Sita Ramam Himalayan Blunder: సినిమా సూపర్ హిట్ సరే.. కానీ ఈ బ్లండర్ మిస్టేక్ సంగతేంటి..?

ABN , First Publish Date - 2022-08-08T00:33:47+05:30 IST

తెలుగు సినిమా ప్రేక్షకులు చాలా ఉదారస్వభావులని, కథ... కథనాలలో పొరపాట్లు, లోపాలు ఉండటమే కాదు, అసలు మూలాల్లో అవకతవకలు ఉన్నా కూడా ఉపేక్షించి, క్షమించి సినిమాను సూపర్ హిట్ చేస్తారనడానికి తాజా ఉదాహరణ - ఈ శుక్రవారం విడుదలైన 'సీతారామం' సినిమా.

Sita Ramam Himalayan Blunder: సినిమా సూపర్ హిట్ సరే.. కానీ ఈ బ్లండర్ మిస్టేక్ సంగతేంటి..?

మూలకథలోనే తప్పులున్నా ఉపేక్షించిన ఉదార ప్రేక్షక దేవుళ్ళు! 


తెలుగు సినిమా ప్రేక్షకులు చాలా ఉదారస్వభావులని, కథ... కథనాలలో(storyline) పొరపాట్లు, లోపాలు ఉండటమే కాదు, అసలు మూలాల్లో అవకతవకలు ఉన్నా కూడా ఉపేక్షించి, క్షమించి సినిమాను సూపర్ హిట్ చేస్తారనడానికి తాజా ఉదాహరణ - ఈ శుక్రవారం విడుదలైన 'సీతారామం'(Sita Ramam) సినిమా. ఒక కొత్త సినిమా గురించి విశ్లేషిస్తున్నప్పుడు, దాని బాగోగులు చర్చించే సందర్భంలో దాని కథని క్లుప్తంగా చెప్పటమే కాకుండా, ఎంతో గుప్తంగా కూడా ఉంచాలన్నది ప్రాథమిక సూత్రం. దాన్ని సినీ విమర్శకుడు/ విశ్లేషకుడు పాటించి తీరాలి కాబట్టి, అప్పటికి ఇంకా సినిమా చూడనివారి వీక్షకానుభూతిని చెడగొట్ట కూడదు కనుక సినిమా కథ వివరాల్లోకి వెళ్లడం లేదు. 


ఈ సినిమాకి మూలాధారం కథానాయకుడు  లెఫ్ట్‌నెంట్ రామ్ (దుల్కర్ సల్మాన్- Dulquer Salmaan)- కథానాయిక సీతామాహాలక్ష్మి (మృణాల్ ఠాకుర్ - Mrunal Thakur) కి రాసిన ఉత్తరం. పాకిస్థాన్ జైలులో మగ్గుతున్న రామ్ - తను ప్రాణంగా ప్రేమించే సీతకి కచ్చితంగా చేరాలని తపించి రాసుకున్న ఉత్తరం. 1964లో అతను రాసిన ఆ లేఖ, అనేకానేక మలుపుల తర్వాత 20 ఏళ్లకి ఆమెని చేరుతుంది. 


అయితే, కచ్చితంగా ఉత్తరం ఆమెకి చేరాలని అతను తపించి ఉంటే, నిజంగానే సంకల్పించి ఉంటే, దాని కవర్ మీద ఆ అడ్రస్ రాయడంలో అర్థం లేదు. తాను రాసిన చిరునామాలో సీత ఉండదని ఆ పాటికే అతనికి తెలుసు. తెలిసి తెలిసీ అంత నిష్పూచీగా, నిర్లక్ష్యంగా ఎందుకు ఉన్నాడు? 


