Chiranjeevi: మారాల్సింది దర్శకులే కాదు.. చిరు వ్యాఖ్యలపై అగ్గి రాజుకుంటోంది

ABN , First Publish Date - 2022-09-01T23:52:52+05:30 IST

చిరంజీవి (Chiranjeevi) ఒక సినిమా ప్రీ-రిలీజ్ వేడుకలో మాట్లాడుతూ.. ఒక ప్రముఖ దర్శకుడిని లక్ష్యంగా చేసుకొని మాట్లాడారు. ఇద్దరు పెద్ద నటులు దొరికినంత మాత్రాన.. దర్శకుడు ఏదో కథ అల్లెద్దామని అనుకుంటే..

Chiranjeevi: మారాల్సింది దర్శకులే కాదు.. చిరు వ్యాఖ్యలపై అగ్గి రాజుకుంటోంది

చిరంజీవి (Chiranjeevi) ఒక సినిమా ప్రీ-రిలీజ్ వేడుకలో మాట్లాడుతూ.. ఒక ప్రముఖ దర్శకుడిని లక్ష్యంగా చేసుకొని మాట్లాడారు. ఇద్దరు పెద్ద నటులు దొరికినంత మాత్రాన.. దర్శకుడు ఏదో కథ అల్లెద్దామని అనుకుంటే సినిమా నడవదని, కంటెంట్ ప్రధానం అని చెప్పారు. పరోక్షంగా కొరటాల శివ(Koratala Siva)ని తన ‘ఆచార్య’ (Acharya) సినిమా ఫ్లాప్ అయినందుకు నిందించారు. అయితే.. మన తెలుగు చలన చిత్ర సీమలో ఒకప్పుడు నిర్మాతలు, దర్శకులదే పైచేయిగా ఉండేది. అందుకే కొన్ని మంచి సినిమాలు వచ్చాయి, వాటిని ఈరోజుకూ మనం చూస్తూనే వున్నాము. కానీ ఇప్పుడు చిత్ర పరిశ్రమ.. హీరోలు అనే లీడ్ యాక్టర్స్ చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడున్న హీరోస్ అందరూ.. అసలు దర్శకుడు అనే వాడికి స్వాతంత్ర్యం ఇస్తున్నారా?.. అని ఒక సీనియర్ దర్శకుడు వాపోయాడు. ‘విలన్ ఎవరు ఉండాలో హీరోనే నిర్ణయిస్తాడు, మిగతా క్యారెక్టర్ నటులు ఎవరిని తీసుకోవాలో హీరోనే చెప్తాడు.. అలాగే తల్లి పాత్ర కూడా ఎవరు వేయాలి.. ఎక్కడి నుండి తీసుకురావాలి అనేది కూడా మన హీరోలే నిర్ణయిస్తున్న ఇటువంటి సమయంలో.. సినిమా ఫ్లాప్‌కి కేవలం దర్శకుడిదే పూర్తి బాధ్యత అనటం ఎంతవరకు సమంజసం?’ అని పేరు చెప్పటం ఇష్టంలేని ఓ దర్శకుడు అన్నారు. 


సినిమాకి ఓపెనింగ్స్ వచ్చేది కేవలం ఆ హీరో స్టామినాని బట్టే అని తెలుసు, కానీ సరైన కథ లేనప్పుడు ఒక్క మొదటి రోజు తప్పితే తరువాత రోజులకి ఎంత పెద్ద హీరో సినిమా అయినా చూడటానికి జనాలు రారు. అలాంటప్పుడు దర్శకుడికి ఒక సినిమా మీద మన హీరోస్ పూర్తి స్వాతంత్య్రం ఇస్తున్నారా? అలా ఇచ్చినప్పుడు మాత్రమే, దర్శకుడిదే బాధ్యతని అనగలమని ఆయన అంటున్నారు. సినిమాలో కూడా హీరో ఫేస్ మాత్రమే తెర మీద కనపడాలి.. వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదనుకుంటే మాత్రం చాలా సినిమాలు నడవవు. ఈమధ్య విడుదలైన కమల్ హాసన్  ‘విక్రమ్’ (Kamal Haasan Vikram) సినిమా విజయం సాధించిందంటే అందులో అందరికీ సరైన ప్రాధాన్యం దక్కింది. చిన్న పాత్రలో కనిపించిన ఏజెంట్ టీనా (Agent Tina)) అనే ఆమెకి కూడా ప్రాధాన్యం ఇచ్చారు. అలా మన తెలుగు హీరోస్ ఒప్పుకుంటారా? విలన్ మాట్లాడుతున్నప్పుడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ డైలాగ్స్ చెబుతున్నప్పుడు కూడా వాళ్ల ఫేస్ కాకుండా.. హీరో మాత్రమే తెర మీద కనపడాలంటే.. ఎలా ఆడతాయి మన సినిమాలు? సో.. ఇప్పుడు మారాల్సింది దర్శకులతో పాటు మన హీరోస్ కూడా.. అప్పుడే మన చిత్ర పరిశ్రమ కూడా బాగుపడుతుంది.

Updated Date - 2022-09-01T23:52:52+05:30 IST