‘మురారి’ వంటి సినిమా మళ్లీ రాదు: గల్లా అశోక్

ABN , First Publish Date - 2022-04-05T02:56:01+05:30 IST

సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు, గుంటూరు ఎంపీ జయదేవ్ గల్లా తనయుడు అశోక్ గల్లా.. ఇటీవల వచ్చిన ‘హీరో’ చిత్రంతో హీరోగా అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. అమ‌ర్‌ రాజా మీడియా అండ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ సినిమా థియేట‌ర్లలోనూ

‘మురారి’ వంటి సినిమా మళ్లీ రాదు: గల్లా అశోక్

సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు, గుంటూరు ఎంపీ జయదేవ్ గల్లా తనయుడు అశోక్ గల్లా.. ఇటీవల వచ్చిన ‘హీరో’ చిత్రంతో హీరోగా అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. అమ‌ర్‌ రాజా మీడియా అండ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ సినిమా థియేట‌ర్లలోనూ, ఓటీటీలోనూ విడుద‌లై న‌టుడిగా త‌న‌కెంతో సంతృప్తినిచ్చింద‌ని అన్నారు అశోక్ గ‌ల్లా. మంగళవారం (ఏప్రిల్ 5) ఆయ‌న పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా తన తదుపరి చిత్ర విశేషాలను తెలియజేసేందుకు సోమ‌వారం అశోక్ గల్లా మీడియాతో ముచ్చటించారు. మీడియా వారు అడిగిన అనేకానేక ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు.


కొత్త గెట‌ప్‌‌లో క‌నిపిస్తున్నారు. ఏదైనా కొత్త సినిమా కోస‌మా?

‘హీరో’ స‌క్సెస్ త‌ర్వాత తిరుప‌తి వెళ్ళాను. అందుకే ఈ గెట‌ప్ క‌నిపిస్తుంది. ఆ సినిమాతో వృత్తిప‌రంగా సంతృప్తి చెందాను. సినిమాలో హీరోగా నిల‌బ‌డాల‌ని అనుకున్న‌ప్పుడు వ‌చ్చిన స‌క్సెస్ ఇది. ఇప్పుడు త‌ర్వాత ఏమి చేయాల‌నేది ఆలోచిస్తున్నాను.


హీరో క‌థ‌ను ద‌ర్శ‌కుడు శ్రీ‌రామ్ చెప్పిన‌ప్పుడు ఎలా అనిపించింది?

నేను మంచి క‌థ‌తో రావాల‌నుకున్నాను. ఆ స‌మ‌యంలో అనుకోకుండా శ్రీ‌రామ్ వ‌చ్చి భోజ‌నం టైంలో క‌థ చెప్పారు. అది విన్న‌వెంట‌నే ఇదే క‌దా మ‌నం చేయాల్సింది అనిపించింది. వెంట‌నే ఓకే చెప్పేశాను. ఆ త‌ర్వాత ఆయ‌న ఆఫీస్‌కూడా తీయ‌డం ప‌నులు జ‌ర‌గ‌డం చ‌కచ‌కా జ‌రిగిపోయాయి. మళ్లీ అవకాశం ఉంటే ఆయనతో తప్పకుండా సినిమా చేస్తాను. ప్ర‌స్తుతం వేరే సినిమా చేయాల‌నుకుంటున్నాను.


‘హీరో’ సినిమా చూశాక ఇంకా ఏమైనా కొత్త‌గా చేస్తే బాగుంటుంద‌నిపించిందా?

ఇది న్యూ ఏజ్ స్టోరీ. ఈ క‌థ‌ను కామెడీగా చూపించాం. సీరియ‌స్‌గానూ కామెడీ లేకుండా చేయ‌వ‌చ్చు. ప్రోగ్రెసివ్ స్టోరీ క‌నుక తెలుగు ఫార్మాట్‌లో చేయ‌డం వ‌ల్ల కొత్త కిక్ ఇచ్చేలా చేశాం.


త‌దుప‌రి చిత్రం కూడా మీ బ్యాన‌ర్‌‌లోనే ఉంటుందా?

తర్వాత చిత్రం బ‌య‌ట బ్యాన‌ర్‌‌లో ఉండ‌బోతోంది. త్వ‌ర‌లోనే ఆ వివ‌రాలు తెలియ‌జేస్తాను.


