Item songs: ప్రత్యేక గీతాలు ఆకర్షణ కోసమేనా?

ABN , First Publish Date - 2022-07-14T21:11:15+05:30 IST

కమర్షియల్‌ సినిమా అంటే పాటలు, ఫైట్లు, రొమాంటిక్‌ సన్నివేశాలు తప్పనిసరి. గ్లామర్‌ హీరోయిన్‌తో ఐటెమ్‌ సాంగ్‌ అంటే కమర్షియల్‌ చిత్రాలకు ఒక హంగు అనే చెప్పాలి. సినిమాలో ఐటెమ్‌ సాంగ్‌ ఉంటే ఆ కిక్కే వేరుగా ఉంటుంది. అయితే అది కథానుగుణంగా ఉండాలి. కమర్షియాలిటీ కోసమో, గ్లామర్‌, అదనపు ఆకర్షణ కోసమో ఇరికించి పెడితే మొదటికే మోసం వస్తుంది.

Item songs: ప్రత్యేక గీతాలు ఆకర్షణ కోసమేనా?

కమర్షియల్‌ సినిమా అంటే పాటలు, ఫైట్లు, రొమాంటిక్‌ సన్నివేశాలు తప్పనిసరి. 

గ్లామర్‌ హీరోయిన్‌తో ఐటెమ్‌ సాంగ్‌ అంటే కమర్షియల్‌ చిత్రాలకు ఒక హంగు అనే చెప్పాలి. 

సినిమాలో ఐటెమ్‌ సాంగ్‌ ఉంటే ఆ కిక్కే వేరుగా ఉంటుంది. 

అయితే అది కథానుగుణంగా ఉండాలి. 

కమర్షియాలిటీ కోసమో, గ్లామర్‌, అదనపు ఆకర్షణ కోసమో ఇరికించి పెడితే మొదటికే మోసం వస్తుంది.


సినిమా చప్పగా సాగుతున్న సమయంలో అక్కడ సరైన సీన్‌ పడకపోతే.. ఇంకేదో కావాలని, దానికి ఐటెమ్‌ సాంగే శరణం అని ఈ మధ్యకాలంలో అలా ఇరికించి పెడుతున్నారు. కథ అనుకున్నప్పుడు ప్లానింగ్‌లో ఐటెమ్‌ సాంగ్‌ లేకపోయినా ఆదనపు ఆకర్షణకు ఐటెమ్‌ సాంగ్‌ వచ్చే చేరుతుంది. సినిమా సక్సెస్‌ అయితే... ఆ పాటతో వచ్చిన నష్టం ఏమీ ఉండదు. టాక్‌ అటు ఇటు అయింది అంటే ఆ సినిమాకు, ఆ పాట ప్లేస్‌మెంట్‌కు శరభే! 


ఈ మధ్యకాలంలో వచ్చిన చిత్రాల్లో అలాంటి పాటలు చాలానే ఉన్నాయి. ‘ఎఫ్‌ 3’ సినిమా ప్లానింగ్‌ స్పెషల్‌ సాంగ్‌ లేదు. ఎడిట్‌ సూట్‌లో కూర్చున్నాక సినిమాకు ప్రత్యేక ఆకర్షణ కోసం పూజాహెగ్డేతో ఓ పాటని జోడించారు. నిర్మాతలకు ఎక్స్‌ట్రా ఖర్చు కూడా. హుషారుగా సాగే ఈ పార్టీ సాంగ్‌కు దేవిశ్రీ ప్రసాద్‌ అద్భుతమైన ట్యూన్స్‌ ఇవ్వడం, పూజాహెగ్డే లాంటి స్టార్‌ స్టెప్పులు వేయడంతో ఆ పాట పాసైపోయింది. సినిమా నవ్వులు పూయించడంతో కావాలని ఇరికించిన పాట అనే భావన ప్రేక్షకులకు కలగలేదు. 


చిరంజీవి హీరోగా నటించిన ‘ఆచార్య’ చిత్రంలో రెజీనాపై ‘శానా కష్టం’ పాటను తెరకెక్కించారు. కథ అనుకున్నప్పుడు ప్లానింగ్‌లో ఉన్న పాటే అది. మొదట చిత్రీకరణ చేసింది కూడా ఆ పాటనే. అయితే సినిమా పరాజయం కావడంతో ఆ పాట ప్రభావం అంతగా కనిపించలేదు. విడుదలయ్యాక కొందరు మాత్రం ‘నక్సల్‌ సినిమాలో ఆ పాట అవసరం లేదని’ కామెంట్‌ చేశారు. 


రవితేజ హీరోగా తెరకెక్కుతున్న ‘రామారావు ఆన్‌ డ్యూటీ’లో ఓ ప్రత్యేక గీతం ఉందంటూ ఇటీవల ప్రచారం చేశారు. అన్వేషి జైన్‌పై ‘నా పేరు సీసా’ అంటూ సాగే పాటను తెరకెక్కించారు. ఆ లిరికల్‌ సాంగ్‌ను కూడా విడుదల చేశారు. చంద్రబోస్‌ రాసిన ఈ పాట క్యాచీగా ఉండడంతో ఆకట్టుకునే అవకాశాలున్నాయి. అయితే ఈ చిత్రం మొదలై ఏడాది కావొస్తున్నా.. ప్రత్యేక గీతం ప్రస్తావన మాత్రం ఇటీవల వచ్చింది. చివరి క్షణాల్లో పాటను జోడించారు. ఇప్పటికే ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు. అయినా కానీ, ఎగస్ర్టా గ్లామర్‌ కావాలనుకున్న చిత్ర బృందం హాట్‌ బ్యూటీ అన్వేషి, రవితేజలపై ‘సీసా’ పాటను సెట్స్‌పైకి తీసుకెళ్లారు. అదీ గ్లామర్‌ కోసమే అని లిరికల్‌ సాంగ్‌ చూస్తే అర్థమవుతుంది. 


ఇప్పుడు నితిన్‌ కూడా అదే పనిలో ఉన్నారు. ఆయన హీరోగా నటిస్తున్న ‘మాచర్ల నియోజక వర్గం’ చిత్రంలో అంజలిపై ఓ ప్రత్యేక గీతాన్ని తెరకెక్కిస్తున్నారు. పక్కా మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఈ చిత్రంలో గ్లామర్‌కి అంత స్కోపు లేదు. కృతిశెట్టి హీరోయిన్‌గా ఉన్నా ఆమె పాత్ర పరిధి మేరకే ఉంటుంది. దాంతో చివరి క్షణంలో గ్లామర్‌ డాల్‌గా అంజలిని దింపారు.  ‘సరైనోడు’ చిత్రంలో ‘బ్లాక్‌బస్టర్‌’ పాటతో ఓ ఊపు ఊపింది అంజలి. ఇప్పుడు ‘రారా రెడ్డి’ అంటూ మరో పాటతో సందడి చేయడానికి సిద్ధమైంది. అయితే ప్లానింగ్‌లో లేని పాటలు మధ్యలో వచ్చి చేరడం వల్ల నిర్మాతకు అదనపు ఖర్చు తప్పడు. హిట్టై వసూళ్లు బావుంటే ఓకే లేదంటే.. ఓకే. ఆ ఖర్చు కనిపించదు. కానీ సినిమా రిజల్ట్‌ అటు ఇటుగా ఉంటే ముందు వచ్చి ప్రస్తావన ఇలాంటి వాటి గురించే ఉంటుంది.

Updated Date - 2022-07-14T21:11:15+05:30 IST