‘థ్యాంక్యూ’లో అంత‌ర్లీనంగా చెప్పిన విషయమదే: Vikram K Kumar

ABN , First Publish Date - 2022-07-15T01:37:52+05:30 IST

యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya), ‘మనం’ దర్శకుడు విక్రమ్ కె. కుమార్ (Vikram K Kumar) కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘థ్యాంక్యూ’ (Thank You). సక్సెస్‌ఫుల్ నిర్మాతలు దిల్‌రాజు, శిరీష్‌లు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్

‘థ్యాంక్యూ’లో అంత‌ర్లీనంగా చెప్పిన విషయమదే: Vikram K Kumar

యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya), ‘మనం’ దర్శకుడు విక్రమ్ కె. కుమార్ (Vikram K Kumar) కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘థ్యాంక్యూ’ (Thank You). సక్సెస్‌ఫుల్ నిర్మాతలు దిల్‌రాజు, శిరీష్‌లు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై  ఈ చిత్రాన్ని నిర్మించారు. రాశిఖన్నా, మాళవిక నాయర్ హీరోయిన్లుగా నటించారు. టీజర్‌, ట్రైలర్‌తో అందరిలోనూ ఆసక్తిని కలిగించిన  ఈ చిత్రం జూలై 22న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు విక్రమ్ కె. కుమార్ చిత్ర విశేషాలను మీడియాకు తెలియజేశారు.


ఆయన మాట్లాడుతూ..

‘‘మ‌నం మన దైనందిన జీవితంలో ‘థ్యాంక్యూ’ అనే మాటను చాలా సార్లు వాడీ.. వాడీ.. దాని అర్థాన్నే మార్చేశాం. ప్రతీ చిన్న విష‌యానికీ థ్యాంక్యూ చెప్పి, అస‌లైన విష‌యాల్లో కృత‌జ్ఞతను చూపించ‌డం మానేశాం. ఆ విష‌య‌మే.. థ్యాంక్యూలో అంత‌ర్లీనంగా చెప్పాం. నేను ఈరోజు ఈ స్థాయిలో ఇక్కడ ఉన్నానంటే.. అందుకు మా నాన్నగారే కార‌ణం. ఆయ‌న‌కు నేను ఏ రోజూ థాంక్స్ చెప్పలేదు. కానీ ఓరోజు ఆయ‌న ఈ లోకాన్ని విడిచి పెట్టేసి వెళ్లిపోయారు. నిజానికి మ‌న త‌ల్లిదండ్రులు మ‌న నుంచి థాంక్యూ అనే ప‌దాన్ని చెప్పాల‌ని కోరుకోరు. ఒక‌వేళ చెప్పినా వారికి కోపం వ‌స్తుంది. కానీ మ‌నం వారికి థాంక్యూ చెప్పాలి. 


ఈ సినిమాలోని పాత్రని చైతూ మాత్రమే చేయ‌గ‌ల‌డు. ఎందుకంటే... ఈ సినిమాలో మూడు విభిన్న గెట‌ప్పుల్లో  చై క‌నిపించాలి. అందులో ప‌ద‌హారేళ్ల వ‌య‌సులో క‌నిపించాల్సిన పాత్ర కూడా ఉంది. మ‌రే హీరోతోనూ.. ఆ పాత్ర చేయించ‌లేం. గ్రాఫిక్సుల్లో మార్చి చూపించ‌లేం. చై మాత్రమే ప‌దహారేళ్ల కుర్రాడిగా, న‌ల‌భై ఏళ్ల న‌డివ‌య‌స్కుడిగా క‌నిపించ‌గ‌ల‌డు. 16 ఏళ్ల కుర్రాడిగా క‌నిపించ‌టం కోసం చైత‌న్య చాలా క‌ష్టప‌డ్డారు. 40-50 రోజుల పాటు స్పెష‌ల్ డైట్ తీసుకుని బ‌రువు త‌గ్గి త‌న లుక్‌ను మార్చుకున్నారు. ఆ పాత్రకు సంబంధించిన క్రెడిట్ అంతా నాగ చైత‌న్యకే ద‌క్కుతుంది.


