పదేళ్ల తర్వాత మొదటి ఇంటర్య్వూ ఇచ్చిన దళపతి విజయ్.. ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే..

ABN , First Publish Date - 2022-04-13T01:05:29+05:30 IST

తమిళంతోపాటు తెలుగులోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటుల్లో విజయ్ ఒకరు. అందుకే అభిమానులు..

పదేళ్ల తర్వాత మొదటి ఇంటర్య్వూ ఇచ్చిన దళపతి విజయ్.. ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే..

తమిళంతోపాటు తెలుగులోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటుల్లో విజయ్ ఒకరు. అందుకే అభిమానులు ఆయన్ని దళపతి అంటూ పిలుచుకుంటూ ఉంటారు. అలాంటి ఈ హీరో గత పదేళ్లుగా తన సినిమాలకి సంబంధించి కేవలం ప్రీ రిలీజ్ వేడుకల్లో మాట్లాడడం తప్ప ఎటువంటి ఇంటర్వ్యూలు ఇవ్వలేదు. అయితే కొన్ని అనివార్య పరిస్థితుల కారణంగా ఈ నటుడి తాజా చిత్రం ‘బీస్ట్’ ప్రీ రిలీజ్ వేడుకలు రద్ధయ్యాయి. దీంతో ఆయన మొదటిసారి మూవీ డైరెక్టర్ నెల్సన్‌తో కలిసి ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. సన్ టీవీలో 45 నిమిషాల పైగా ప్రసారమైన ఆ షోలో నెల్సన్ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పాడు.


అందులో.. విజయ్ వ్యక్తిగత, వృత్తిగత జీవితంతోపాటు రాజకీయాలు, కొడుకు జాసన్ విజయ్‌తో ఉన్న అనుబంధం గురించి పంచుకున్నాడు. అందులో.. జాసన్ సినీ ఎంట్రీ గురించి నెల్సన్ అడగగా.. ‘అతను తనకు ఇష్టమైన రంగాన్ని ఎంచుకుంటాడు. సినిమాలే చేయాలని నేనైతే ఒత్తిడి చేయను. కానీ.. అతను నటుడవ్వాలని కోరుకుంటే మాత్రం ఖచ్చితంగా సపోర్టు చేస్తాను’ అని విజయ్ చెప్పుకొచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది. ఇది చూసిన ఎంతోమంది ఫ్యాన్స్ ఆయన అభిమానాన్ని సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేస్తున్నారు.


‘విజయ్‌లో మొదట్లో ఉన్న ఆకర్షణ, చిరునవ్వు ఇప్పటికీ ఆయనలో ఉన్నాయి. నేను ఆయన్ని టెలివిజన్‌లో చూసి ఆనందించాను. సాధారణంగా ఆయన ఆడియో లాంచ్‌ల్లో స్పీచ్ ఇచ్చి వెళ్లిపోతారు. కానీ ఇక్కడైతే.. అభిమానులుగా, మేము ఆయన్ని వ్యక్తిగతంగా తెలుసుకునే అవకాశం ఉంది. ఎప్పటినుంచో అనుకుంటున్నట్లు.. కొడుకుతో ఆయన్నకున్న అనుబంధం, అతనికి ఇష్టమైన ఆహారం మొదలైనవి వాటి గురించి తెలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది’ అంటూ ఓ ఫ్యాన్ కామెంట్ చేశాడు.


మరో అభిమాని సైతం.. ‘దాదాపు దశాబ్దం తర్వాత ఆయన్ని ఇలా ఓ టెలివిజన్ ఇంటర్వ్యూలో చూడటం నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఆయన ఎంతో ఫన్నీగా, కూల్‌గా, సింపుల్‌గా ఉన్నాడు. ఇంటర్వ్యూ చూస్తున్నంతాసేపు ఆయన మాటలు వింటూ నవ్వుతూనే ఉన్నా. ఇకపై ఇలాగే ఆయన ఇంటర్వ్యూలు ఇస్తారని ఆశిస్తున్నాను’ అని కామెంట్ చేశాడు. అలాగే మరికొందరు ఫ్యాన్స్ సైతం ఆయన సినిమా మంచి హిట్ సాధించాలని, ఇకపై ఇలాగే ఇంటర్వ్యూలు ఇవ్వాలని, రాజకీయాల్లోకి కూడా రావాలని కోరుకుంటున్నట్లు కామెంట్స్ చేశారు.



Updated Date - 2022-04-13T01:05:29+05:30 IST