అందమైన చందమామ కథ ‘బింబిసార’

ABN , First Publish Date - 2022-07-05T05:53:03+05:30 IST

కల్యాణ్‌రామ్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘బింబిసార’. ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ పతాకంపై హరికృష్ణ నిర్మించారు....

అందమైన చందమామ కథ ‘బింబిసార’

కల్యాణ్‌రామ్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘బింబిసార’. ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ పతాకంపై హరికృష్ణ నిర్మించారు. వశిష్ఠ్‌ దర్శకుడు. సంయుక్త మీనన్‌, కేథరిన్‌ కథానాయికలు. మంగళవారం కల్యాణ్‌ రామ్‌ పుట్టిన రోజు. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో ట్రైలర్‌ని ఆవిష్కరించారు. కల్యాణ్‌ రామ్‌ మాట్లాడుతూ ‘‘ఎన్నో చందమామ కథలు చదివాం.. చూశాం. అలాంటి ఓ అందమైన చందమామ కథ ‘బింబిసార’. సోషియో ఫాంటసీ ఎలిమెంట్స్‌ ఉన్న సినిమా ఇది. ఈ యేడాది మా తాతగారి శత జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఈ చిత్రాన్ని ఆయనకు అంకితం ఇస్తున్నాం. ఆగస్టు 5న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నామ’’న్నారు. ‘‘ప్రతి రోజు, ప్రతి క్షణం కల్యాణ్‌ రామ్‌ గారు నన్ను ప్రోత్సహిస్తూనే ఉన్నారు. ఆయన లేకపోతే ఈ సినిమా లేదు. ‘బింబిసారుడు’ యుద్ధం చేస్తే ఎలా ఉంటుందో త్వరలో వెండి తెరపై మీరు చూడబోతున్నార’’న్నారు దర్శకుడు. సంయుక్త మాట్లాడుతూ ‘‘ఓ సినిమాపై తెలుగు ప్రేక్షకులు చూపించినంత ప్రేమ మరెక్కడా కనిపించదు. ఇంత పెద్ద ప్రాజెక్టులో నేను భాగస్వామిని కావడం ఆనందంగా ఉంద’’న్నారు. దర్శకుడికి ఇది తొలి సినిమానే అయినా చాలా క్లారిటీతో తెరకెక్కించారని కేథరిన్‌ తెలిపారు. చిరంతన్‌ భట్‌ స్వరాలు సమకూర్చారు. ఎం.ఎం.కీరవాణి నేపథ్య సంగీతాన్ని అందించారు.


Updated Date - 2022-07-05T05:53:03+05:30 IST