ఇంతందం దారి మళ్లిందా

ABN , First Publish Date - 2022-07-05T05:51:53+05:30 IST

‘‘చిలకే కోక కట్టి నిన్నే చుట్టు ముట్టి సీతాకోకైందా’’ అంటూ ఓ అబ్బాయి అందంగా వర్ణిస్తే.. ఏ అమ్మాయైునా మురిసిపోకుండా ఉంటుందా...

ఇంతందం దారి మళ్లిందా

‘‘చిలకే కోక కట్టి నిన్నే చుట్టు ముట్టి సీతాకోకైందా’’ అంటూ ఓ అబ్బాయి అందంగా వర్ణిస్తే.. ఏ అమ్మాయైునా మురిసిపోకుండా ఉంటుందా? సీత కూడా ఈ మాటకే మురిసిపోయింది. రామ్‌ కోసం పరితపించిపోయింది. ఈ అందమైన  ప్రేమ కథేంటో తెలియాలంటే ‘సీతారామం’ చూడాలి. దుల్కర్‌ సల్మాన్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రమిది. మృణాల్‌ ఠాకూర్‌ కథానాయిక. రష్మిక ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. హను రాఘవపూడి దర్శకుడు. అశ్వినీదత్‌ నిర్మాత. ఈ చిత్రంలోని ‘ఇంతందం దారి మళ్లిందా’ అనే గీతాన్ని సోమవారం విడుదల చేశారు. కె.కె రాసిన ఈ గీతాన్ని ఎస్‌.పి. చరణ్‌ ఆలపించారు. విశాల్‌ చంద్రశేఖర్‌ స్వరపరిచారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘ఈ సినిమాలోని నాకు నచ్చిన పాట ఇది. కె.కె. చాలా బాగా రాశారు. ఆయన ఎక్స్‌ప్రెషన్స్‌ చూస్తే వేటూరిగారు గుర్తుకొచ్చారు. ‘చిలకే కోక కట్టి నిన్నే చుట్టు ముట్టి సీతాకోకైందా’ అనే లైన్‌ నాకు ఇంకా బాగా నచ్చింద’’న్నారు. కె.కె మాట్లాడుతూ ‘‘1965 నేపథ్యంలో సాగే కథ ఇది. అందుకే అచ్చమైన తెలుగు పదాలతోనే ఈ పాట ఉండాలని దర్శకుడు చెప్పారు. కొత్త భావాల గురించి ఆలోచించాల్సివచ్చింది. తెరపై చాలా అందంగా తెరకెక్కించారు’’ అన్నారు. ‘‘ఈ చిత్రంలోని ప్రతి పాట మనసుని హత్తుకొనేలా ఉంటుంద’’న్నారు సంగీత దర్శకుడు. ‘‘ప్రతీ ఫ్రేమూ చాలా అద్భుతంగా కుదిరింది. ఈ పాటలో నన్ను చాలా అందంగా చూపించారు. ఇంత పెద్ద నిర్మాణ సంస్థలో నాకు అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నా’’ అన్నారు మృణాల్‌ ఠాకూర్‌. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఆగస్టు 5న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. 


Updated Date - 2022-07-05T05:51:53+05:30 IST