దిగ్విజయంగా పదేళ్ల సినీ ప్రయాణం

ABN , First Publish Date - 2022-08-10T05:58:30+05:30 IST

టాలీవుడ్‌లో ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థలు హారికా అండ్‌ హాసినీ క్రియేషన్స్‌, సితార ఎంటర్టైన్‌మెంట్స్‌ అరుదైన ఘనతను సాధించాయి.

దిగ్విజయంగా పదేళ్ల సినీ ప్రయాణం

టాలీవుడ్‌లో ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థలు హారికా అండ్‌ హాసినీ క్రియేషన్స్‌, సితార ఎంటర్టైన్‌మెంట్స్‌ అరుదైన ఘనతను సాధించాయి. ఈ రెండు సంస్థలు మంగళవారంతో పదేళ్ల సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నాయి. ఈ సందర్భంగా తమను ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలుపుతూ హారికా అండ్‌ హాసినీ క్రియేషన్స్‌, సితార ఎంటర్టైన్‌మెంట్స్‌ సంస్థలు ఓ వీడియోను విడుదల చేశాయి. ‘‘మా ఎన్నో ఏళ్ల కల ‘జులాయి’ చిత్రంతో నెరవేరింది. విభిన్న చిత్రాలను నిర్మించడానికి  ప్రేక్షకులుగా మీరిచ్చిన పోత్రాహమే అందుకు కారణం. మీ సహకారం వల్లే మరిన్ని సవాళ్లు స్వీకరించాం. మున్ముందు అద్భుతమైన చిత్రాలతో మిమ్మల్ని అలరిస్తాం. ఇకముందు కూడా మీ అభిమానం, ఆశీస్సులు, మద్దతు ఇలాగే అందించాలి’’ అని  ప్రేక్షకులను కోరాయి. ఈ రెండు బ్యానర్ల నుంచి పదేళ్లలో 16 చిత్రాలు రాగా అందులో మెజారిటీ సినిమాలు ప్రేక్షకులను మెప్పించడం విశేషం. హారికా అండ్‌ హాసిని క్రియేషన్స్‌ బేనర్‌లో సూర్యదేవర రాధాకృష్ణ, సితార బేనర్‌పై సూర్యదేవర నాగవంశీ చిత్రాలు నిర్మిస్తున్నారు. దర్శకుడు త్రివిక్రమ్‌తో ఈ రెండు సంస్థలకు మంచి అనుబంధం ఉంది. త్వరలో మరిన్ని అద్భుతమైన సినిమాలు ఈ సంస్థల నుంచి రాబోతున్నాయి. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న చిత్రం, ధనుష్‌ హీరోగా ‘సార్‌’, బెల్లంకొండ గణేశ్‌ హీరోగా ‘స్వాతిముత్యం’, నవీన్‌ పొలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’, సిద్ధు ‘డీజే టిల్లు 2’, పంజా వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా ఓ చిత్రం, సూర్యతో మలయాళ చిత్రం ‘కప్పెల’ రీమేక్‌ నిర్మాణంలో ఉన్నాయి. 

Updated Date - 2022-08-10T05:58:30+05:30 IST