హీరో సినిమా విడుద‌ల‌య్యాక మీర‌నుకున్న‌ది ఫుల్‌ఫిల్ అయిందా?

సంక్రాంతికి రావాల్సింది రాలేదు. అప్పుడ‌యితే ప్రేక్ష‌కులు బాగా వ‌చ్చేవారు. అందుకే ప్రేక్ష‌కులు ఎక్కువ‌గా రాలేద‌నే కొద్దిగా నిరుత్సాహం ఉంది. మేం విడుద‌ల తేదీని చూసేట‌ప్పుడు అన్ని అంశాలు చూసుకున్నాం. క‌రోనా మార్చిలో ఎక్క‌వ‌వుతుంది అనుకున్నాం. కానీ జ‌న‌వ‌రిలోనే బాగా ఎక్కువైంది. ఏదైనా ప్రేక్ష‌కులు సేఫ్టీని దృష్టిలో పెట్టుకోవాలి క‌దా అందుకే పెద్ద‌గా ఫీల్‌ కాలేదు.


హీరో సినిమా చూశాక మ‌హేష్‌బాబు రెస్పాన్స్ ఎలా వుంది?

‘హీరో’ సినిమా చూశాక‌,  ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ యు.. అన్నారు. కేవ‌లం ఈ సినిమా గురించే చెప్పారు. అదేవిధంగా కంటిన్యుటీ‌లో చిన్న‌పాటి త‌ప్పిదాలు ఉంటే చెప్పారు.


ఓటీటీ విడుద‌ల త‌ర్వాత ఆడియ‌న్స్ స్పంద‌న ఎలా అనిపించింది?

ఓటీటీ విడుద‌ల నాకు సెకండ్ రిలీజ్‌‌లా అనిపించింది. అప్పుడే చాలా అభినంద‌న‌లు ద‌క్కాయి. ఇంకా హంగామా జ‌రిగిన‌ట్లుంది. థియేట‌ర్‌‌లో రిలీజ్ చేసేముందు రెండు నెల‌లు ప్ర‌మోష‌న్‌‌కు స‌రిపోయింది. నటనప‌రంగా అందరూ మెచ్చుకుంటుంటే నాపై నాకే న‌మ్మ‌కం వ‌చ్చేసింది. మోటివేషన్ ఎక్కువైంది. మ‌నం చేసింది బాగానే ఉంది అంటున్నారు కాబ‌ట్టి ఇంకా ఎక్కువ చేయాల‌నే ఎన‌ర్జీతోపాటు ఎంకరేజింగ్‌గా అనిపించింది.


హీరోగా మీకిది రెండో పుట్టిన‌రోజా?

కాదు. రెండేళ్ళు క‌రోనావ‌ల్లే సెట్‌‌లో గ‌డిచిపోయాయి. ఇది మూడో పుట్టిన‌రోజు.


హీరోగా కెరీర్ ఎలా ఉండ‌బోతోంది అనుకుంటున్నారు?

న‌టుడిగా ఇంకా మంచి పేరు తెచ్చుకోవాల‌నుంది. హీరో సినిమా న‌టుడిగా ప్రూవ్ అయ్యాక ఇంకా కాన్ఫిడెన్స్ పెరిగింది. త‌ర్వాత క‌థ‌లు, పాత్ర‌లు అనేవి కొత్త‌గా ఉండేలా చూసుకోవాలి. క‌మ‌ర్షియ‌ల్ సినిమాలే కాదు. అన్ని జాన‌ర్స్ చేయాల‌నుంది. ఫైటింగ్‌, డాన్స్ అనేది చేయ‌గ‌ల‌ను. న‌టుడిగా మంచి గుర్తింపు తెచ్చుకోవాల‌న్న‌దే నా కోరిక‌.


ఓటీటీలో చూశాక ఏదైనా కొత్త‌గా అనిపించిందా?

ఎడిటింగ్‌‌లోనే సినిమాను చాలా సార్లు చూశాను. రిలీజ్‌కు ముందు వంద‌సార్లు చూశాను. అందుకే ఓటీటీలో చూశాక పెద్ద‌గా తేడా అనిపించ‌లేదు.


క‌రోనావ‌ల్ల మొద‌ట సినిమా ఆల‌స్య‌మైంది. ఇప్పుడు స్పీడ్ పెంచుతారా?

ప్ర‌తి సినిమా రెండేళ్ళు చేయాలంటే క‌ష్ట‌మే. అందుకే సినిమాలు పెంచాల‌ని అనుకుంటున్నా.


