మా సినిమా తోపు. ఈ సినిమాను మించిన సినిమానే లేదు. ఈ కథను నా కెరీర్ లో ఇంతవరకూ వినలేదు. ఈ సినిమా విడుదలయ్యాకా థియేటర్స్ షేక్ అయిపోతాయి.

Tollywood : ‘అతి’ ఫార్ములాను మార్చుకోరా?

ఈ మధ్య ప్రీరిలీజ్ ఈవెంట్స్.. ‘అతి’ కి అడ్డాగా మారుతున్నాయి. మా సినిమా తోపు. ఈ సినిమాను మించిన సినిమానే లేదు. ఈ కథను నా కెరీర్ లో ఇంతవరకూ వినలేదు. ఈ సినిమా విడుదలయ్యాకా థియేటర్స్ షేక్ అయిపోతాయి. అభిమానులు షాకయిపోతారు. అనే మాటలు హీరోల నోటి నుంచి వినిపిస్తున్నాయి. తమ సినిమాకు విడుదలకు ముందే సూపర్ క్రేజ్ తీసుకురావడానికి, ఇలాంటి అతిశయోక్తి మాటలతో ఓపెనింగ్ టికెట్స్ బాగా తెగడానికి సదరు హీరోలు.. ఆ ఫార్ములాను అప్లై చేస్తున్నారు. గతేడాది ‘పాగల్’ (Pagal) సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌లో విశ్వక్‌సేన్ (Vishwaksen) మాట్లాడుతూ.. ఈ సినిమా మామూలుగా ఉండదని, దీని దెబ్బకు మూసుకున్న థియేటర్స్ కూడా తెరుచుకుంటాయని పెద్ద స్టేట్ మెంట్ ఇచ్చాడు. దీంతో అంచనాలు బాగా పెరిగాయి. థియేటర్స్ వద్ద జనం బాగానే పోగయ్యారు. కట్ చేస్తే.. సినిమా చూసిన జనానికి దిమ్మతిరిగిపోయింది. ఇంతోడి సినిమాకా.. అంత బిల్డప్ ఇచ్చాడని హీరోని తెగ ట్రోల్ చేసి పడేశారు. దీని గురించి విశ్వక్ ను అడిగితే.. సినిమాకు టికెట్స్ తెగాలి కదా.. ఓపెనింగ్స్ రావాలి కదా అంటూ కవర్ చేసే ప్రయత్నం చేశాడు. దాని వల్ల తన క్రెడిబిలిటీ దెబ్బతినే అవకాశముందని అతడు తెలుసుకోలేకపోవడం విడ్డూరమనిస్తుంది. 


రౌడీ హీరోగా అభిమానులు పిలుచుకొనే విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) కూడా సరిగ్గా అదే రూట్‌ను ఎంచుకున్నట్టున్నాడు. అతడు తన సినిమాల గురించి మామూలు బిల్డప్పులివ్వడు. ‘నోటా, డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్’.. లాంటి సినిమాల ప్రీరిలీజ్ ఈవెంట్స్‌లో అతడు ఓవర్ ఎలివేషన్లు ఇచ్చిన సంగతి తెలిసిందే.ఆ సినిమాలు సెన్సేషన్ క్రియేట్ చేస్తాయన్నాడు. దాని వల్ల కేవలం ఓపెనింగ్స్ మాత్రమే వచ్చాయి. అయితే అతడి మాటల వల్ల అంచనాలు పెరిగిపోయి.. అందుకు తగ్గ రేంజ్ లో సినిమాలు లేకపోవడం వల్ల అవన్నీ డిజాస్టర్స్‌గా మిగిలిపోయాయి. ఇక ఇటీవల విడుదలైన అతడి ‘లైగర్’ (Liger) సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌లో విజయ్ చేసిన అతి అంతా ఇంతా కాదు. ఇది సాలిడ్ సినిమా అని, ఇండియా షేకయిపోతుందని, ఈ సినిమా కలెక్షన్స్ కు సంబంధించి తన లెక్క రూ. 200 కోట్ల నుంచి మొదలవుతుందని ఇలా చాలా స్టేట్ మెంట్లే ఇచ్చాడు. తీరా చూస్తే  ‘లైగర్’ సినిమాకి హడివిడి తప్ప విషయమే లేదని ప్రేక్షకులు తేల్చేశారు. విజయ్  ఈ సినిమాతో తన క్రెడిబిలిటీని బాగా దెబ్బతీసుకున్నాడని చెప్పొచ్చు.  రేపు రాబోయే అతడి  ‘ఖుషీ’ (Khushi) సినిమా బాగున్నప్పటికీ.. అది ఆవు - పులి కథలా రివర్స్ అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదని పలువురు అభిప్రాయ పడుతున్నారు. 


ఇంతకు ముందు ‘ది వారియర్’ (The Warrior) మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌లోనూ రామ్.. తన మాటలతో సినిమాకి క్రేజ్ తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. అసలు తనకి పోలీసు కథలంటేనే ఇష్టం పోయిందని, తన దగ్గరకు ఇంతవరకు 5 పోలీసు కథలొచ్చాయని, అవన్నీ ఒకే ఫార్మేట్‌లో ఉండడంతో తనకి పోలీసు సినిమాలంటేనే విరక్తి పుట్టిందని, అయితే దర్శకుడు ‘లింగుసామి’ (Lingusamy) మాత్రం దాన్ని ఒక పోలీస్ కథగా కాకుండా.. మామూలు కథగా చెప్పాడని, దాంతో తాను షాకయిపోయాయని, ఇది కదా తను చేయాల్సిన సినిమా అని డిసైడయ్యానని ఆ సినిమా గురించి తెగ బిల్డప్పులిచ్చాడు. ఆ సినిమాను కూడా జనం తిప్పికొట్టిన సంగతి తెలిసిందే.  సో.. తమ సినిమాలు తమకి ఎంత అద్బుతం అనిపించినా అది జనం మీద రుద్దే ప్రయత్నం చేయకూడదని హీరోలు ఎప్పటికి తెలుసుకుంటారో ఏమిటో.. 

Updated Date - 2022-08-28T15:05:11+05:30 IST