ఆ మాట చెబితే ఎవరూ నమ్మొద్దు!

ABN , First Publish Date - 2022-07-10T07:08:49+05:30 IST

నాకు స్పైసీ ఫుడ్‌ అంటే చాలా ఇష్టం. తెలంగాణ వంటకాలు ఇంకా ఇష్టం.

ఆ మాట చెబితే ఎవరూ నమ్మొద్దు!

నాకు స్పైసీ ఫుడ్‌ అంటే చాలా ఇష్టం. తెలంగాణ వంటకాలు ఇంకా ఇష్టం. బిరియానీ, రొయ్యల కూర... ఇవన్నీ ఇష్టంగా తింటా. ఆ రోజున మాత్రం నన్నెవ్వరూ ఆపలేరు. కానీ మార్నింగ్‌ లేచాక.. రోజుకంటే ఇంకొంచెం ఎక్కువ సేపే వర్కవుట్లు చేస్తా’’.


సినిమా ప్రపంచంలోకి అడుగుపెట్టాక కొన్ని రూల్స్‌ తప్పకుండా పాటించాల్సిందే. ఎందుకంటే ఇది గ్లామర్‌ ప్రపంచం. ఫిట్‌గా లేకపోతే... మన పనైపోయినట్టే. అందుకే హీరో, హీరోయిన్లంతా తమ శరీరాకృతిపై దృష్టి పెడుతుంటారు. సెట్‌కి వెళ్లినా వెళ్లకపోయినా జిమ్‌లో అటెండెన్స్‌ ఉండాల్సిందే. పెళ్లిళ్లకూ, పార్టీలకు వెళ్లినా... డైట్‌ తప్పకుండా పాటించాల్సిందే. సమంత కూడా ఈ విషయంలో స్ర్టిక్ట్‌గానే ఉంటారు. అందుకే ఇన్నేళ్లయినా అదే గ్లామర్‌తో అలరిస్తున్నారు. ‘మీ ఫిట్‌నెస్‌ సీక్రెట్స్‌ ఏంట’ని అడిగితే... సమంత ఇలా చెప్పుకొచ్చారు.


అమ్మాయిలే కనిపిస్తున్నారు

‘‘పొద్దుటే.. కనీసం రెండు గంటలు జిమ్‌లో గడుపుతాను. అది నా డైలీ రొటీన్‌. జిమ్‌కి వెళ్లకపోతే మనసు ఏదోలా ఉంటుంది. చాలామంది పొద్దుటే లేవడానికి బద్దకిస్తారు. ‘నిద్రమానేసి.. ఇప్పుడు జిమ్‌కి వెళ్లడం అవసరమా’ అనిపిస్తుంది. ఆ దశని దాటుకొని రావాల్సిందే. కొన్ని రోజులు ఎంత కష్టమైనా జిమ్‌కి వెళ్లడం అలవాటు చేసుకోండి. వర్కవుట్లు మొదలెట్టాక మన జీవిన విధానంలో చాలా మార్పు వస్తుంది. కాన్ఫిడెన్స్‌ పెరుగుతుంది. ఈమధ్య జిమ్‌కి వెళ్తే అక్కడ అబ్బాయిల కంటే అమ్మాయిలే ఎక్కువ కనిపిస్తున్నారు. అది నాకెంతో సంతోషాన్నిస్తోంది’’.


గ్లామర్‌  కోసమే కాదు...

‘‘నా వర్కవుట్‌ వీడియోల్ని నేనెక్కువగా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తుంటాను. ఎందుకంటే అవి చూసి కొంతమందైనా స్ఫూర్తి పొందుతారని ఆశ. ఎయిర్‌పోర్టులోనో, షూటింగ్‌ స్పాట్‌లోనో చాలామంది అమ్మాయిలు ‘మేం మీ అభిమానులం’ అని వస్తుంటారు. వాళ్లందరినీ ‘వర్కవుట్లు చేస్తుంటారా, డైట్‌ పాటిస్తున్నారా’ అని అడుగుతాను. ఇదంతా గ్లామర్‌ కోసమే కాదు. ఆరోగ్యం కోసం కూడా. ఏ వృత్తిలో అయినా ఉండండి. ఆరోగ్యం కాపాడుకోవడం చాలా ముఖ్యం. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు సరైన సమయానికి తినరు. హెల్తీ డైట్‌ అస్సలుండదు. వర్కవుట్లు చేయరు. వాళ్లంతా ఆరోగ్య సూత్రాలు పాటించడం చాలా అవసరం’’


