ఆ ఆలోచనకు ప్రతిరూపమే గాడ్‌ ఫాదర్‌

ABN , First Publish Date - 2022-10-05T07:16:56+05:30 IST

‘‘ఎప్పుడూ పాటలూ, ఫైట్లూ ఉన్న సినిమాలే కాదు, వైవిధ్యంగా ఏదైనా చేయాలని ఆలోచిస్తుంటాను. అలాంటి సమయంలో రామ్‌ చరణ్‌ ‘లూసీఫర్‌’ రీమేక్‌ చేస్తే బాగుంటుందన్న...

ఆ ఆలోచనకు ప్రతిరూపమే గాడ్‌ ఫాదర్‌

‘‘ఎప్పుడూ పాటలూ, ఫైట్లూ ఉన్న సినిమాలే కాదు, వైవిధ్యంగా ఏదైనా  చేయాలని ఆలోచిస్తుంటాను. అలాంటి సమయంలో రామ్‌ చరణ్‌ ‘లూసీఫర్‌’ రీమేక్‌ చేస్తే బాగుంటుందన్న ఐడియా ఇచ్చాడు. నాక్కూడా కొత్తగా ఉంటుందనిపించింది. కొత్తగా చేయాలన్న ఆ ఆలోచనకు ప్రతి రూపమే ఈ ‘గాడ్‌ ఫాదర్‌’ అన్నారు చిరంజీవి. ఆయన కథానాయకుడిగా నటించిన ‘గాడ్‌ ఫాదర్‌’ బుధవారం విడుదల అవుతోంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో చిరంజీవి మాట్లాడుతూ ‘‘లూసీఫర్‌ చూసినప్పుడు ఎక్కడో ఓ చిన్న అసంతృప్తి ఉండేది. దర్శకుడు మోహన్‌ రాజా, రచయిత సత్యానంద్‌ కలిసి ఆ అసంతృప్తిని దూరం చేశారు. ఎప్పుడైతే మన తెలుగు వాతావరణానికి తగ్గట్టుగా మార్పులు చేశారో, అప్పుడు ‘ఈ సినిమా మనం కచ్చితంగా చేయాల్సిందే’ అనిపించింది. ఈ చిత్రానికి పనిచేసిన మోహన్‌ రాజా, తమన్‌, లక్ష్మీభూపాల, సత్యదేవ్‌... వీళ్లంతా నా అభిమానులు. వాళ్లు ప్రేమతో పనిచేశారు. అందుకే ఈ సినిమా విజయంపై నా నమ్మకం రెట్టింపయ్యింద’’న్నారు. ‘‘చిరంజీవి అంటే మనందరి ఐడెంటిటీ. ఆయన ప్రేమతో ఈ సినిమా చేశారు. ఆ ప్రేమని ప్రేక్షకులు కూడా ఈ సినిమాపై చూపించాల’’న్నారు దర్శకుడు మోహన్‌ రాజా. 


పవన్‌ పాలించే రోజు రావాలనుకొంటున్నా!

ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు అంకితభావం కలిగిన నాయకుడు కావాలని, ప్రజలు కూడా పవన్‌ కల్యాణ్‌కి అవకాశం ఇస్తారన్న నమ్మకం తనకుందని, పవన్‌ పాలించే రోజు రావాలనుకొంటున్నానని చిరంజీవి వ్యాఖ్యానించారు. జనసేనకు చిరంజీవి మద్దతు ఉంటుందా? అనే ప్రశ్నకు చిరు సమాధానం ఇచ్చారు. ‘‘నేను రాజకీయాల నుంచి దూరమై, నిశ్శబ్దంగా ఉండడమే నా తమ్ముడికి హెల్ప్‌ అవుతుందని అనుకొంటున్నా. తనకు నా మద్దతు ఉంటుందా? అని అడిగితే కచ్చితంగా చెప్పలేను. కానీ భవిష్యత్తులో ఉండొచ్చేమో. ఎందుకంటే వాడు నా తమ్ముడు. వాడి నిబద్ధత, నిజాయితీ చిన్నప్పటి నుంచీ నాకు తెలుసు. ఎక్కడా కలుషితం కాలేదు. నిబద్ధత ఉన్న నాయకుడున మనకు రావాలన్నది నా ఆకాంక్ష. అందుకు తప్పకుండా నా సహకారం ఉంటుంది. నేను ఓ పార్టీలో, తమ్ముడు ఓ పార్టీలో ఉండడం కంటే, నేను సైలెంట్‌గా ఉంటేనే తనకు మంచి జరుగుతుందని అనుకొన్నా’’ అన్నారు.

Updated Date - 2022-10-05T07:16:56+05:30 IST