‘రాజుగారి గది’ సిరీస్, జతకలిసే, నేను నాన్న నా ముగ్గురు బాయ్ ఫ్రెండ్స్’ లాంటి చిత్రాలతో టాలీవుడ్‌లో హీరోగా మంచి మార్కులేయించుకున్నాడు అశ్విన్ బాబు (Ashwin babu). ఇంత వరకూ ప్రేమకథా చిత్రాల్లో నటించిన మెప్పించిన ఈ హీరో .. తాజా చిత్రంతో యాక్షన్ హీరోగా మారబోతున్నాడు. సినిమా పేరు ‘హిడింబ’ (Hidimbha). మహాభారతంలో భీముడి కుమారుడైన ఘటోత్కజుడి మాతామహుడు హిడింబాసురుడు. అతడ్ని యుద్ధంలో ఓడించి అతడి కూతురైన హిడింబిని పెళ్ళి చేసుకుంటాడు భీముడు. అలాంటి రాక్షసుడి పేరును సినిమాకి టైటిల్‌గా పెట్టడం ఆసక్తిని రేకేత్తిస్తోంది. అసలు ఈ సినిమాకి ‘హిడింబ’ అనే టైటిల్ ను ఎందుకు పెట్టారన్నది సినిమా చూసే వరకూ తెలియదు.
అనిల్ కన్నెగంటి (Anil kanneganti) దర్శకత్వంలో, యస్వీకే సినిమాస్ బ్యానర్‌పై గంగాపట్నం శ్రీధర్ (Gangapatnam Sridhar) నిర్మాణంలో ‘హిడింబ’ సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా అతి త్వరలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ‘హిడింబ’ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ వీడియోను విడుదల చేశారు మేకర్స్. ‘ది పవర్ ఆఫ్ హిడింబ’ (The power of Hidimbha) పేరుతో విడుదలైన ఫస్ట్ గింప్స్ లో అశ్విన్ బాబు యాక్షన్ మెస్మరైజ్ చేస్తోంది. నల్ల దుస్తులు ధరించిన దుండగుల్ని అశ్విన్ బాబు సాహసోపేతంగా ఎదుర్కోవడం వీడియోలో కనిపిస్తుంది. అగ్రెసివ్ లుక్‌తో ఆకట్టుకున్నాడు అశ్విన్. గతంలో అతడు చేసిన సినిమాలకు భిన్నంగా ఈ చిత్రం కథాంశం ఉండబోతోందని అర్ధమవుతోంది. థ్రిల్లింగ్ కథాకథనాలతో తెరకెక్కుతోన్న ‘హిడింబ’ అశ్విన్ బాబుకు ఏ స్థాయిలో పేరు తెస్తుందో చూడాలి.