Gundamma katha: మన గుండమ్మకు 60 వసంతాలు!

Twitter IconWatsapp IconFacebook Icon

తెలుగు సినిమాకు రెండు కళ్ళులాంటి అగ్ర కథానాయకులు ఎన్టీఆర్‌ (NTR), ఏయన్నార్‌ (ANR)కలసి మొత్తం 14 చిత్రాల్లో నటించారు. 1954లో వచ్చిన ‘రెచుక్క’ చిత్రం తర్వాత దాదాపు ఎనిమిదేళ్ళ వరకూ వీరిద్దరు మరో చిత్రంలో నటించలేదు.  దీనికి ప్రధాన కారణం స్టార్స్‌గా ఎదిగిన వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా తీయడానికి తగిన కథ దొరకక పోవడమే. అందుకే విడివిడిగా సినిమాలు చేస్తూ మార్కెట్‌ పెంచుకుంటున్న వీరిద్దరినీ మళ్లీ కలిపిన ఘనత విజయా సంస్థ అధినేతల్లో ఒకరైన చక్రపాణిదే(Chakrapani). జానపద బ్రహ్మ విఠలాచార్య (Vitalacharya) కన్నడంలో ‘మనే తుంబెద హెన్ను’ పేరుతో ఒక చిత్రం తీశారు. అందులో ప్రధాన పాత్ర పేరు గుండమ్మ. కన్నడ చిత్రం హక్కులు నిర్మాత నాగిరెడ్డికి ఇచ్చారు. ఈ కథను తెలుగులో తిద్దామని నాగిరెడ్డి (Nagireddy) ఆలోచన. విజయా సంస్థ పర్మనెంట్‌ హీరో ఎన్టీఆర్‌ ‘జగదేక వీరుని కథ’ చిత్రం మళ్లీ ఆయనతో సినిమా తీయడం కోసం ‘మనే తుంబెద హెన్ను’ కథ పనికి వస్తుందేమో చూడమని చక్రపాణి చెప్పారు నాగిరెడ్డి. చక్రపాణికి కన్నడ కథ నచ్చలేదు. ఆ కథలో గుండమ్మకు భర్త, ఒక సవితి కూతురు, ఒక సొంత కూతురు ఉంటారు. సవితి కూతుర్ని ఒక పిచ్చి వాడికి ఇచ్చి పెళ్లి చేస్తుంది. ఆ సవతి కూతురుకు ఒక మేనమామ ఉంటాడు. గుండమ్మ మీద పగ తీర్చుకోవడం కోసం ఆమె సొంత కూతురికి మంచి సంబంధం అని చెప్పి ఒక జైలు పక్షిని ఇచ్చి పెళ్లి చేస్తాడు. అప్పటి నుంచి గుండమ్మ, ఆమె కూతురు ఎన్నో కష్టాలు పడతారు. సవతి కూతురు మాత్రం హాయిగా కాపురం చేసుకుంటూ ఓ పిల్లాడిని కూడా కంటుంది. ఎన్టీఆర్‌తో సినిమా తీస్తూ ఈ పిచ్చి కథ ఏమిటి నాన్సెన్స్‌.. అని రచయిత డి.వి నరసరాజును పిలిపించి ఆ కథను పూర్తిగా మార్చేసి కొత్త కథ తయారు చేయమన్నారు. గుండమ్మ, ఆమె సవతి కూతురు, సొంత కూతురు... ఈ మూడు పాత్రలను మాత్రమే తీసుకుని కొత్త కథ వండేసారు చక్రపాణి, నరసరాజు. (Gundamma katha completes 60 years)


Gundamma katha: మన గుండమ్మకు 60 వసంతాలు!


సినిమాలో ఇంకో హీరో పాత్ర ఉండడంతో ఆ పాత్రకు ఏయన్నార్ ను ఎన్నుకున్నారు చక్రపాణి. ఎన్టీఆర్ సరసన సావిత్రిని ఎంపిక చేశారు. ఎన్టీఆర్, ఏయన్నార్ లకు తండ్రిగా ఎస్ వి రంగారావు, గుండమ్మ పాత్రకు సూర్యకాంతం ఫిక్స్ అయ్యారు. ఇక ఇందులో మరో ముఖ్య పాత్ర సరోజ. కొంచెం వగరు, పొగరు, పెంకితనం ఉన్న ఆ పాత్రను జమున పోషిస్తే బాగుంటుందని చక్రపాణి ఆలోచన. అయితే ఆమెతో కలసి నటించకుడదని ఎన్టీఆర్, ఏయన్నార్ తీర్మానించుకుని అప్పటికి మూడేళ్లు అయింది. తన సినిమా కోసం అయినా వీళ్ళని కలపాల్సిందే అని నిర్ణయించుకున్న చక్రపాణి ముగ్గురినీ కూర్చోబెట్టి రాజీ కుదిర్చారు.


