‘రాధాకృష్ణ’తో పరోక్షంగా వారికి హెల్ప్ చేశాం: హీరో అనురాగ్

ABN , First Publish Date - 2021-02-06T23:57:19+05:30 IST

హీరో అనురాగ్ నటించిన మొదటి చిత్రం 'రాగల 24 గంటల్లో'తోనే మంచి గుర్తింపును పొందారు. ఆయన హీరోగా 'ఢ‌మ‌రుకం' ఫేమ్ శ్రీనివాస‌రెడ్డి స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణలో

‘రాధాకృష్ణ’తో పరోక్షంగా వారికి హెల్ప్ చేశాం: హీరో అనురాగ్

హీరో అనురాగ్ నటించిన మొదటి చిత్రం 'రాగల 24 గంటల్లో'తోనే మంచి గుర్తింపును పొందారు. ఆయన హీరోగా 'ఢ‌మ‌రుకం' ఫేమ్ శ్రీనివాస‌రెడ్డి స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణలో రూపొందిన చిత్రం 'రాధాకృష్ణ‌'. అనురాగ్‌, ముస్కాన్ సేథీ (పైసా వ‌సూల్ ఫేమ్‌) హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో లక్ష్మీ పార్వతి ఒక కీల‌క‌పాత్ర‌ పోషించారు. టి.డి.ప్ర‌సాద్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వహించిన ఈ చిత్రాన్ని హ‌రిణి ఆరాధ్య‌ క్రియేష‌న్స్ ప‌తాకంపై పుప్పాల సాగ‌రిక కృష్ణ‌కుమార్‌ నిర్మించారు. ఫిబ్ర‌వ‌రి 5న ఈ చిత్రం విడుదలై సక్సెస్ టాక్‌తో రన్ అవుతోంది. ఈ సందర్భంగా హీరో అనురాగ్ మీడియాతో చిత్ర విశేషాలను పంచుకున్నారు. 


నటుడిగా మీ ప్రయాణం ఎలా మొదలైంది? ఈ సినిమాలో ఎలా అవకాశం వచ్చింది?

- ఇండస్ట్రీలో అలీగారు నాకు పరిచయం. ఆయన ద్వారా శ్రీనివాసరెడ్డిగారిని కలిశాం. నా గురించి అలీగారు శ్రీనివాసరెడ్డి గారికి చెప్పారు. అప్పటి నుంచి వారితో నాకు మంచి సాన్నిహిత్యం మొదలైంది. వారు చెప్పడం వల్ల 'రాగల 24 గంటల్లో' సినిమాలోని ముగ్గురు హీరోల్లో ఒకరిగా చేశాను. నా యాక్టింగ్ బాగా నచ్చి నన్ను 'రాధాకృష్ణ' మూవీకి రికమండ్ చేశారు. అలా రాధాకృష్ణ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. శ్రీనివాసరెడ్డి గారి వల్ల ఈ సినిమా ఇప్పుడు ఇంత సక్సెస్ అయ్యింది.


మీ బ్యాక్‌గ్రౌండ్ గురించి చెప్పండి..

- నేను హైదరాబాదీని. ఇంటీరియర్ డిజైనింగ్ కంప్లీట్ చేశాను. ఆ తర్వాత సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీకి వచ్చాను. మా ఫ్యామిలీ నన్ను బాగా సపోర్ట్ చేస్తుంది. నా కుటుంబ సభ్యుల సపోర్ట్ వల్లే నేను హీరో కాగలిగాను.


ఈ సినిమాలో మీ పాత్ర గురించి తెలిసినప్పుడు ఎటువంటి ఫీలింగ్‌ కలిగింది?

- మెయిన్ లీడ్ క్యారెక్టర్ నన్ను చేయమనడం నాకు పెద్ద విషయంగా అనిపించింది. 'రాగల 24 గంటల్లో' సినిమాలో నా క్యారెక్టర్ డ్యూరేషన్ తక్కువగా ఉంటుంది. రాధాకృష్ణ లో చేయమనగానే చాలా ఎగ్జైటింగ్ గా అనిపించింది. ఒక పక్క టెన్షన్‌గా ఉంది. మరోవైపు ఎగ్జైట్మెంట్. రాధాకృష్ణ సినిమాలో మంచి క్యారెక్టర్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది.


