F3: ఓటీటీలో ఇప్పుడప్పుడే రాదండోయ్..!

ABN , First Publish Date - 2022-06-03T00:58:52+05:30 IST

తెలుగు చలనచిత్ర పరిశ్రమ(Tollywood)లో ఇప్పుడు ఓటీటీల హవా కొనసాగుతోంది. థియేటర్లలో సినిమాలు విడుదలైన మూడు, నాలుగు వారాలలోపే.. ఓటీటీలో వచ్చేస్తున్నాయి. దీంతో ప్రేక్షకులు థియేటర్లకి రావడం మానేశారు. ఎలాగూ మూడు, నాలుగు వారాల తర్వాత..

F3: ఓటీటీలో ఇప్పుడప్పుడే రాదండోయ్..!

తెలుగు చలనచిత్ర పరిశ్రమ(Tollywood)లో ఇప్పుడు ఓటీటీల హవా కొనసాగుతోంది. థియేటర్లలో సినిమాలు విడుదలైన మూడు, నాలుగు వారాలలోపే.. ఓటీటీలో వచ్చేస్తున్నాయి. దీంతో ప్రేక్షకులు థియేటర్లకి రావడం మానేశారు. ఎలాగూ మూడు, నాలుగు వారాల తర్వాత ఓటీటీలో వచ్చేస్తుందిగా.. చూసేద్దాంలే అని ప్రేక్షకులు అనుకుంటుండటంతో.. ఎలాంటి సినిమా అయినా కూడా విడుదలైన రెండో రోజు నుండే థియేటర్లలో ప్రేక్షకులు లేక వెలవెలబోతోంది. ఇది గత కొన్ని సినిమాల నుండి జరుగుతూనే వస్తుంది. అయితే ఇప్పుడీ ట్రెండ్‌కు బ్రేక్ వేసేందుకు ‘F3’ సిద్ధమైంది. ఈ చిత్ర నిర్మాతలు సినిమా ఓటీటీ విడుదలపై మొదటి నుండి చాలా స్పష్టంగా ఉన్నారు. థియేట్రికల్ విడుదల తర్వాత.. ఏ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌‌లోనూ అంత తొందరగా ఈ చిత్రం విడుదల కాదని F3 నిర్మాతలు మొదటి నుండి చెబుతూనే ఉన్నారు. తాజాగా.. ఈ సినిమా 8 వారాల థియేట్రికల్ రన్‌ ముగిసిన తర్వాతే ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వస్తుందని అధికారికంగా ప్రకటిస్తూ ఓ వీడియోని విడుదల చేశారు.


ఈ సందర్భంగా విడుదల చేసిన వీడియోలో వెంకటేష్ (Venkatesh), వరుణ్ తేజ్ (Varun Tej), అనిల్ రావిపూడి (Anil Ravipudi) మాట్లాడుతూ.. ‘‘ఎఫ్ 3ని బ్లాక్ బస్టర్ చేసిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. ఈ సినిమాని థియేటర్లలో చూడకపోయినా నాలుగు వారాల్లో ఓటీటీకి వస్తుందని అనుకున్నారు కదా.. ఇట్స్ నాట్ కమ్మింగమ్మా .. నాలుగు వారాల్లో రాదమ్మా.. ఎనిమిది వారాల తర్వాతే వస్తుందమ్మా . రెండు నెలల తర్వాత ఓటీటీకి వస్తుంది., సో అందరూ థియేటర్‌కే వచ్చి ఎఫ్ 3ని చూసి.. ఈ సమ్మర్‌లో సరదాగా నవ్వుకోండి’’ అని వెల్లడించారు. 


దీంతో ఈ సినిమాని ఓటీటీలో చూద్దామని వేచి చూస్తున్న వారంతా.. ఇప్పుడు థియేటర్లకు వెళ్లాల్సిన పరిస్థితులను చిత్ర టీమ్ కల్పించింది. ఇదే ట్రెండ్‌ను రాబోయే సినిమాలు కూడా పాటిస్తే.. థియేటర్లలో సినిమా మనుగడకు కాస్త ఊపిరి పోసినట్లు అవుతుందని.. సినీ విమర్శకులు కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం విశేషం. కాగా, దిల్ రాజు (Dil Raju) సమర్పణలో శిరీష్ (Shirish) నిర్మించిన ఈ చిత్రంలో తమన్నా (Tamanna), మెహ్రీన్ (Mehreen), సోనాల్ చౌహాన్ (Sonal Chauhan), సునీల్ (Sunil), రాజేంద్ర ప్రసాద్ (RajendraPrasad) కీలక పాత్రలలో అలరించారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ (DSP) ఈ చిత్రానికి సంగీతం అందించారు.



Updated Date - 2022-06-03T00:58:52+05:30 IST