మరొక్కసారి మమ్మల్ని బతికించండి: హీరో Rajasekhar

ABN , First Publish Date - 2022-05-19T01:08:04+05:30 IST

డెత్ బెడ్ నుండి తిరిగొచ్చి సినిమా చేయగలిగాను అంటే దానికి కారణం ప్రేక్షకులు, శ్రేయోభిలాషులు, మిత్రుల ఆశీర్వాదమే. అందరూ కలసి నన్ను బతికించినట్లే నా సినిమాను చూసి మా బతుకు తెరువును మళ్లీ బతికించండి

మరొక్కసారి మమ్మల్ని బతికించండి: హీరో Rajasekhar

‘‘డెత్ బెడ్ నుండి తిరిగొచ్చి సినిమా చేయగలిగాను అంటే దానికి కారణం ప్రేక్షకులు, శ్రేయోభిలాషులు, మిత్రుల ఆశీర్వాదమే. అందరూ కలసి నన్ను బతికించినట్లే నా సినిమాను చూసి మా బతుకు తెరువును మళ్లీ బతికించండి..’’ అన్నారు హీరో రాజశేఖర్. ఆయన హీరోగా నటించిన 91వ సినిమా ‘శేఖర్’ (Shekar). జీవితా రాజశేఖర్ (Jeevitha Rajasekhar) దర్శకత్వంతో పాటు స్క్రీన్‪ప్లే అందించిన ఈ చిత్రాన్ని వంకాయలపాటి మురళీక్రిష్ణ సమర్పణలో.. పెగాసస్ సినీకార్ప్, టారస్ సినీకార్ప్, సుధాకర్ ఇంపెక్స్ ఐపీఎల్, త్రిపురా క్రియేషన్స్ పతాకాలపై బీరం సుధాకర్ రెడ్డి (Beeram Sudhakara Reddy), శివాని రాజశేఖర్ (Shivani Rajashekar), శివాత్మిక రాజశేఖర్ (Shivathmika Rajashekar), వెంకట శ్రీనివాస్ బొగ్గరం (Boggaram Venkata Srinivas) నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మే 20న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ వేడుకను గ్రాండ్‪గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సుకుమార్ (Sukumar), సముద్రఖని (Samuthirakani), రాజ్ తరుణ్ (Raj Tarun), ప్రశాంత్ వర్మ (Prashanth Varma) వంటి వారందరూ అతిథులుగా హాజరయ్యారు.


హైదరాబాద్‪లోని హోటల్ దస్పల్లాలో జరిగిన ఈ కార్యక్రమంలో హీరో రాజశేఖర్ మాట్లాడుతూ.. ‘‘ ఈ వేడుకకు సుకుమార్‪గారు, సముద్రఖనిగారు రావడం చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఆశీర్వదించడానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు. కోవిడ్ కారణంగా నేను ఎంతో ఇబ్బంది పడ్డాను. డెత్ బెడ్ నుండి తిరిగొచ్చి సినిమా చేయగలిగాను అంటే దానికి కారణం మీ అందరి ఆశీర్వాదమే. ఫ్యాన్స్, శ్రేయోభిలాషులు అందరూ కలసి నన్ను బతికించినట్లే నా సినిమాను చూసి మా బతుకు తెరువును మళ్లీ బతికించండి. మే 20న వస్తున్న మా సినిమాను మీరందరూ థియేటర్ కు వచ్చి చూడండి. సినిమా నచ్చితేనే.. పదిమందికి చెప్పండి. అప్పుడే మాతో పాటు సినిమా ఇండస్ట్రీ కూడా బాగుంటుంది. ఈ సినిమా కోసం నాకంటే కూడా జీవిత చాలా కష్టపడింది. తనెంత కష్టపడిందీ అనేది సినిమా చూస్తే మీకే తెలుస్తుంది. అలాగే మా ఇద్దరు కూతుర్లు కూడా పోస్ట్ ప్రొడక్షన్‪లో జీవితకు చాలా హెల్ప్ చేశారు. ఈ సినిమాకు ఇంత పేరు వచ్చిందంటే.. దానికి ముఖ్య కారణం అనూప్. చాలా అద్భుతమైన పాటలు ఇచ్చాడు. హీరోయిన్స్ చాలా చక్కగా చేశారు. నటీనటులు, టెక్నీషియన్స్ అందరి సపోర్ట్ చేయడంతో ఈ సినిమా చాలా బాగా వచ్చింది. అందరికీ ఈ చిత్రం కనెక్ట్ అవుతుంది’’ అన్నారు.


దర్శకురాలు జీవితా రాజశేఖర్ మాట్లాడుతూ.. ‘‘నేను అందరిలాగే సాధారణమైన మనిషినే. నాకు ఊహ తెలిసినప్పటి నుండి ఫైటింగ్ ఫైటింగ్. నేను ఎవరినీ ఎప్పుడూ మోసం చేయలేదు. నాకు చేతనైన సహాయం చేస్తా.. అలాగే నాకు కూడా చాలా మంది హెల్ప్ చేశారు. నేను అడిగిన వెంటనే వారు ఎంతో బిజీగా ఉన్నా.. ఈ ఫంక్షన్‪కు వచ్చారు. స్టేజ్ పై మీరు మాట్లాడిన మాటలు మాకెంతో ధైర్యాన్నిచ్చాయి. ఇలా ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ.. ఒకరికొకరు చేయూతనిస్తే.. తప్పకుండా ఈ ప్రపంచంలో అందరూ బాగుంటాము. కోవిడ్ తర్వాత అందరూ థియేటర్‪కు రావడం లేదు.. ఓటిటి‪లోనే చూస్తారు అని చెప్పారు. నేను ప్రేక్షకులకు ఒకటే చెపుతున్నా ఈ సినిమా చాలా మంచి సినిమా. ఇప్పటివరకు మంచి సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తూ వచ్చారు. మంచి కంటెంట్‪తో వస్తున్న ఈ సినిమాను కూడా  ఆదరించండి. టికెట్ రేట్స్ పెరగడం వలన ప్రేక్షకులు థియేటర్స్‪కు రావడం లేదని విన్నాను. మా సినిమాకు టికెట్ రేట్స్ పెంచడం లేదు. గవర్నమెంట్ పెట్టిన రేట్లకే మా సినిమాను ప్రదర్శిస్తున్నాము. మా సినిమా రిలీజ్ చేస్తున్న  బయ్యర్స్‪కు, డిస్ట్రిబ్యూటర్స్‪కు చెప్పాము. ఈ సినిమా టికెట్ రేట్స్ మీకు అందుబాటు ధరలోనే ఉంటాయి. దయచేసి  మీరందరూ ఈ నెల 20న థియేటర్స్‪కు వచ్చి మా సినిమాను సక్సెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను..’’ అన్నారు.

Updated Date - 2022-05-19T01:08:04+05:30 IST