నిర్మల్ బొమ్మల బ్యాక్ డ్రాప్‌లో.. ? మీరేం తెలుసుకున్నారు?

- నిర్మల్ బొమ్మల బ్యాక్ డ్రాప్‌లో సినిమా చేయడాన్ని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నిర్మల్ బొమ్మల ప్రసిద్ధి గురించి ఇప్పటి వారికి అంతగా తెలియదు. ఈ సినిమా ద్వారా ఓ మంచి సందేశం నా ద్వారా వెల్లడం చాలా ఆనందంగా ఉంది. నిర్మల్ బొమ్మలను తయారు చేసే వారి కష్టం తెలిసింది. మన సంస్కృతిని కాపాడుకోవాలి. మాటల్లో చెప్పలేను వారి కష్టాన్ని. వారికి ఈ సినిమా ద్వారా పరోక్షంగా హెల్ప్ చేశామని మాకు అనిపిస్తోంది.


షూటింగ్ ఎక్స్‌పీరియన్స్‌ గురించి..?

- అమేజింగ్ ఎక్స్‌పీరియన్స్‌. మన దగ్గర కూడా ఇంత మంచి లొకేషన్స్ ఉన్నాయా? అనిపించింది. చిత్ర యూనిట్ అందరూ బాగా సహకరించారు. శ్రీనివాస రెడ్డిగారి స్క్రీన్‌ప్లేకు ఓ డిఫరెంట్ యాంగిల్ ఉంటుంది. కొత్త విషయాలను నేర్చుకున్నాను. ముస్కాన్ హార్డ్ వర్కింగ్ హీరోయిన్.


మీ సినిమాకు డైరెక్టర్, ప్రొడ్యూసర్ కొత్తవారు. సినిమా స్టార్టింగ్‌లో ఏమనిపించింది?

- మేజర్‌గా కొత్తవారు ఉన్నా.. ఎక్స్‌పీరియన్స్ ఉన్నవారు కూడా ఉన్నారు. ప్రసాద్ అన్న శ్రీనివాసరెడ్డి గారి దగ్గర పనిచేశారు. ప్రసాద్ గారికి ఆ అనుభవం ఉంది కాబట్టి మా పని సులువు అయ్యింది. శ్రీలేఖగారు మంచి సంగీతం అందించారు. చిన్న సినిమా అని ఆమె అనుకోలేదు. మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. థియేటర్లో సినిమాను చూసినప్పుడు ప్రేక్షకులు ఎమోషనల్ అయ్యారు. మేం కూడా భావోద్వేగానికి లోనయ్యాం. మా టీమ్ అంతా కష్టపడి మంచి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాం. చాలా ఆనందంగా ఉంది.


విజయశాంతిగారు మీ సినిమాలోని పాటను విడుదల చేశారు?

- విజయశాంతిగారు మా సినిమాలోని 'నిర్మల బొమ్మా' సాంగ్ విడుదల చేశారు. ఆమెకు థ్యాంక్స్. విజయశాంతి గారిని చిన్నప్పుడు సినిమాల్లో, టీవీల్లో చూశాను. సాంగ్ రిలీజ్ చేయడానికి వెళ్లినప్పుడు ఆమె చాలా బాగా మాట్లాడారు. విజయశాంతిగారితో మాట్లాడిన మాటలను మర్చిపోలేను.


లక్ష్మీపార్వతిగారు నటించినట్లు ఉన్నారు?

- లక్ష్మీపార్వతిగారు మా సినిమాలో నటిస్తారని మేం ఊహించలేదు. షూటింగ్‌కి రెండు రోజుల ముందు మాకు తెలిసింది ఆమె చేస్తున్నారని. ఆమెతో కలిసి వర్క్ చేయడాన్ని నా అదృష్టంగా భావిస్తున్నాను.


మీ డ్రీమ్ రోల్ ఏంటీ?

- ఒక యాక్టర్‌గా అన్ని రకాల పాత్రలు చేయాలనుకుంటున్నాను. ఎప్పటికప్పుడు నన్ను నేను సిల్వర్ స్క్రీన్‌పై కొత్తగా చూడాలనుకుంటున్నాను. ఇప్పుడు చేస్తున్న సినిమాలో ఓ మంచి క్యారెక్టర్ చేస్తున్నాను. అది ప్రేక్షకులకు నచ్చుతుంది.

Updated Date - 2021-02-06T23:57:19+05:30 IST