ఆ పాత్రను ఎంజాయ్‌ చేస్తున్నా!

ABN , First Publish Date - 2022-04-10T05:30:00+05:30 IST

ప్రమాదంలో కాలు కోల్పోయినా... ఆత్మవిశ్వాసంతో విధిని వెక్కిరించిన ధీశాలి సుధా చంద్రన్‌.

ఆ పాత్రను ఎంజాయ్‌ చేస్తున్నా!

ప్రమాదంలో కాలు కోల్పోయినా... ఆత్మవిశ్వాసంతో విధిని వెక్కిరించిన ధీశాలి సుధా చంద్రన్‌. ముప్ఫై ఎనిమిదేళ్ళ కిందట ‘మయూరి’గా తన నిజజీవిత కథలో నటించి... ఎంతోమందికి ఆమె స్ఫూర్తిగా నిలిచారు. నర్తకిగా, సినీ, టీవీ నటిగా ఆమె కెరీర్‌ నిర్విరామంగా కొనసాగుతోంది. ప్రస్తుతం తెలుగులో ‘నెంబర్‌ వన్‌ కోడలు’, హిందీలో ‘నాగిన్‌-6’ సీరియల్స్‌తో బిజీగా ఉన్న సుధ జీవితంలో పోషిస్తున్న వివిధ పాత్రల గురించి ఆమె మాటల్లోనే...


‘‘మీకు నటనంటే ఇష్టమా? నృత్యమంటే ఇష్టమా? అనే ప్రశ్న చాలామంది అడుగుతూ ఉంటారు. జీవితంలో మనం చేసే ప్రతి పనికీ ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. నటన, నృత్యం... దీన్లో ఏదో ఒకటి ఎంచుకోమంటే... నా మొదటి ఛాయిస్‌ నృత్యానికే. వేదిక మీద నర్తించడం నాకు ఇష్టం. ఎందుకంటే ఈ రోజు ఎంతోమందికి సుధా చంద్రన్‌ గురించి తెలిసిందంటే... దానికి కారణం నాట్యమే. నర్తకిగా నా జీవితాన్ని మొదలుపెట్టాను. అదే నా ఉనికి. ప్రేక్షకుల ఎదుట ప్రదర్శన ఇచ్చి... చప్పట్ల రూపంలో వారి అభినందనలు అందుకోవడం గొప్ప ఫీలింగ్‌. అయితే నటనను తక్కువ చేయడం లేదు. నాకు నాట్యం రావడం వల్ల... నటిగా వివిధ పాత్రలు పోషించడం సులువవుతోంది. ఇక, నిజ జీవితంలో నేను పోషించాలని కోరుకొనే పాత్రలు ఎన్నో ఉంటాయి. ఉదాహరణకు... నేను డాక్టర్‌ కావాలని ఎప్పుడూ కోరుకొనేదాన్ని. కానీ కాలేకపోయాను. అందుకే డాక్టర్‌ పాత్ర పోషించినప్పుడు సరదాగా ఉంటుంది. ఇలాంటి అనుభవాలు ఎన్నెన్నో! 

ఏదీ పూర్తిగా నెగెటివ్‌ కాదు...

ప్రస్తుతం ఎక్కువగా విలనీ ఛాయలున్న పాత్రల్లో నటిస్తున్నాను. నిజానికి పాజిటివ్‌, నెగెటివ్‌ పాత్రలంటూ ఏవీ ఉండవు. ఎందుకంటే ప్రతి పాత్రలో ఇవి రెండూ కలిసే ఉంటాయి... మోతాదుల్లో తేడా ఉంటుందంతే! ఒక సీరియల్‌లో ఉదాత్తమైన పాత్ర వేసినప్పుడు... ఆ పాత్ర చాలా పాటిజివ్‌ అని జనాన్ని ఒప్పించడానికి ఎంతో ప్రయత్నం చెయ్యాల్సి వచ్చింది. అయితే చెడ్డవిలా కనిపించే పాత్రల్ని బాగా ఇష్టపడతాను. నిజ జీవితంలో నేనలా ఉండను. కాబట్టి, నాకు ఆ పాత్రలు మరింత ఆసక్తిగా అనిపిస్తాయి. అలాగే, నటించడానికి ఎక్కువ అవకాశం కూడా ఆ పాత్రల్లోనే ఉంటుంది. ఏ స్థాయిలోనైనా వాటిని పోషించవచ్చు. కానీ, నటన అవాస్తవికంగా, ప్రేక్షకులకి చిరాకెత్తించేలా ఉండకూడదు. ప్రేక్షకులు చాలా తెలివైనవాళ్ళు. పాత్ర పరిధిని మించి నటిస్తే... ఏకి పారేస్తారు. అలాగని ఉదాత్తంగా ఉండే పాత్రలకి నేను వ్యతిరేకం కాదు. ప్రయోగాలు చెయ్యడం నాకిష్టం. నేను నర్తకిని, నటిని. టీవీ షోల్లో ఎప్పటి నుంచో కంటెస్టెంట్‌గా, జడ్జిగా పాల్గొంటున్నాను. ఆ తరువాత మోటివేషనల్‌ స్పీకర్‌గా మారాను. ప్రమాదంలో కాలు పోగొట్టుకొని, కృత్రిమ పాదం మీద నిలబడి, నృత్యం చేసి, నటించి... కోట్లాది అభిమానులకు దగ్గరైన నా జీవితం.... నాకే కాదు, ఎంతో మందికి ఒక పెద్ద పాఠం. అది ఎంతో మందికి ప్రేరణ కలిగిస్తోంది. అందుకే... జీవితంలో ప్రస్తుతం మోటివేషనల్‌ స్పీకర్‌ పాత్రను చాలా ఎంజాయ్‌ చేస్తున్నాను.’’ 

Updated Date - 2022-04-10T05:30:00+05:30 IST