ఇంతటి రెస్పాన్స్‌ని ఊహించలేదు: ‘1996 ధర్మపురి’ హీరో

ABN , First Publish Date - 2022-04-27T01:12:52+05:30 IST

ఇప్పటి వరకు విలన్‌, సోదరుడు, స్నేహితుడు వంటి పాత్రలలో నటించి, నటుడిగా మంచిపేరు తెచ్చుకున్న గగన్ విహారి.. తాజాగా వచ్చిన ‘1996 ధర్మపురి’ చిత్రంతో హీరోగా పరిచయమయ్యాడు. శేఖర్ మాస్టర్ సమర్పణలో భాస్కర గ్రూప్ ఆఫ్ మీడియా

ఇంతటి రెస్పాన్స్‌ని ఊహించలేదు: ‘1996 ధర్మపురి’ హీరో

ఇప్పటి వరకు విలన్‌, సోదరుడు, స్నేహితుడు వంటి పాత్రలలో నటించి, నటుడిగా మంచిపేరు తెచ్చుకున్న గగన్ విహారి.. తాజాగా వచ్చిన ‘1996 ధర్మపురి’ చిత్రంతో హీరోగా పరిచయమయ్యాడు. శేఖర్ మాస్టర్ సమర్పణలో భాస్కర గ్రూప్ ఆఫ్ మీడియా బ్యానర్‌లో గగన్ విహారి, అపర్ణ దేవి జంటగా జగత్ దర్శకత్వంలో.. భాస్కర్ యాదవ్ దాసరి నిర్మించిన చిత్రం ‘1996 ధర్మపురి’. ఈ నెల 22న ప్రేక్షకులముందుకు వచ్చిన ఈ చిత్రం.. థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ఈ సందర్భంగా చిత్ర హీరో గగన్ విహారి మీడియాతో ముచ్చటించారు. 


ఆయన మాట్లాడుతూ..

‘‘నాకు యాక్టింగ్ అనేది చిన్నప్పటి నుండి ఉన్న కల. ఇంజినీరింగ్‌లో ఐటి పూర్తి చేసిన తరువాత బిజినెస్ స్కూల్‌లో యం.బి.ఎ చేసి ఇండస్ట్రీకి రావడం జరిగింది. 2010లో దర్శకుడు జీవీగారు ‘రంగా ది దొంగ’ సినిమాలో మెయిన్ విలన్ క్యారెక్టర్ చేసే అవకాశం ఇచ్చారు. ఆ తరువాత శర్వానంద్‌కు ఫ్రెండ్‌గా నటించిన ‘ప్రస్థానం’ సినిమాకు ప్రేక్షకుల నుండి మంచి అప్లాజ్ వచ్చింది. ఆ తరువాత ది గ్రేట్ లెజెండ్ దర్శకుడు త్రివిక్రమ్‌గారు ‘అత్తారింటికి దారేది’ సినిమాలో అవకాశం ఇవ్వడంతో నాకు పరిశ్రమ నుండి ప్రేక్షకుల నుండి చాలా మంచి పేరు వచ్చింది. ఆ సినిమా తర్వాత నాకు వరుసగా అవకాశాలు వచ్చాయి. నన్ను నమ్మి నాకు అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు. 


జగత్‌గారు నాకు మంచి ఫ్రెండ్. తను నాకు ‘1996 ధర్మపురి’ కథ చెప్పినప్పుడు అందులో ఒక మంచి క్యారెక్టర్ ఇస్తాడేమో అనుకున్నాను. ఆ తర్వాత ఇందులో నువ్వే హీరో అంటే నేను షాకయ్యా. తను చెప్పిన మాటలను మొదట నేను నమ్మలేదు. మంచి కథ.. నీకైతే ఈ సినిమా బాగుంటుంది అని ఈ సినిమా కథ చెప్పాడు. తను చెప్పిన కథ నాకు ఎంతో నచ్చింది. 1996 ప్రాంతంలో ధర్మపురిలో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా తీసిన ఈ సినిమాలో నేను హీరోగా నటించినందుకు చాలా సంతోషంగా ఉంది. చిన్న చిన్న రోల్స్ చేసుకునే నన్ను హీరోగా చేసి నాలోని ట్యాలెంట్‌ను బయటకు తీసిన దర్శక, నిర్మాతలకు నేనెప్పుడూ ఋణపడి ఉంటాను. ఈ సినిమా విడుదలైన ప్రతి చోటా పాజిటివ్ టాక్‌తో విజయవంతంగా ప్రదర్శింపబడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇన్ని పెద్ద సినిమాల మధ్య వచ్చిన మా సినిమాను ఆదరించి సక్సెస్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. సక్సెస్ టూర్‌కి వెళ్లిన చోట కూడా ప్రేక్షకులు మాకు బ్రహ్మరథం పట్టారు. ఆడియన్స్ నుండి ఇంత రెస్పాన్స్ వస్తుందని అస్సలు ఊహించలేదు. నా రాబోయే సినిమాలకు మరింత కష్టపడి మంచి స్ర్కిప్ట్‌తో ప్రేక్షకులముందుకు వస్తాను. ప్రస్తుతం ఈ చిత్ర సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాను. అలాగే కొన్ని కథలు విన్నాను.. ఇంకా ఫైనల్ చేయలేదు. త్వరలో పూర్తి వివరాలు తెలియజేస్తాను..’’ అని తెలిపారు.

Updated Date - 2022-04-27T01:12:52+05:30 IST