Exclusive Story on Tollywood: థియేటర్లకు రానిది ప్రేక్షకులా.. మంచి సినిమాలా.. చిరంజీవి ట్వీట్‌తో ఏం తేలిందంటే..

ABN , First Publish Date - 2022-08-06T23:54:57+05:30 IST

‘కరోనా’ (Corona) తర్వాత భారతీయ సినీ రంగం మరీ ముఖ్యంగా తెలుగు సినీ పరిశ్రమ (Tollywood) ముఖ చిత్రం పూర్తిగా మారిపోయింది. కరోనాతో విధించిన లాక్‌డౌన్ కారణంగా...

Exclusive Story on Tollywood: థియేటర్లకు రానిది ప్రేక్షకులా.. మంచి సినిమాలా.. చిరంజీవి ట్వీట్‌తో ఏం తేలిందంటే..

‘కరోనా’ (Corona) తర్వాత భారతీయ సినీ రంగం మరీ ముఖ్యంగా తెలుగు సినీ పరిశ్రమ (Tollywood) ముఖ చిత్రం పూర్తిగా మారిపోయింది. కరోనాతో విధించిన లాక్‌డౌన్ కారణంగా జరిగింది ప్రజలు ఇళ్లకే పరిమితం కావడం, థియేటర్లు మూత పడిపోవడం లాంటి పరిణామాలు మాత్రమే కాదు. రొట్ట రొటీన్ సినిమాలకు (Routine Movies) భిన్నంగా ఉన్న కంటెంట్ ఓటీటీలో (OTT) దొరుతుండటంతో ప్రేక్షకులు విషయం ఉన్న సినిమాలు (Cinema) చూసేందుకు బాగా అలవాటుపడ్డారు. సినిమాలతో పాటు బోలెడన్ని కథే ప్రధానంగా మలిచిన వెబ్‌ సిరీస్‌లు (Web Series) ఓటీటీల్లో (OTT) కుప్పలుతెప్పలుగా ప్రేక్షకులకు అందుబాటులో ఉన్నాయి. ప్రేక్షకుల కోణంలో ఇది ఒక శుభపరిణామే అయినప్పటికీ కొందరు టాలీవుడ్ దర్శకులకు (Tollywood  Directors) మాత్రం ఈ పరిణామం పెను సవాల్‌ను విసిరింది. కరోనా తర్వాత మళ్లీ థియేటర్లు (Theaters) తెరుచుకున్నాయి. ‘అఖండ’ (Akhanda), ‘పుష్ప’ (Pushpa), ‘ఆర్‌ఆర్‌ఆర్’ (RRR), ‘కేజీఎఫ్ 2’ (KGF 2) లాంటి సినిమాలు బ్లాక్‌బస్టర్ విజయాలను సాధించాయి. ఈ నాలుగు సినిమాల్లో కూడా హీరో ఎలివేషన్స్ ఉన్నప్పటికీ.. కథ కూడా సినిమాల విజయానికి దోహదపడింది. ఆ కథ రొట్ట రొటీన్‌గా, చిరాకు కలిగించేలా ఏమాత్రం ఉన్నా ఎంత పెద్ద హీరోల సినిమాలైనా ప్రేక్షకుల తిరస్కారానికి గురికాక తప్పదు. ‘రాధేశ్యామ్’ (Radhe Syam), ‘ఆచార్య’ (Acharya) లాంటి పెద్ద సినిమాల ఫలితాలే ఇందుకు ఉదాహరణ. ఒక్కమాటలో చెప్పాలంటే తెలుగు ప్రేక్షకులు కంటెంట్ ప్రధానమైన సినిమాలు తెరకెక్కిస్తేనే థియేటర్ల వరకూ వచ్చి సినిమాలు చూసే పరిస్థితి వచ్చింది.



సినిమాలను ప్రేక్షకులు వినోదం కోసమే చూస్తారనేది పాతమాట. వినోదంతో పాటు ఏదో తెలియని కొత్తదనం కోసం థియేటర్లకు వస్తున్నారన్నది కొత్త పలుకు. అలా థియేటర్‌కు వచ్చే ప్రేక్షకుడికి సినిమా ఏమాత్రం రుచించకపోయినా రెండో రోజుకే థియేటర్ యాజమాన్యాలు ఈగలు తోలుకోవాల్సిన పరిస్థితులొచ్చాయి. ఎందుకంటే.. సినిమా విడుదలైన గంటల వ్యవధిలోనే ట్విట్టర్ (Twitter) లాంటి సామాజిక మాధ్యమాల్లో ఫలితాన్ని సినిమా చూసిన ప్రేక్షకులు ఒక్కమాటలో చెప్పేస్తున్నారు. పచ్చిగా చెప్పాలంటే.. సినిమా బాగుంటే ఆకాశానికెత్తేస్తున్నారు. సినిమా నచ్చలేదంటే పాతాళానికి తొక్కేస్తున్నారు. సినిమా హిట్ అంటే 100 డేస్, 175 డేస్, 200 డేస్ లాంటి రోజుల నుంచి తొలి వారంలో అన్ని కోట్లు, రెండో వారంలో ఇన్ని కోట్లు, మూడో వారంలో ఫైనల్‌గా మిగిలిందింత, పోగొట్టుకుంది ఇంతా, నాలుగో వారంలో ఓటీటీకి అనేంతలా చిత్ర  పరిశ్రమలో పరిస్థితులు మారిపోయాయి. ప్రేక్షకుల అభిరుచులు రొట్ట రొటీన్ సినిమాలు చూసి హిట్ చేసే రోజుల నుంచి ఇంత విలక్షణంగా మారిన ఈరోజుల్లో సినిమా బతకాలంటే వినోదంతో పాటూ విషయం ఉండాల్సిందే. ఒకవేళ సినిమాలో విషయం లేదని తెలిస్తే.. థియేటర్ల దాకా ప్రేక్షకుడు వెళ్లడు. ఓటీటీలో కంటెంట్ ఉన్న సినిమాలను ఇంటిల్లిపాదితో కలిసి చూస్తాడు. థియేటర్లకు జనాలు రావడం తగ్గించారని.. సినిమా మనుగడే కష్టంగా మారిందని.. షూటింగ్స్ నిలిపివేస్తున్నామని బంద్ ప్రకటించి కూర్చునే బదులు తక్కువ బడ్జెట్‌లో సినిమా తీసి ప్రేక్షకుడిని ఎలా థియేటర్ల వైపు నడిపించాలనే ఆలోచన చేస్తే మేలని సినీ జ్ఞానం ఉన్న వాళ్లు అభిప్రాయపడుతున్నారు. మూస ధోరణిలో కథలు రాసుకుని కోట్లకు కోట్లు ఖర్చు చేసి సినిమాలు తీసి ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదని సినిమాలను ఇన్నాళ్లూ ఆదరించిన వాళ్లనే నిందించడం సరికాదనే అభిప్రాయాన్ని సినీ పండితులు కూడా వ్యక్తం చేస్తున్నారు.