ఆ ఉత్తరం పదే పదే పాకిస్థాన్‌కి తిరిగిరావడం వల్ల ఆ ఉత్తరాన్ని బట్వాడా చేసే బాధ్యత అఫ్రిన్ (రష్మిక మందణ్ణ - Rashmika Mandanna)  తీసుకోవల్సి వస్తుంది (అది కూడా ఇరు దేశాల తపాలా శాఖల్లో నిజాయితీపరులు ఉండటం మూలాన ఆ లేఖ అఫ్రిన్ దాకా వచ్చింది గానీ, లేకపోతే ఎప్పుడో ఏ చెత్తబుట్ట దాఖలో అయ్యి ఉండేది, లేదా సైడుకాల్వల పాలిటో పడేపోయేది). 


నిర్వేదంలో, నిస్పృహలో, అంతులేని నిరాశలో, వాటితోపాటు ఎంతో ఆశతో కూడా ఆ ఉత్తరాన్ని రాసిన రామం, అది సీతకు ఎలాగైనా చేర్చాలని తహతహలాడిపోయుంటాడు (ఉండాలి). తన శ్రేయోభిలాషి తారీఖ్ ద్వారా సీతకు చేర్చే ప్రయత్నాన్ని రామం సిన్సియర్ గా చేస్తే, కవర్ మీద కరెక్ట్ అడ్రస్ రాసేవాడు కదా. తాను రాసిన చిరునామాలో సీత లేదని, ఆ అడ్రస్ లో ఆమె గురించి ఎవ్వరూ చెప్పలేరని కూడా తెలిసి కూడా ఆ తప్పుడు చిరునామానే ఎందుకు రాశాడు?  


1964లో తాను రాసిన ఉత్తరం 20 ఏళ్ల పాటు దిక్కూమొక్కూ లేకుండా తిరుగుతూ, మళ్లీ మళ్ళీ తారీఖ్‌ కే చేరి, ఆయన వారసురాలు ఆఫ్రిన్ అత్యయిక అనివార్య సాహస యాత్ర కారణంగా సీతకి చేరుతుందని కథక - దర్శకుడు హను రాఘవపూడికి(Hanu Raghavapudi)  తెలిసుండొచ్చేమో గానీ, రామం అనే భారత లెఫ్టినెంట్ కి తెలిసే అవకాశం లేదు కదా. 


- కాబట్టి, బుద్ధిగా ఆ ఉత్తరం మీద కరెక్ట్ అడ్రెస్ రాస్తే, అతని సీతకి అదే 1964లోనే అంది ఉండేది కదా (అయితే- సినిమా ఉండేది కాదేమో).  ‘సీతారామం’ అనే సినిమా నిర్మాణం హను రాఘవపూడికి, తీసిన వైజయంతి / స్వప్న మువీ సంస్థలకీ, తెర ముందు/ వెనక ఉన్నవారికీ, చివరికి చూసే ప్రేక్షకులకి కూడా అవసరమేమో గానీ, పాకిస్థాన్ జైలులో మగ్గుతున్న రామంకి ఏం అవసరం? ఒకవేళ అవసరం ఉందనుకున్నా, అది తన సీత కంటే కాదేమో కదా!

*                 *

ఇంత పెద్ద తప్పిదాన్ని కథక- దర్శకుడు ఎందుకు పట్టించుకోలేదు? ఎందుకంటే, కథ (సినిమా)లో చెప్పడమే కాదు, చెప్పకుండా నిగ్రహించుకోగలగటం కూడా దర్శక ప్రతిభలో భాగమే. సీత ఐడెంటిటీకి సంబంధించిన ఒక నిజం రామంకి తెలియకుండా ఉంటేనే ఆ కథ నిలుస్తుంది. కానీ, అన్నీ చెప్పేయాలనే దర్శకుడి దుగ్ధ, అపరిపక్వత వల్ల ‘సీతారామం’ అనే సినిమా-  పునాదులు లేని అందమైన గాజుభవనంలా, వేర్లు పీకేసిన గులాబీమొక్కల గుల్దస్తాలా తయారయ్యింది.

*        *         ** 

Updated Date - 2022-08-08T00:33:47+05:30 IST