‘రయీస్’ సినిమా వివాదం.. Shah Rukh Khanపై కేసు కొట్టేసిన గుజరాత్ హైకోర్టు

ABN , First Publish Date - 2022-04-28T16:32:54+05:30 IST

బాలీవుడ్ యాక్టర్ షారుఖ్ ఖాన్ 2017లో నటించిన చిత్రం ‘రయీస్’. ఈ మూవీ విడుదల సమయంలో ప్రమోషన్స్‌లో భాగంగా..

‘రయీస్’ సినిమా వివాదం.. Shah Rukh Khanపై కేసు కొట్టేసిన గుజరాత్ హైకోర్టు

బాలీవుడ్ యాక్టర్ షారుఖ్ ఖాన్ 2017లో నటించిన చిత్రం ‘రయీస్’. ఈ మూవీ విడుదల సమయంలో ప్రమోషన్స్‌లో భాగంగా ముంబై నుంచి ఢిల్లీకి రైలు ప్రయాణం చేశాడు. అంతేకాకుండా ప్రయాణం మధ్యలో గుజరాత్‌లోని వడోదరాలో కొద్దిసేపు అభిమానులతో ముచ్చటించాడు. షారుఖ్ వస్తున్నాడని తెలిసిన ఎంతోమంది అభిమానులు అక్కడి తరలివచ్చారు. దీంతో ఫ్యాన్స్‌ని ఉత్తేజపరిచేందుకు కొన్ని టీ షర్టులు, స్మైలీ బాల్స్ వారి వైపు విసిరాడు. వాటిని అందుకునేందుకు అభిమానులు ఎగబడ్డారు. అది అక్కడ తొక్కిసలాటకి దారి తీయగా.. అందులో ఓ వ్యక్తి మరణించాడు.


దీంతో షారుఖ్‌పై వడోదరా నివాసి జితేంద్ర సోలంకి ఫిబ్రవరి 2017లో మెజిస్టీరియల్ కోర్టులో ఒక ప్రైవేట్ ఫిర్యాదు దాఖలు చేశాడు. సోలంకి ఫిర్యాదు మేరకు షారుఖ్‌పై ఐపీసీ సెక్షన్లు 336, 337, 338 కింద కేసు నమోదైంది. నిర్లక్ష్యమైన చర్యగా పరిగణించి శిక్ష వేయాలని అందులో పేర్కొన్నారు. అప్పటి నుంచి కేసు విచారణ సాగుతుండగా.. తాజాగా గుజరాత్ హైకోర్టు షారుఖ్‌కి అనుకూలంగా తీర్పు వెలువరించింది. 


జస్టిస్ కారియల్ తీర్పు ఇస్తూ.. ‘షారుఖ్ ఖాన్ చర్యలు జనాలను ఉత్తేజపరిచి ఉండొచ్చు. కాని అవి నిర్లక్ష్యంగా చేసిన చర్యలు మాత్రం కావు. అంతేకాకుండా ఆ నటుడు తన సినిమా గురించి ప్రయోషన్‌లో భాగంగా మాత్రమే ఆ పని చేశాడు. అంతేకానీ.. అందులో మరే ఉద్దేశ్యం లేదని అర్థమవుతోంది’ అని చెప్పుకొచ్చారు.

Updated Date - 2022-04-28T16:32:54+05:30 IST