జులై నెలలో టాలీవుడ్‌కు సరైన హిట్ ఒక్కటీ లేదు. గోపీచంద్ పక్కా కమర్షియల్‌తో మొదలుకుని రామ్ పోతినేని ‘ది వారియర్’, నాగచైతన్య ‘థ్యాంక్యూ’, రవితేజ ‘రామారావు ఆన్ డ్యూటీ’ వీటిల్లో ప్రేక్షకులను ఏ ఒక్కటీ ఆకట్టుకోలేకపోయాయి. అలాంటి గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటూ టాలీవుడ్‌ ఆగస్ట్‌లోకి అడుగుపెట్టింది. ఈ శుక్రవారమైనా ఒక్క హిట్.. ఒకే ఒక్క హిట్టు బొమ్మ పడకపోతుందా అని టాలీవుడ్ ఆశగా చూసింది. ఎట్టకేలకు ఆ నిరీక్షణ ఫలించింది. ఆగస్ట్ తొలి శుక్రవారంలో విడుదలైన (ఆగస్ట్ 5) 'సీతారామం', 'బింబిసార' సినిమాలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తుండటంతో టాలీవుడ్ మొత్తానికి ఊపిరి పీల్చుకుంది. సినిమాల్లో విషయం ఉంటే ప్రేక్షకులు థియేటర్లకు వస్తారన్న తత్వం బోధపడింది. టాలీవుడ్ ప్రముఖులంతా ఈ రెండు సినిమాల విజయాలను మొత్తం తెలుగు సినీ పరిశ్రమ విజయంగా చెబుతున్నారంటే.. మొత్తానికి ప్రేక్షకుల అభిరుచి ఏంటనేది ఇప్పటికైనా అర్థమైనట్టుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.



'సీతారామం', 'బింబిసార' చిత్రాలకు ప్రేక్షకుల నుంచి వస్తున్న సానుకూల స్పందనపై చిరంజీవి ట్వీట్‌ చేశారు. ‘సీతారామం’, ‘బింబిసార’ చిత్రాలు విజయవంతం కావడంతో సినీ పరిశ్రమకు ఊరట లభించిందని మెగాస్టార్ ట్విట్టర్‌లో చెప్పుకొచ్చారు. సినిమా థియేటర్లకి ప్రేక్షకులు రావడం లేదని బాధపడుతున్న ఇండస్ట్రీకి ఊరట లభించిందని, కంటెంట్‌ బావుంటే ప్రేక్షకులెప్పుడూ ఆదరిస్తారని మరోసారి నిరూపించారని ప్రేక్షకులను కీర్తిస్తూ, 'సీతారామం', 'బింబిసార' చిత్ర యూనిట్లకు మనః పూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు చిరంజీవి ట్వీట్‌ చేశారు. ఏతావాతా తేలిందేంటంటే.. ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదన్న వాదనలో ఏమాత్రం నిజం లేదు. మంచి సినిమాలను ఆదరించేందుకు ప్రేక్షకులు ఎప్పుడూ ముందుంటారని ఈ శుక్రవారం సినిమాల ఫలితాలు మరోసారి నిరూపించాయి. భారీ బడ్జెట్‌తో పాటు కంటెంట్ ప్రధానంగా సాగే సినిమాలను నిర్మించే దిశగా టాలీవుడ్ నిర్మాతలు, దర్శకుల అడుగులు పడాలని తెలుగు ప్రేక్షకులు మనస్పూర్తిగా కోరుకుంటున్నారు. ఇక.. ఈ ఆగస్టులోనే పూరీ, విజయ్‌ దేవరకొండ ‘లైగర్’, నిఖిల్ ‘కార్తికేయ 2’, నితిన్ ‘మాచర్ల నియోజకవర్గం’ సినిమాలు విడుదలకు కాబోతున్నాయి. ఈ మూడు సినిమాల ఫలితాలు కూడా టాలీవుడ్‌లో తదుపరి విడుదల కాబోతున్న సినిమాలపై ప్రభావం చూపనున్నాయన్నేది టాలీవుడ్ పెద్దలు కాదనలేని వాస్తవం.

Updated Date - 2022-08-06T23:54:57+05:30 IST