గుండమ్మ కథ షూటింగ్ ప్రారంభించే సమయానికి ఎన్టీఆర్, ఏయన్నార్, సావిత్రి , జమున, రంగారావు...అందరూ బిజీ. బల్క్ డేట్స్ ఎవరివి లేవు. అయినా ధైర్యంగా అడుగు ముందుకు వేశారు చక్రపాణి. గుండమ్మ కథ చిత్రానికి కమలాకర కామేశ్వరరావు దర్శకుడైనా ఆ సినిమాకు కర్త కర్మ క్రియ అన్నీ చక్రపాణే.  చిత్ర నిర్మాణం ఆయన కనుసన్నలలో జరిగింది. మరో విషయం ఏమిటంటే గుండమ్మ కథ చిత్రాన్ని తమిళంలో మనిదన్ మార విల్లయ్ పేరుతో విజయా సంస్థ నిర్మించింది. ఆ చిత్రానికి చక్రపాణి దర్శకుడు కావడం విశేషం..తమిళ వర్షన్ లో అక్కినేని, సావిత్రి ,జమున, రంగారావు కూడా నటించారు. ఎన్టీఆర్ వేషాన్ని జెమినీ గణేశన్ పోషించారు.అలాగే సూర్యకాంతం పోషించిన గుండమ్మ పాత్రను తమిళంలో సుందరి బాయ్ చేశారు. సమాన స్థాయి కలిగిన ఇద్దరు అగ్ర కథానాయకులు కలసి నటిసున్నాప్పుడు ఎటువంటి అపార్ధాలు తావు లేకుండా వారి పాత్రలు తీర్చిదిద్దడం కత్తి మీద సామే. అయినా ఈ విషయంలో ఎంతో జాగ్రత్త వహించారు చక్రపాణి..టైటిల్స్ వేసే సమయంలో కూడా ఎవరి పేరు ముందు వేస్తే ఎలాంటి గొడవలు వస్తాయోనని పేర్లు వేయకుండా ఫోటోలు చూపించి చేతులు దులుపుకున్నారు చక్రపాణి. (60 years for Gundamma katha)

Gundamma katha: మన గుండమ్మకు 60 వసంతాలు!

60 ఏళ్ల నాడు అంటే 1962 జూన్ 7 న గుండమ్మ కథ చిత్రం విడుదలైంది. వినోద చిత్రాల చరిత్ర లో మాస్టర్ పీస్ గా నిలిచి పోయింది. గుండమ్మ కథ చిత్రాన్ని మళ్లీ తీయాలనే ప్రయత్నం రెండు సార్లు జరిగింది. నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున ఈ చిత్రంలో నటించడానికి ఆసక్తి చూపించారు. ఎస్ వి రంగారావు వేషాన్ని ప్రకాష్ రాజ్ తో వేయించాలనుకున్నరు కానీ గుండమ్మ పాత్ర ఎవరు పోషిస్తే బాగుంటుందో తేలక ఆ చిత్ర నిర్మాణం అక్కడితో ఆగిపోయింది. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్, నాగ చైతన్య కూడా ఈ కథ మీద మోజు చూపారు కానీ వారి ఉత్సాహానికి స్పీడ్ బ్రేకర్ గుండమ్మ పాత్రే. సూర్యకాంతం ను చూసిన కళ్ళతో ఆ పాత్రలో మరొకరిని చూడడం అసాధ్యం. సూర్యకాంతం కు రీ ప్లేస్ మెంట్ లేదనడానికి గుండమ్మ పాత్రే మంచి ఉదాహరణ.


మాట్ని షో తో మొదలైన గుండమ్మ కథ  ఆ రోజుల్లో అంటే 60 ఏళ్ల క్రితం ఇప్పటిలా  అన్ని రోజులు నాలుగు ఆటలు, ఐదు ఆటలు ప్రదర్శించే పద్దతి లేదు..రోజుకి మూడు ఆటలే.  కాకపోతే శని, ఆదివారాల్లో మాత్రం నాలుగు ఆటలు ప్రదర్శించేవారు. ఎంత పెద్ద హీరో నటించిన సినిమా అయినా మాట్నీతో మొదలు కావాల్సిందే. 1962 జూన్ 7 గురువారం నాడు భారీ మల్టీస్టారర్ చిత్రం గుండమ్మ కథ విడుదల అయింది. ఎన్టీఆర్, ఏయన్నార్, సావిత్రి, జమున, ఎస్ వి రంగారావు, సూర్యకాంతం, రమణారెడ్డి, రాజనాల, ఛాయాదేవి, అల్లు రామలింగయ్య తదితరులు నటించారు. విజయా వారి సినిమా అంటే అందులో రేలంగి తప్పకుండా ఉండాల్సిందే. కానీ గుండమ్మ కథ సినిమాలో ఆయన లేరు. ఆ సినిమాలో తనకు వేషం లేదన్న విషయం తెలియగానే నిర్మాతల్లో ఒకరైన చక్రపాణి దగ్గరకు వెళ్ళి అడిగేశారు. నువ్వేసే యాషం ఇందులో లేదు..అందుకే నిన్ను పిలవలా..అని చక్రపాణి. మరి రమణారెడ్డి ఉన్నాడు కదా అని ఉక్రోషంగా అడిగారు రేలంగి... ఆడిది విలన్ యాషం...చక్రపాణి సమాధానం. మరి ఆ వేషం నేను వేయాలేనా? అని ప్రశ్నించారు రేలంగి. నువ్వు ఎస్తావు.. కానీ జనం చూడరు...కూల్ గా చెప్పారు చక్రపాణి.


- వినాయకరావు


Gundamma katha: మన గుండమ్మకు 60 వసంతాలు!


AJ Youtube channels bg ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.