ఆ Hero సినిమాలు చూడొద్దు

ABN , First Publish Date - 2022-06-07T12:59:58+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వంపై గత కొంతకాలంగా తీవ్ర అసంతృప్తితో వున్న మదురై ఆధీనం మరోమారు తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆలయాలకు చెందిన విలువైన ఆస్తులను కాజేస్తున్నారంటూ

ఆ Hero సినిమాలు చూడొద్దు

- ఆలయాల ఆస్తులు కాజేస్తున్నారు

- దేవాలయాల ప్రతిష్ఠకు భంగం కలిగించేలా పాలకుల వ్యవహారం

- మదురై ఆధీనం ఆగ్రహం


ప్యారీస్‌(చెన్నై), జూన్‌ 6: రాష్ట్ర ప్రభుత్వంపై గత కొంతకాలంగా తీవ్ర అసంతృప్తితో వున్న మదురై ఆధీనం మరోమారు తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆలయాలకు చెందిన విలువైన ఆస్తులను కాజేస్తున్నారంటూ ఘాటైన విమర్శలు చేశారు. దేవాదాయ శాఖ ఆధీనంలో ఉన్న ఆలయాల నిర్వహణ బాధ్యతలను సాధువులకు అప్పగించాలని డిమాండ్‌ చేశారు. ప్రజాస్వామ్య దేశంలో ఆధ్యాత్మికవాదులు రాజకీయాలు నడపడం సబబేనని, హిందూ ధర్మాన్ని పరిరక్షించేందుకు హిందువులంతా శపథం చేయాలని పిలుపునిచ్చారు. మదురైలో విశ్వ హిందూ పరిషత్‌ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి జరిగిన సాధువుల మహానాడులో మదురై ఆధీనం హరిహర దేశిక జ్ఞానసంబంధ పరమాచార్య ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఆధీన పీఠాధిపతులు రాజకీయాలపై మాట్లాడవద్దంటూ సూచించే రాజకీయవేత్తలకు ఆలయాల నిర్వహణపై హక్కు లేదన్నారు. హిందూ దేవాదాయ శాఖ పరిధి నుంచి ఆలయాలను తొలగించి వాటి నిర్వహణ బాధ్యతలను న్యాయమూర్తి నేతృత్వంలో తమకు అప్పగించాలని డిమాండ్‌ చేశారు. ఆలయాల ఆస్తులు దోపిడీకి గురవుతున్నాయని, తమిళ సంస్కృతి, సంప్రదాయాలను మంటగలుపుతున్నారని ఆరోపించారు. ఆలయాలకు చెందిన విలువైన, అరుదైన నగలను ఎక్కడ కరిగిస్తున్నారో తెలియలేదని విమర్శించారు. ఒకవైపు ద్రావిడ భూమి అని చెబుతూనే, మరణించిన వారి పేరుతో పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్నారన్నారు. ఆలయాల ప్రతిష్ఠకు భంగం కలిగించే విధంగా ద్రావిడ పాలకులు వ్యవహరిస్తున్నారని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. హిందువులను కించపరిచేలా సినిమాల్లో డైలాగులు చెబుతున్న నటుడు విజయ్‌ సినిమాలను చూడరాదని మదురై ఆధీనం పిలుపునిచ్చారు. 

Updated Date - 2022-06-07T12:59:58+05:30 IST