బరువులు ఎత్తండి

‘‘అమ్మాయిల్ని బరువులు ఎత్తొద్దని చెబుతుంటారు. బరువులు పెరిగితే మజిల్స్‌ వస్తాయని, అబ్బాయిల్లా కనిపిస్తారని భయపెడుతుంటారు. కానీ అది తప్పు. నా వరకూ నేను జిమ్‌లో వెయిట్‌ లిఫ్టింగ్‌కే అధిక ప్రాధాన్యం ఇస్తుంటాను. ఈరోజు వంద కేజీలు ఎత్తితే.. మనసెంతో ప్రశాంతంగా ఉంటుంది. కాన్ఫిడెన్స్‌ లెవల్స్‌ పెరుగుతాయి. అమ్మాయిల్ని చూడండి. చాలా నాజూగ్గా కనిపిస్తారు. ఇంట్లో గ్యాస్‌ సిలెండర్‌ మోయాలన్నా.. ఎవరో ఒకరు సాయం చేయాల్సిందే. ఆ పరిస్థితి మారాలంటే... వాళ్లంతా ఫిట్‌గా ఉండాలి. అప్పుడు మరొకరి మీద ఆధారపడాలన్న ఆలోచన రాదు’’


ఎగ్‌.. చికెన్‌... ఫిష్‌

‘‘మేం ఏది పడితే అది తింటాం.. అస్సలు డైట్‌ పాటించం... అని సినిమావాళ్లు చెబితే అస్సలు నమ్మొద్దు. ఎందుకంటే అది నూటికి నూరుశాతం అబద్ధం. ప్రతి ఒక్కరూ తమ తమ స్థాయిలో డైట్‌ పాటిస్తారు. నా డైట్‌ కూడా చాలా క్రమబద్ధంగా ఉంటుంది. ఉదయం జిమ్‌కి వెళ్లేముందు నా లైట్‌ బ్రేక్‌ ఫాస్ట్‌ అయిపోతుంది. ఎగ్‌, పినెట్‌బటర్‌ లాంటివి తింటా. నిజానికి జిమ్‌కి ఖాళీ కడుపుతో వెళ్తారు. నేను మాత్రం కొంచెం.. వెరైటీ. వర్కవుట్‌ అయ్యాక ప్రొటీన్‌ షేక్‌ తాగుతా.  లంచ్‌లో.. చికెన్‌, ఫిష్‌ ఉంటాయి. లేదంటే ఆకు కూరలు. రైస్‌ తినను. ఇండియన్‌ వెజిటెబుల్స్‌ అంటే నాకు చాలా ఇష్టం. రాత్రి డిన్నర్‌ కూడా ఇంచుమించుగా ఇలానే ఉంటుంది. ఎనిమిదింటికి డిన్నర్‌ పూర్తి కావాల్సిందే. ఆ తరవాత నిద్రపోతా’’


ఆకుకూరలే బలం

‘‘మా ఇంట్లో గార్డెన్‌కి చాలా స్పేస్‌ ఉంది. అందుకే నా కూరగాయల్ని నేనే పండించుకొంటా. ఈమధ్య ఎక్కువగా ఆకు కూరలు తింటున్నా. ఆకు కూరలు ఎక్కువగా తీసుకొనే రోజు.. చాలా ఉల్లాసంగా ఉంటున్నా. డీ హైడ్రేషన్‌కి గురి కాకుండా ఉండడానికి నీళ్లు విపరీతంగా తాగుతా. ఒక్కోసారి... కావల్సిన మోతాదులో నీళ్లు తీసుకోకపోతే... ఏ పనీ చేయడానికి నా శరీరం సహకరించదు. వెంటనే ఓ లీటర్‌ వాటర్‌ గడగడ తాగేస్తా’’


తెలంగాణ రుచులు వారెవా..

‘‘ప్రతి ఒక్కరికీ ఓ చీటింగ్‌ డే ఉంటుంది. ఆ రోజున.. డైటింగ్‌ అంతా పక్కన పెట్టేస్తా. నాకు స్పైసీ ఫుడ్‌ అంటే చాలా ఇష్టం. తెలంగాణ వంటకాలు ఇంకా ఇష్టం. బిరియానీ, రొయ్యల కూర... ఇవన్నీ ఇష్టంగా తింటా. ఆ రోజున మాత్రం నన్నెవ్వరూ ఆపలేరు. కానీ మార్నింగ్‌ లేచాక.. రోజుకంటే ఇంకొంచెం ఎక్కువ సేపే వర్కవుట్లు చేస్తా’’.


ఇదే నా సలహా

‘‘అమ్మాయిలు హెల్తీగా ఉండడం చాలా అవసరం. మానసికంగా వాళ్లు చాలా స్ర్టాంగ్‌. శారీకంగానూ... ధృఢంగా ఉండాలి. ఇంటి పనులు, ఆఫీసు పనులతో చాలామంది డైట్‌ అస్సలు పట్టించుకోరు. వాళ్లంతా... తమ ఆరోగ్యంపై దృష్టి పెట్టాలన్నది నా సలహా. కాన్పు సమయంలో.. వాళ్లెంతో ఒత్తిడికి, శారీరక అలసటకీ గురవుతారు. ఓ బిడ్డకు జన్మనివ్వడం మామూలు విషయం కాదు. ఆ సమయంలో వాళ్లెంతో ధృఢత్వం చూపిస్తారు. అంత వేదన అనుభవించి, చేతిలో బిడ్డని చూసుకోగానే, అదంతా అప్పటికప్పుడు మర్చిపోతారు. ఇది అమ్మాయిలే చేయగల అద్భుతం’’.

Updated Date - 2022-07-10T07:08:49+05:30 IST