బాలీవుడ్‌లో నిర్మాతగా మారిన సూర్య

ABN , First Publish Date - 2022-04-26T02:47:32+05:30 IST

విలక్షణమైన పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన నటుడు సూర్య. అతడు హీరోగా నటించిన చిత్రం ‘ఆకాశం నీ హద్దురా’. తమిళంలో ఈ సినిమాను ‘సూరరై పొట్రు’ పేరుతో రూపొందించారు.

బాలీవుడ్‌లో నిర్మాతగా మారిన సూర్య

విలక్షణమైన పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన నటుడు సూర్య. అతడు హీరోగా నటించిన చిత్రం ‘ఆకాశం నీ హద్దురా’. తమిళంలో ఈ సినిమాను ‘సూరరై పొట్రు’ పేరుతో రూపొందించారు. సుధా కొంగర దర్శకత్వం వహించింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సంచలన విజయం సాధించింది. కెప్టెన్ జీఆర్. గోపీనాథన్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఈ మూవీని నిర్మించారు. కరోనా మహమ్మారి విలయతాండవం చేసిన సమయంలో ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వేదికగా విడుదలైన విషయం తెలిసిందే. ఈ చిత్రం అభిమానుల మెప్పు పొందడంతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కించుకుంది. 


ఇప్పుడు ఇదే సినిమాను బాలీవుడ్‌లో రీమేక్ చేస్తున్నారు. హిందీ వెర్షన్‌కు సూర్య నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. అతడి సొంత నిర్మాణ సంస్థ ‘2డీ ఎంటర్ టైన్‌మెంట్’ హిందీలో ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్నాడు. రాధికా మదన్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సందర్భంగా అక్షయ్‌తో తీసుకున్న ఫొటోలను సూర్య సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. ‘‘కొత్త ప్రయాణం ప్రారంభమైంది. మీరందరూ ప్రేమ, ఆశీర్వాదాలు అందించాలి’’ అని ట్విట్టర్‌లో సూర్య పోస్ట్ పెట్టాడు. ప్రస్తుతం హిందీ వెర్షన్‌కు టైటిల్‌ను నిర్ణయించలేదు. 





Updated Date - 2022-04-26T02:47:32+05:30 IST