Director Vamsi: 'పసలపూడి కథలు'పై పరిశోధనకు డాక్టరేట్

ABN , First Publish Date - 2022-07-30T18:09:34+05:30 IST

సీనియర్‌ దర్శకుడు వంశీని, గోదావరిని విడదీసి చూడలేం. ఆయన కథల్లో, చిత్రాల్లో గోదావరిని కళ్ళకు కట్టినట్టు ఆవిష్కరిస్తారు. ముఖ్యంగా సొంతూరు పసలపూడి పేరుతో వంశీ రాసిన కథలు ఎంతగా ఫేమస్‌ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విపరీతమైన పాఠకాదరణ పొందిన ఆ కథలపై తూర్పు గోదావరికి చెందిన కె. రామచంద్రా రెడ్డి పీహెచ్‌డీ చేశారు.

Director Vamsi: 'పసలపూడి కథలు'పై పరిశోధనకు డాక్టరేట్

సీనియర్‌ దర్శకుడు వంశీ(Director vamsi)ని, గోదావరిని విడదీసి చూడలేం. ఆయన కథల్లో, చిత్రాల్లో గోదావరిని కళ్ళకు కట్టినట్టు ఆవిష్కరిస్తారు. ముఖ్యంగా సొంతూరు పసలపూడి పేరుతో వంశీ రాసిన కథలు ఎంతగా ఫేమస్‌ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విపరీతమైన పాఠకాదరణ పొందిన ఆ కథలపై తూర్పు గోదావరికి చెందిన కె. రామచంద్రా రెడ్డి పీహెచ్‌డీ చేశారు.  

తూర్పు గోదావరి జిల్లాలో ‘పసలపూడి’ వంశీ సొంతూరు. దానికి సమీపంలోని ‘గొల్ల మామిడాడ’ రామచంద్రారెడ్డి ఊరు. ఆయన 24 ఏళ్లుగా డిగ్రీ కళాశాలలో తెలుగు లెక్చరర్‌గా పని చేస్తున్నారు. వంశీ రచించిన పసలపూడి కథలు (Pasalapudi kathalu)అంటే ఆయనకు ఎంతో ఇష్టం. అందుకని, తన పీహెచ్‌డీకి పరిశోథనాంశంగా ఎంచుకున్నారు. ఆయనదీ గోదావరే కాబట్టి అక్కడి యాస, భాష, మాండలికంపై అవగాహన ఉంది. దాంతో పెద్ద ఇబ్బంది లేకుండా తన పరిశోధనను విజయవంతంగా పూర్తి చేసి ఆంధ్రా యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ పొందారు. (Doctorate for Pasalapudi kathlu)


వంశీ ‘పసలపూడి కథలు’’పై పీహెచ్‌డీ చేసిన కె. రామచంద్ర రెడ్డి తన పరిశోధనను మొత్తం ఏడు అధ్యాయాలుగా విభజించారు. వాటిలో రచయితతో ముఖాముఖితో పాటు బాపు – రమణల ప్రశంసా కవిత, వంశీ కథలకు బాపు గీసిన బొమ్మలు కథల్లోని ప్రాంతాల ఫోటోలతో పలు ఆసక్తికరమైన అంశాలన పొందుపరిచారు.


ప్రస్తుతం ఇజ్రాయిల్‌లోని హిబ్రూ యూనివర్సిటీ ఈఆర్సీ – నీమ్‌ ప్రాజెక్టులో కె. రామచంద్రా రెడ్డి సభ్యుడిగా ఉన్నారు. అమెరికా అట్లాంటాలోని ఎమొరీ యూనివర్సిటీలో జరిగిన కాన్పరెన్స్‌లో పాల్గొని పరిఽశోధన పత్రాన్ని సమర్పించారు. ఇంకా పలు అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర సెమినార్లలో పాల్గొని రీసెర్చ్‌ పేపర్లు సబ్‌మిట్‌ చేశారు. ‘తూర్పుగోదావరి జిల్లా సమగ్ర సాహిత్యం’’ అనే బృహత్‌ సంపుటానికి, ‘తూర్పు గోదావరి జిల్లా కథలు... అలలు’ అనే కథా సంపుటికి సహ సంపాదకుడిగా పని చేశారు. ఇప్పుడు వంశీ ‘మా పసలపూడి కథలు – ఒక పరిశీలన’ అనే అంశంపై సిద్థాంత గ్రంథం రచించి పీహెచ్‌డీ పట్టా పొందారు.




Updated Date - 2022-07-30T18:09:34+05:30 IST