Bollywood: స్టార్ హీరోల సినిమాలకు దారుణమైన వసూళ్లు.. ప్రేక్షకులు రాకపోవడంతో షోస్ క్యాన్సిల్..

ABN , First Publish Date - 2022-08-13T20:30:40+05:30 IST

బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ నటించిన సినిమా ‘లాల్ సింగ్ చడ్డా’ (Laal Singh Chaddha). అమెరికన్ క్లాసిక్ ‘ఫారెస్ట్ గంప్’ కు రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. కరీనా కపూర్, నాగ చైతన్య కీలక పాత్రలు

Bollywood: స్టార్ హీరోల సినిమాలకు దారుణమైన వసూళ్లు.. ప్రేక్షకులు రాకపోవడంతో షోస్ క్యాన్సిల్..

బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ నటించిన సినిమా ‘లాల్ సింగ్ చడ్డా’ (Laal Singh Chaddha). అమెరికన్ క్లాసిక్ ‘ఫారెస్ట్ గంప్’ కు రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. కరీనా కపూర్, నాగ చైతన్య కీలక పాత్రలు పోషించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఆగస్టు 11న విడుదలైంది. అక్షయ్ కుమార్ నటించిన ‘రక్షా బంధన్’ (Raksha Bandhan) కూడా ఇదే రోజు విడుదలైంది. ఈ రెండు చిత్రాలపై బాలీవుడ్ భారీ ఆశలు పెట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాలు మంచి కలెక్షన్స్‌ను కొల్లగొడతాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. కానీ, వారి ఆశలపై నీళ్లు చల్లుతూ ఈ మూవీస్ భారీ పరాజయాన్ని మూటగట్టుకున్నాయి. ప్రేక్షకులు రాకపోవడంతో థియేటర్ ఓనర్స్ పలు చోట్ల షోస్‌ను క్యాన్సిల్ చేశారు. 


ప్రేక్షకులు థియేటర్స్‌కు రావడానికీ ఆసక్తి చూపకపోవడంతో ‘లాల్ సింగ్ చడ్డా’ కు చెందిన 1300షోస్, ‘రక్షా బంధన్’ 1000షోస్‌ను థియేటర్ ఓనర్స్ రద్దు చేశారు. ‘లాల్ సింగ్ చడ్డా’ ను మెట్రో ప్రాంతాల్లోని ప్రేక్షకులు ఆదరించినప్పటికీ, మాస్ సర్క్యూట్స్‌లోని ప్రేక్షకులు ఆదరించలేదు. ఈ సినిమాకు మొదటి రోజుతో పోల్చుకుంటే రెండో రోజు 40శాతం కలెక్షన్స్ తగ్గాయి. ‘రక్షాబంధన్’ ను మాస్ ప్రేక్షకులు చూసినప్పటికీ, మెట్రో ప్రాంతాల్లోని వారు చూడలేదు. ఈ చిత్రానికి కూడా 30శాతం వసూళ్లు తగ్గాయని బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ రెండు సినిమాలు 10వేల స్క్రీన్స్‌లో విడుదలయ్యాయి. ప్రేక్షకులు థియేటర్స్‌కు రాకపోవడంతో ఖర్చులను మిగుల్చుకోవడానికి ఎగ్జిబిటర్స్ స్వచ్ఛందంగా షోస్‌లను క్యాన్సిల్ చేశారు. ‘లాల్ సింగ్ చడ్డా’ రెండు  రోజుల్లో రూ. 18కోట్ల నుంచి 18. 5కోట్ల వసూళ్లను రాబడుతుందని అంచనా. ‘రక్షా బంధన్’ రెండు రోజులకు గాను రూ. 13.5నుంచి రూ. 14కోట్ల కలెక్షన్స్‌ను కొల్లగొట్టనుందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.

Updated Date - 2022-08-13T20:30:40+05:30 IST