Runway 34: అంతా కల్పితమే.. Ajay Devganపై ఇండియన్ పైలట్స్ సంఘం ఆరోపణలు

ABN , First Publish Date - 2022-05-04T17:48:29+05:30 IST

రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో సౌతిండియన్ సినీ పరిశ్రమల్లో గుర్తింపు పొందిన బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్‌గణ్...

Runway 34: అంతా కల్పితమే.. Ajay Devganపై ఇండియన్ పైలట్స్ సంఘం ఆరోపణలు

రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో సౌతిండియన్ సినీ పరిశ్రమల్లో గుర్తింపు పొందిన బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్‌గణ్. ఈ యాక్టర్ ప్రతి ఏడాది రెండు, మూడు సినిమాలతో హిందీ ప్రేక్షకులను పలకరిస్తూ ఉంటాడు. ఇటీవలే ‘ఆర్ఆర్ఆర్’తో ఫ్యాన్స్‌ని అలరించిన ఈ నటుడి కొత్త చిత్రం ‘రన్ వే 34’. ఇందులో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, రకుల్ ప్రీత్ సింగ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఇటీవలే విడుదలైన ఈ సినిమాకి మంచి టాక్ వచ్చింది. 2015లో జరిగిన దోహా టు కొచ్చి ఫ్లైట్ ల్యాండింగ్ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంపై, అజయ్ దేవ్‌గణ్‌పై ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పైలట్స్ ఆరోపణలు చేసింది. సినిమాని సీన్లని ఖండిస్తూ పైలట్ ఫెడరేషన్ సెక్రటరీ కెప్టెన్ సీఎస్ రంధవా ఒక ప్రకటన విడుదల చేశారు.


అందులో.. ‘సినిమాలో పైలట్ల వృత్తిని చిత్రీకరించిన తీరు బాగాలేదు. సత్యానికి చాలా దూరంగా ఉంది. అది విమానంలో ప్రయాణించే వారి మదిలో అనేక రకాల గందరగోళాలు, సందేహాలను రేకెత్తిస్తుంది. ప్రేక్షకులకి వినోదం పంచడం కోసం చిత్ర దర్శకుడు కొంచెం స్వేచ్ఛ తీసుకోవచ్చు. అందులో తప్పులేదు. కానీ లిబర్టీ పేరుతో ఎయిర్‌లైన్ పైలట్లలో వృత్తి నైపుణ్యం, అది చూపించిన తీరుని సరైనదిగా భావించలేం కదా. విమానాలను నడిపే పైలట్లు ప్రయాణికుల భద్రతని తమ బాధ్యతగా అనుకొని, ప్రతి రోజూ వేలాది మందిని గమ్యస్థానాలకు చేరుస్తుంటారు’ అని పేర్కొన్నారు.


అంతేకాకుండా.. ‘ఈ సినిమాని యథార్థ సంఘటనల ఆధారంగా తీసినట్లు చెబుతున్నారు. కానీ సినిమాలో చూపించి విధానంగా నిజ జీవితంలో అలా ఉండదు. అందులో చూపించిందంతా కల్పితమే. సినిమాలో చూపించిన విధంగా మా పరిశ్రమలో మాదక ద్రవ్యాల వినియోగం ఉండదు. ప్రతి పైలట్ ఎంతో సహనంగా ఉంటారు. మా పైలట్లు కంపెనీలు, ఏవియేషన్ రెగ్యులేటరీ నియమాలు పాటిస్తూ, ప్రజల విశ్వాసానికి అనుగుణంగా జీవించడానికి కట్టుబడి ఉంటారు’ అంటూ ఆ స్టేట్‌మెంట్‌లో చెప్పుకొచ్చారు.

Updated Date - 2022-05-04T17:48:29+05:30 IST