Rajamouli ఎఫెక్ట్ : ప్రభాస్ మీద ఉన్నట్టే... చరణ్, ఎన్టీఆర్ మీద కూడా ఉంటుందా?

ABN , First Publish Date - 2022-03-29T04:11:39+05:30 IST

‘బాహుబలి 2’ విడుదలైన మరుక్షణం జనం మదిలో మెదిలిన ప్రశ్న ఏంటంటే... జక్కన్న నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటి అనే! దానికి సమాధానం ఇప్పుడైతే మనకు నూటికి నూరుపాళ్లు తెలిసిందే! ‘ఆర్ఆర్ఆర్’...

Rajamouli ఎఫెక్ట్ : ప్రభాస్ మీద ఉన్నట్టే... చరణ్, ఎన్టీఆర్ మీద కూడా ఉంటుందా?

‘బాహుబలి 2’ విడుదలైన మరుక్షణం జనం మదిలో మెదిలిన ప్రశ్న ఏంటంటే... జక్కన్న నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటి అనే! దానికి సమాధానం ఇప్పుడైతే మనకు నూటికి నూరుపాళ్లు తెలిసిందే! ‘ఆర్ఆర్ఆర్’...


బోలెడు ఎక్స్‌పెక్టేషన్స్ మధ్య మొదలైన ‘ట్రిపుల్ ఆర్’ మూవీ అంతకంటే ఎక్కువ అడ్డంకులు, అవాంతరాల మధ్య ఒక్కో అడుగు వేస్తూ బాక్సాఫీస్ దాకా వచ్చింది. ఇద్దరు టాలీవుడ్ టాప్ హీరోలు, దేశంలోనే ఎంతో పేరున్న అగ్ర దర్శకుడు... సంవత్సరాల తరబడి సినిమాకి అంకితం అయ్యారు. ఓపిగ్గా లాక్‌డౌన్స్ అన్నీ దాటుకుని విజువల్ వండర్‌ని మనదాకా తీసుకొచ్చారు. అయితే, ‘ఆర్ఆర్ఆర్’ స్పెక్టాక్యులర్ సక్సెస్ తరువాత ప్రస్తుతం ఓ ఆసక్తికర చర్చ మాత్రం సాగుతోంది. అదేంటంటే... 


‘బాహుబలి’ సినిమాకి ముందు ప్రభాస్ కేవలం మన తెలుగు పరిశ్రమకే పరిమితం. కానీ, రాజమౌళి రాయల్ మూవీ తరువాత జాతీయ స్థాయికి ఎదిగాడు. ‘బాహుబలి 2’ తరువాత అయితే బాలీవుడ్ ప్రభాస్ పేరు చెబితే చాలు ఊగిపోయింది. అంతటితో ఆగలేదు బీ-టౌన్. ‘సాహో’ సినిమాను కూడా హిందీ ప్రేక్షకులు మనకంటే ఎక్కువగా ఆదరించేశారు. అయితే, ఇప్పుడు మన ‘డార్లింగ్’ చేతిలో ఉన్న సినిమాలు చూస్తే ఆయన రేంజ్ ఏంటో, క్రేజ్ ఏంటో ఇట్టే తెలిసిపోతుంది. ‘బాహుబలి’కి ముందు టాలీవుడ్ హీరో అనిపించుకున్న ప్రభాస్ ఇప్పుడు ‘ఆదిపురుష్’ అనే బాలీవుడ్ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ‘సలార్’ సినిమాను కన్నడ ప్రొడ్యూసర్స్ బ్యాంక్‌రోల్ చేస్తున్నారు. తెలుగు నిర్మాత అశ్వనీదత్ వైజయంతి మూవీస్ బ్యానర్‌పై ప్రభాస్ మరో ప్యాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. వీట్ని బట్టి మనకు ఏం అర్థమైంది? ప్రభాస్ ‘బాహుబలి’ తరువాత టాలీవుడ్, బాలీవుడ్, శాండల్‌వుడ్ అన్న తేడా లేకుండా నేషనల్ స్టార్ అయిపోయాడు. అతడితో సినిమా తీసేందుకు భాషలకు, పరిశ్రమలకు అతీతంగా ఫిల్మ్ మేకర్స్ క్యూ కడుతున్నారు. ఇదంతా ఎవరి ఎఫెక్ట్? ఖచ్చితంగా దర్శక ‘బాహుబలి’ రాజమౌళి ప్రభావమే!  


ప్రభాస్‌ను ఎక్కడ్నుంచీ ఎక్కడికో తీసుకెళ్లిన దర్శకధీరుడు రాజమౌళి... అదే పని రామ్ చరణ్, ఎన్టీఆర్ విషయంలో కూడా చేయగలడా? ‘ఆర్ఆర్ఆర్’ విడుదల ముందు దాకా చాలా మందికి ఈ అనుమానం ఉండేది. మెగాపవర్ స్టార్, యంగ్ టైగర్ కూడా ఇండియా వైడ్ క్రేజ్ సంపాదిస్తారా అని ఫ్యాన్స్ మాట్లాడుకుంటూ ఉండేవారు. సినిమా విడుదలతో ఆ డౌట్స్ అన్నీ బ్రేక్ అయిపోయాయి. బాక్సాపీస్ వద్ద రికార్డులు బ్రేక్ అవుతుండటంతో హిందీ ఆడియన్స్ చెర్రీ, తారక్‌ని కూడా యాక్సెప్ట్ చేశారనే భావించాలి. అయితే, ‘ఆర్ఆర్ఆర్’ని ‘బాహుబలి’ మేనియాతో పోల్చలేమన్నది కూడా నిజమే. మరికొన్నాళ్లు పోతే తప్ప ‘ఆర్ఆర్ఆర్’ ఫైనల్ ఎఫెక్ట్ మనకు తెలియదు. అయినా కూడా తమ హీరోలిద్దరూ ప్రభాస్ మాదిరిగా ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్స్‌తో మున్ముందు దూసుకుపోతారని హార్డ్ కోర్ ఫ్యాన్స్ సొషల్ మీడియాలో చర్చలు చేస్తున్నారు. చూడాలి మరి, ఏం జరుగుతుందో... ‘ఆదిపురుష్, సలార్’ లాంటి వందల కోట్ల చిత్రాలు చరణ్, తారక్ కూడా సైన్ చేస్తారేమో! వారి గురించి కూడా హిందీ, కన్నడ ఫిల్మ్ మేకర్స్ క్యూ కడతారేమో! లెట్స్ వెయిట్...    

Updated Date - 2022-03-29T04:11:39+05:30 IST