తదుపరి సినిమాల వివ‌రాలు?

రెండు, మూడు సినిమాలు రెడీగా ఉన్నాయి. ఏద‌నేది ఫైన‌ల్ అయ్యాక జూన్‌‌లో తెలియ‌జేస్తాను.


ఎలాంటి జోన‌ర్‌లో వుండ‌బోతోంది?

క‌మ‌ర్షియ‌ల్ కామెడీ చేసేశాను. కాబ‌ట్టి క‌థ‌లో డెప్త్ ఉండేవి చేయాల‌నుంది. ఇంటెన్సిటీ ఉండే క‌థ‌లే చేయాల‌నుకుంటున్నా.


మీకు న‌టుడిగా స్పూర్తి ఎవ‌రు?

ఇంకెవ‌రు.. మ‌హేష్‌ బాబుగారే. నేను పెరిగింది ఆయ‌న సినిమాలు చూసే. న‌ట‌న వాతావ‌ర‌ణం అంతా నా చుట్టూనే వుంది.


ఆయ‌న నుండి ఏం నేర్చుకున్నారు?

సెల్ప్ బిలీఫ్ అనేది మ‌హేష్‌గారికి బాగా తెలుసు. కాన్ఫిడెన్స్ అనేది మ‌నలోనే ఉంటుంది. ఇవి ఆయ‌న నుండి నేర్చుకున్నా.


పాన్ ఇండియా సినిమాలు వస్తున్న త‌రుణంలో మీరు హీరోగా చేయ‌డం ఎలా అనిపిస్తుంది?

వాటి గురించి పెద్ద‌గా ఆలోచించ‌లేదు. తెలుగులోనే ప‌రిచ‌యం అవ్వాల‌నుకున్నాను. ప‌రిచ‌యం అయ్యా. ఇక్క‌డే ఉండాల‌నుకుంటున్నా. పాన్ ఇండియా మార్కెట్ అనేది నిర్మాత చూసుకుంటారు. నేను ఒక‌చోట నిల‌బ‌డితే ఆ త‌ర్వాత పాన్ ఇండియా అనేది ఆలోచించాలి.


సూప‌ర్‌స్టార్ ఫ్యామిలీ నుంచి వ‌స్తున్నారు కాబ‌ట్టి ఏవైనా స‌ల‌హాలు ఫ్యామిలీలో ఇచ్చారా?

ఏదైనా హిట్, ప్లాప్ పైనే ఆధార‌ప‌డి ఉంటుంది. మంచి క‌థ‌లు, పాత్ర‌లు చేయ‌డ‌మే నా ముందున్న క‌ర్త‌వ్యం.


ఒత్తిడి ఏమైనా వుందా?

అలాంటిది ఇప్పుడు ఏమీ లేదు. మొద‌టి సినిమాకు ఏదైనా త‌ట్టుకోగ‌ల‌వా? అని ఫ్యామిలీలో అడిగేవారు. హీరో సినిమా రిలీజ్ టైంలో కొంచెం టెన్ష‌న్ గుర‌య్యాను. ఇప్పుడు అదేమీలేదు. త‌ర్వాత సినిమాపై దృష్టంతా వుంది.


కృష్ణ‌గారు మీ హీరో సినిమాను ఎన్నిసార్లు చూశారు?

ఆయ‌న ఒక‌సారే చూశారు. కౌబాయ్ సినిమా కాబ‌ట్టి బాగా ఎంజాయ్ చేశారు. సినిమా చూశాక పర్ఫెక్ట్ సంక్రాంతి సినిమా అని చెప్పేశారు.


ఈసారి పుట్టిన‌రోజు ఎలా సెల‌బ్రేట్ చేసుకోబోతున్నారు?

పెద్ద‌గా ఏమీ చేసుకోను. నా ఫ్యామిలీతోనే సెల‌బ్రేష‌న్‌. అయితే ఈసారి 30వ పుట్టిన‌రోజు కాబ‌ట్టి స్నేహితుల‌తో చేసుకుంటాను.


మ‌హేష్‌బాబు సినిమాల్లో మీరు చేయాల‌నుకుంటే ఏ మూవీ చేస్తారు?

మురారి సినిమా. అలాంటి సినిమా మ‌ర‌లా రాలేదు. ముందుముందు కూడా రాదు.

Updated Date - 2022-04-05T02:56:01+05:30 IST