Chiranjeevi: ‘ఆచార్య’ ఫ్లాప్‌తో బాధపడలేదు.. కానీ?

ABN , First Publish Date - 2022-10-01T23:01:26+05:30 IST

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) తాజాగా నటించిన సినిమా ‘గాడ్ ఫాదర్’ (Godfather). మోహన్ రాజా దర్శకత్వం వహించాడు. నయనతార, సత్యదేవ్ కీలక పాత్రలు పోషించారు.

Chiranjeevi: ‘ఆచార్య’ ఫ్లాప్‌తో బాధపడలేదు.. కానీ?

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) తాజాగా నటించిన సినిమా ‘గాడ్ ఫాదర్’ (Godfather). మోహన్ రాజా దర్శకత్వం వహించాడు. నయనతార, సత్యదేవ్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 5న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిరు ప్రమోషన్స్ ను వేగవంతం చేశాడు. మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. అందులో భాగంగా ‘ఆచార్య’ (Acharya) ఫ్లాప్‌పై మాట్లాడాడు.   


టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ (Koratala Siva) తెరకెక్కించిన సినిమా ‘ఆచార్య’. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా పరాజయం పాలయింది. రెండో రోజు ప్రేక్షకులు ఎవరు కూడా మూవీని చూడటానికి రాలేదని చిరునే చెప్పాడు. ‘గాడ్ ఫాదర్’ ప్రమోషన్స్‌లో భాగంగా చిరంజీవి ‘ఆచార్య’ పరాజయంపై పెదవి విప్పాడు. ‘‘గతంలో హిట్ వస్తే సంతోషించేవాడిని. ఫ్లాప్ అయితే బాధపడేవాడిని. ప్రస్తుతం ఆ రోజులు పోయాయి. మొదటి 15ఏళ్ల కెరీర్‌లోనే ఆ దశను దాటాను. నటుడిగా నిలదొక్కుకున్నాక విజయాలు, అపజయాలను మనసులోకి తీసుకోవడం లేదు. సినిమాల ఫలితం మన చేతిలో ఉండదు. ప్రతి ప్రాజెక్టుకు కష్టపడినట్టుగానే ‘ఆచార్య’కు కూడా బెస్ట్ ఇచ్చాం. ఈ సినిమా పరాజయం పాలవడంతో నేను బాధపడలేదు. దర్శకుడు ఏం చెప్తే అది చేశాం. అయినప్పటికి, చిత్రం పరాజయం పాలయింది. ఈ మూవీ నన్ను ఒక్క విషయంలోనే విచారానికి గురి చేసింది. నేను, చరణ్ కలసి చేసిన మొదటి సినిమా ఇది. హిట్ కాలేదు. భవిష్యత్తులో మేం ఇద్దరం కలసి సినిమా చేయాలనుకుంటే ఇంతటి జోష్ ఉండకపోవచ్చు. అది తప్ప ఎటువంటి బాధ లేదు’’  అని చిరంజీవి పేర్కొన్నాడు. ఇక చిరు కెరీర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజిగా ఉన్నాడు. ‘భోళాశంకర్’, ‘వాల్తేరు వీరయ్య’ వంటి సినిమాలు చేస్తున్నాడు. వాల్తేరు వీరయ్య సినిమాకు బాబీ దర్శకత్వం వహిస్తున్నాడు. శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తుంది. రవితేజ ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. సంక్రాంతి కానుకగా సినిమా విడుదల కానుంది. 



Updated Date - 2022-10-01T23:01:26+05:30 IST