Victory Venkatesh : కెరీర్ @ 36

ABN , First Publish Date - 2022-08-14T21:06:01+05:30 IST

టాలీవుడ్ సీనియర్ హీరోల్లో విక్టరీ వెంకటేశ్ (Victory Venkatesh) చాలా ప్రత్యేకం . తండ్రి రామానాయుడు (Ramanaidu) ప్రముఖ నిర్మాత. అవకాశాలకు ఎలాంటి ఢోకా లేదు. అయినప్పటికీ హీరోగా తనను తాను ప్రూవ్ చేసుకొని ఇండస్ట్రీలో నిలబడ్డారు.

Victory Venkatesh : కెరీర్ @ 36

టాలీవుడ్ సీనియర్ హీరోల్లో విక్టరీ వెంకటేశ్ (Victory Venkatesh) చాలా ప్రత్యేకం . తండ్రి రామానాయుడు (Ramanaidu) ప్రముఖ నిర్మాత. అవకాశాలకు ఎలాంటి ఢోకా లేదు.  అయినప్పటికీ హీరోగా తనను తాను ప్రూవ్ చేసుకొని  ఇండస్ట్రీలో నిలబడ్డారు. అటు యాక్షన్ చిత్రాలతో మాస్ జనాన్ని మెప్పిస్తునే, ఇటు అద్భుతమైన కామెడీ టైమింగ్‌తో కుటుంబ ప్రేక్షకులకీ అభిమాన కథానాయకుడయ్యారు. అలాంటి వెంకీ ఇండస్ట్రీలో హీరోగా అడుగుపెట్టి అప్పుడే 36 ఏళ్ళయిపోయింది. ‘కలియుగ పాండవులు’ (Kaliyuga Pandavulu) చిత్రంతో టాలీవుడ్‌లో హీరోగా తొలి అడుగు వేశారు వెంకీ.  సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 1986, ఆగస్ట్ 14న విడుదలై సూపర్ హిట్ సొంతం చేసుకుంది. ఈ సినిమా విడుదలై నేటికి సరిగ్గా 36 ఏళ్ళు పూర్తయ్యాయి.


అసలు వెంకటేశ్ టాలీవుడ్‌లో హీరోగా అడుగుపెట్టడం వెనుక చిన్న ఫ్లాష్ బ్యాక్ ఉంది. అది 1985వ సంవత్సరం. డి.రామానాయుడు అప్పటికే అగ్ర నిర్మాత. సూపర్ స్టార్ కృష్ణ (Krishna) తో ఆ టైమ్‌లో ఒక ప్రాజెక్ట్ ప్లాన్ చేసుకున్నారు. కానీ ఏవో కారణాల వల్ల అది కార్యరూపం దాల్చలేదు. చేతిలో దర్శకుడు రాఘవేంద్రరావు  (Raghavendra Rao) డేట్స్ ఖాళీగా ఉన్నాయి. అవి వృధా కాకూడదనే ఉద్దేశంతో పరుచూరి బ్రదర్స్ (Paruchuri Brothers) సలహా మేరకు తన చిన్న కుమారుడు వెంకటేశ్‌ను హీరోగా లాంఛ్ చేయాలని నిర్ణయించుకున్నారు రామానాయుడు. వెంటనే అమెరికాలో యంబీఏ చదువుతూ, అడపా దడపా మోడలింగ్ చేస్తున్న వెంకీకి కబురందింది. తండ్రి ఆర్డర్ వేస్తే వెంకీ రాకుండా ఉంటారా. వెంటనే బైలు దేరారు. అప్పటికి పరుచూరి బ్రదర్స్ పవర్ ఫుల్ స్ర్కిప్ట్ రెడీ చేశారు. బడ్జెట్ కోటిరూపాయల వరకూ తేలింది. అప్పట్లో అది చాలా పెద్ద మొత్తం. ప్రేమనగర్ (Prema Nagar) సినిమా టైమ్ లో ఇలాంటి రిస్క్ చేసిన రామానాయుడు ఆలోచించలేదు. 


కొత్తమ్మాయి ఖుష్బూ (Khushbhoo) ను కథానాయికగా ఎంపిక చేశారు. బాలీవుడ్ నటుడు శక్తి కపూర్ (Shakthi Kapoor) ను విలన్‌గా సెట్ చేశారు. తమిళ నటుడు రాధారవి (Radharavi) నీ ఒక ప్రత్యేక పాత్రకు ఎంపిక చేశారు. 1986 జనవరి 1న షూటింగ్ ప్రారంభమైంది. బిగినింగ్‌లో నెగెటివ్ టచ్‌తో ఉండి,  ఆ తర్వాత రిపెంటెన్స్ తో సమాజంలోని మార్పు కోసం పాటుపడే పాత్రలో వెంకీ అదరగొట్టారు. అంతకు ముందు వెంకీ నటనలో తీసుకున్న శిక్షణ దానికి బాగా ఉపయోగపడింది. భారీ తారాగణంతో హైదరాబాద్, మద్రాస్, వైజాగ్ లో షూటింగ్ జరిపారు. పబ్లిసిటీ భారీగా చేసి అప్పట్లో వార్తల్లో నిలిచారు. చిత్రాన్ని గ్రాండ్ గా విడుదల చేశారు. ఆ టైమ్‌లో తుఫాన్ సైతం ఎదుర్కొని చిత్రం కమర్షియల్ గా సూపర్ హిట్టయింది. 14 సెంటర్లలో అర్ధ శతదినోత్సవం జరుపుకుంది. వందరోజుల వేడుకను విజయవాడలో ఘనంగా జరిపారు. సూపర్ స్టార్ కృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలి సినిమాతోనే హీరోగా సూపర్ సక్సెస్ అయిన వెంకీ.. ఆ తర్వాత మళ్ళీ వెనుతిరిగి చూడలేదు. 

Updated Date - 2022-08-14T21:06:01+05:30 IST