ప్రేక్షకులకు పండుగలా ఉంటుంది

ABN , First Publish Date - 2022-08-10T06:02:47+05:30 IST

ఆరంభంలోనే హీరోగా నితిన్‌కు ప్రేక్షకులు ‘జయం’ పలికారు. మధ్యలో కొన్ని అపజయాలు ఎదురైనా ఆయన టాలీవుడ్‌లో అగ్రహీరోగా నిలదొక్కుకొన్నారు.

ప్రేక్షకులకు పండుగలా ఉంటుంది

ఆరంభంలోనే హీరోగా నితిన్‌కు ప్రేక్షకులు ‘జయం’ పలికారు. మధ్యలో కొన్ని అపజయాలు ఎదురైనా ఆయన టాలీవుడ్‌లో అగ్రహీరోగా నిలదొక్కుకొన్నారు. కథానాయకుడిగా రెండు దశాబ్దాల ప్రయాణాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకున్న నితిన్‌ ప్రస్తుతం ‘మాచర్ల నియోజకవర్గం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఎం. ఎస్‌. రాజశేఖర్‌ రెడ్డి దర్శకత్వంలో సుధాకర్‌ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మించిన చిత్రం ఇది. కృతిశెట్టి, క్యాథరీన్‌ థ్రెసా కథానాయికలు. ఈ నెల 12న విడుదలవుతున్న సందర్భంగా సినిమా విశేషాలను నితిన్‌ పంచుకున్నారు. 


హీరోగా 20 ఏళ్ల ప్రయాణం మీది. ఏమనిపిస్తోంది?

కొన్ని విజయాలు, కొన్ని అపజయాలు చూశాను. సినిమా ప్లాప్‌ అయితే వచ్చే విమర్శలు బాధ కలిగించేవి. వాటిని తట్టుకొని ఈ స్థాయిలో నిలబడడం ఆనందంగా ఉంది. హీరోగా మరింత ఎత్తుకు ఎదగాలనేది నా ప్రయత్నం. 


గ్యాప్‌ ఇచ్చి ‘మాచర్ల...’ లాంటి పూర్తిస్థాయి మాస్‌ చిత్రం చేయడానికి కారణం?

ప్రత్యేక కారణం అంటూ ఏమీ లేదు. ఇరవై ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నా. ప్రేమకథలపైన కొంత విసుగు వచ్చింది. విభిన్నంగా ప్రయత్నించి నెక్స్ట్‌ లెవల్‌కి వెళ్లాలనే ఆలోచనతో ‘మాచర్ల నియోజకవర్గం’ చేశాను. ఇది పూర్తి స్థాయి కమర్షియల్‌ మూవీ. శక్తిమంతమైన పాత్ర నాది. మాస్‌కు నచ్చే అన్ని హంగులు ఉన్నాయి. 


అభిమానుల కోసం కొత్తగా ఏం ట్రై చేశారు?

వాణిజ్య హంగులతో పాటు కథ చాలా కొత్తగా ఉంటుంది. పొలిటికల్‌ నేపథ్యంలో వచ్చిన చిత్రాలతో పోల్చితే ఇందులో ఉండే పాయింట్‌ కొత్తగా ఉంటుంది. ఫుల్‌ ఎంటర్టైన్‌మెంట్‌ అందించబోతున్నాం. మంచి పాటలు, డ్యాన్స్‌లు, ఫైట్స్‌ అన్నీఉన్నాయి. ప్రేక్షకులకు పండుగలా ఉంటుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను నచ్చుతుంది. ఫైట్స్‌ పవర్‌ఫుల్‌, స్టయిలీ్‌షగా ఉంటాయి. 


మీ పాత్ర ఎలా ఉండబోతోంది?

ఇందులో హీరో పాత్రను తీర్చిదిద్దిన తీరు నాకు బాగా నచ్చింది. తొలిసారి ఐఏఎస్‌ పాత్ర చేశాను. మాస్‌ సినిమా అయినప్పటికీ కథలో, క్యారెక్టర్‌లో చాలా ఫ్రెష్‌నెస్‌ ఉంటుంది. 


ఎడిటర్‌గా ఉన్న రాజశేఖర్‌కు డైరెక్టర్‌గా అవకాశమివ్వడానికి కారణం? 

‘లై’ షూటింగ్‌ సమయంలో తన ఎడిటింగ్‌ స్టయిల్‌ నాకు బాగా నచ్చింది. మంచి సూచనలు ఇచ్చేవాడు. అప్పుడే ‘నువ్వు డైరెక్టర్‌ అయితే బాగుంటుంది’ అని తనకు చెప్పాను. కొవిడ్‌లో ఒక కథ రాసుకొని చెప్పాడు. ఫస్ట్‌ సిట్టింగ్‌లోనే ఓకే చేశాను. తను ఎడిటర్‌ కావడం వల్ల పలు అంశాలపై పట్టు ఉంది. సినిమాలో ఉన్న చాలామంది నటీనటులను చక్కగా హ్యాండిల్‌ చేశాడు. 


ఐఏఎస్‌ పాత్రకోసం ఎలా సన్నద్ధమయ్యారు?

ఐఏఎస్‌ అనగానే క్లాస్‌గా ఉంటారనుకుంటాం. కానీ ఆ పాత్ర మాస్‌గా ఉంటే బాగుంటుందనే ఆలోచనతో అలా తీర్చిదిద్దాం. మా దర్శకుడు చాలామంది ఐఏఎస్‌ అధికారులను కలసి అధ్యయనం చే శారు. ఎక్కడ హుందాగా ఉండాలి, ఎక్కడ మాస్‌గా ఉండాలనేది తనే నాకు చెప్పాడు. 


కథానాయికల గురించి చెప్పండి?

క్యాథరీన్‌ పాత్ర కీలకంగా ఉంటుంది. కృతి తన పాత్రకు సంబంధించి అడిగే ప్రశ్నలు చాలా లోతుగా ఉంటాయి. హీరోయిన్స్‌లో అరుదైన గుణం ఇది. 


‘విక్రమ్‌’ తెలుగులో రిలీజ్‌ మీ నిర్ణయమే అని నాన్నగారు చెప్పారు కదా!

సినిమా అంటే ఇలా ఉండాలనిపించింది. అందుకే కొనమని చెప్పాను. రేట్ల జోలికి మాత్రం నేను వెళ్లను. ప్రస్తుతం వక్కంతం వంశీతో ఓ చిత్రం చేస్తున్నాను. 

Updated Date - 2022-08-10T06:02:47+05:30 IST