Jacqueline Fernandez: బాలీవుడ్ బ్యూటీ మెడ చుట్టు బిగుసుకుంటున్న 200 కోట్ల ఛీటింగ్ కేసు.. అన్నీ తెలిసే అలా చేసిందంటూ..

ABN , First Publish Date - 2022-09-01T18:48:51+05:30 IST

మోసగాడు సుకేశ్ చంద్రశేఖర్ (Sukesh Chandrasekhar) రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసు గురించి అందరికీ తెలిసిందే...

Jacqueline Fernandez: బాలీవుడ్ బ్యూటీ మెడ చుట్టు బిగుసుకుంటున్న 200 కోట్ల ఛీటింగ్ కేసు.. అన్నీ తెలిసే అలా చేసిందంటూ..

మోసగాడు సుకేశ్ చంద్రశేఖర్ (Sukesh Chandrasekhar) రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసు గురించి అందరికీ తెలిసిందే. ఈ కేసుని విచారించిన ఈడీకి ఇందులో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్(Jacqueline Fernandez) గురించి కూడా విస్తుపోయే నిజాలు తెలిశాయి. దీంతో ఈ భామపై ఈడీ ఛార్జిషీట్‌ దాఖలు చేసింది. అందులో.. ప్రధాన నిందితుడు సుఖేష్, జాక్వెలిన్‌కి గుర్రం, పిల్లి, నగలు బహుమతిగా ఇవ్వడమే కాకుండా.. ఈ భామ కోసం శ్రీలంకలో ఇల్లు కూడా కొనుగోలు చేశాడని పేర్కొంది. అలాగే.. బహ్రెయిన్, ముంబైలలో కూడా ఒక్కొక్కటి చొప్పున ఇళ్లకి అడ్వాన్స్ ఇచ్చారు. కాగా.. బహ్రెయిన్‌లోని ఇంట్లో జాక్వెలిన్ తల్లిదండ్రులు  నివసిస్తున్నారు.


అలాగే.. జాక్వెలిన్‌కు సుఖేష్‌ మోసగాడు అని ముందే తెలుసని కూడా ఈడీ తన చార్జిషీట్‌లో పేర్కొంది. అతనిపై కేసు నడుస్తోంది. శ్రీలంకలో ఇల్లు కొనే విషయాన్ని సుకేష్ తనతో చెప్పాడని జాక్వెలిన్ అంగీకరించింది. అయితే, ఆమె ఎప్పుడూ ఆ ఇంటికి వెళ్లలేదు. ఈ ఆస్తి శ్రీలంకలోని వెలిగామాలో ఉన్నట్లు చెబుతున్నారు. ఇది శ్రీలంకలోని ప్రసిద్ధ పర్యాటక కేంద్రం. అయితే.. సుకేశ్ గురించి అన్ని తెలిసే అతని నుంచి జాక్వెలిన్ బహుమతులు తీసుకున్నట్లు ఈడీ ఛార్జీ షీట్‌లో చెప్పుకొచ్చింది. ఇది కాకుండా, జుహులోని బంగ్లాని జాక్వెలిన్ కోసం బుక్ చేశాడు. 


అయితే అంతకుముందు జాక్వెలిన్ కోర్టులో సుకేష్ నిజస్వరూపం గురించి తనకు తెలియదని చెప్పింది. ప్రముఖ రాజకీయ కుటుంబానికి చెందిన శేఖర్ పేరుతో ఆమెకు సుకేష్ తెలుసని.. వార్తల మూలంగా కొన్నిరోజుల ముందే అతని అసలు పేరు సుకేష్ చంద్రశేఖర్ అని తెలిసినట్లు చెప్పుకొచ్చింది. అన్ని తెలిసి చేసినప్పటికీ జాక్వెలిన్ తనని తాను బాధితురాలినని చెప్పుకుంటున్నట్లు ఈడీ తెలిపింది. విచారణలో దొరికిన ఆధారాలతో ఆమెను ఈ కేసులో సహ నిందితురాలిగా చేర్చింది.


ఛార్జ్ షీట్ ప్రకారం.. జాక్వెలిన్‌కి మాత్రమే కాకుండా ఆమె సోదరుడు, సోదరి పర్యటనల కోసం సుకేశ్ ఆర్థిక సహాయం చేశాడు. సోదరికి 1 లక్ష USD (సుమారు రూ.79,42,000), సోదరుడికి 2,67,40 ఆస్ట్రేలియన్ డాలర్లు (సుమారు రూ. 14,79,267) బహుమతిగా ఇచ్చాడు. ఇది కాకుండా నటికి రూ.5.71 కోట్ల విలువైన బహుమతులు ఇచ్చాడు. ఈ ఛార్జీ షీటుపై ఆగస్టు 31న విచారణ చేసిన పాటియాలా కోర్టు.. సెప్టెంబర్ 26న కోర్టుకు హాజరుకావాలని జాక్వెలిన్‌ని ఆదేశించింది. కాగా.. దానికి ముందు సెప్టెంబర్ 12న ఢిల్లీ పోలీసులు ఈ నటిని కూడా విచారించనున్నారు. ఢిల్లీలో జరగనున్న ఈ విచారణలో ఈఓడబ్ల్యూకి చెందిన వ్యక్తులు కూడా పాల్గొంటారు.

Updated Date - 2022-09-01T18:48:51+05:30 IST