దిల్ రాజుతో ప‌ద‌హారేళ్ల అనుబంధం ఉంది. క‌లిసిన‌ప్పుడ‌ల్లా ‘మ‌నం సినిమా చేద్దాం..’ అంటుండేవారు. ఇన్నాళ్లకు ‘థ్యాంక్యూ’తో అది కుదిరింది. ఆల‌స్యమైనా స‌రే, ఈ సంస్థ ప్రతిష్టకు త‌గిన క‌థ‌తో సినిమా చేసినందుకు ఆనందంగా ఉంది.


‘థాంక్యూ’  సినిమాలో ఓ మ్యాజిక్ ఉంటుంది. క‌చ్చితంగా అది ప్రేక్షకుల‌కు న‌చ్చుతుంది. సినిమా స్క్రిప్ట్ డిస్కష‌న్ చేసుకున్న త‌ర్వాత మ‌న జీవితంలో క‌చ్చితంగా కొంద‌రికి థాంక్స్ చెప్పాల‌ని నేను, చైత‌న్య భావించాం. ఆ ఫీలింగ్ మా ఇద్దరిలోనూ క‌లిగింది. అలా కొంద‌రికీ థాంక్స్ చెప్పిన త‌ర్వాతే ఈ సినిమాను స్టార్ట్ చేశాం. ఈ క‌థ నాగ‌చైత‌న్యకు వినిపించ‌గానే.. త‌ను నాకు ‘థ్యాంక్యూ’ చెప్పాడు. త‌ను ఈ సినిమా అంగీకరించినందుకు నేను థ్యాంక్యూ చెప్పాను. అలా.. మా కృత‌జ్ఞత‌ల ప‌ర్వం మొద‌లైంది. రాశీఖ‌న్నా కూడా త‌న పాత్రలో అద్భుతంగా రాణించింది. ఓసారి మానేట‌ర్‌లో త‌న న‌ట‌న చూస్తూ... నేనే షాక్‌కి గుర‌య్యాను. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు. వాళ్లంద‌రికీ ఈ సినిమాతో మంచి పేరొస్తుంది.


బివిఎస్ రవి వచ్చి ఈ క‌థ‌ను చెప్పగానే క‌థ‌లోని మెయిన్ సోల్ నాకు చాలా బాగా న‌చ్చింది. ఆ సోల్‌ను నా స్టైల్‌లో ఆడియెన్స్‌కు చెప్పాల్సిన అవ‌స‌రం ఉంది. అలా ముందుకు వెళ్లాం. ద‌ర్శకుడిగా నేను వేరే క‌థ‌కు క‌నెక్ట్ కాలేన‌ప్పుడు ఆ సినిమాను డైరెక్ట్ చేయ‌లేను క‌దా. 


మ‌న‌లో చాలా మంది జీవితంలో ఎన్నో క‌ష్టాలు ప‌డి ఈ స్థాయికి వ‌చ్చామ‌ని అనుకుంటూ ఉంటారు. కానీ వారి స‌క్సెస్‌లో ఇత‌రుల స‌పోర్ట్ ఎంతో ఉంటుంది. దాన్ని ఎవ‌రూ గుర్తించ‌రు. గుర్తించినా.. అహంతో ఉండిపోతారు. కానీ మన సక్సెస్‌లో భాగ‌మైన వారికి  థాంక్స్ చెప్పటంలో ఓ సంతోషం ఉంటుంది. మ‌న జీవితంలో మార్పుకు వ్యక్తులే కార‌ణంగా ఉండాల‌నేం లేదు. కొన్ని సందర్భాలు కూడా మ‌న‌లో మార్పుని తీసుకొస్తాయి. ఏదేమైనా మ‌న‌లో ఆ కృత‌జ్ఞతాభావం అనేది ఉండాలి. 


ఇలాంటి ఫీల్ గుడ్ మూవీని స్క్రీన్‌పై చూపించాలంటే సంగీతానికి చాలా ప్రాధాన్యత‌ను ఇవ్వాల్సి ఉంటుంది. త‌మ‌న్ మా సినిమాకు అద్బుత‌మైన సంగీతాన్ని అందించారు. రీసెంట్‌గా బ్యాగ్రౌండ్ స్కోర్ విన్నాను. చాలా చాలా బాగా చేశాడు. మ‌న‌సు పెట్టి మ్యూజిక్ అందించాడు త‌మ‌న్‌. 


థ్యాంక్యూ సినిమాని చాలామంది ‘ఆటోగ్రాఫ్‌, ప్రేమ‌మ్’ వంటి సినిమాల‌తో పోలుస్తున్నారు. రెండూ చాలా గొప్ప సినిమాలు. వాటితో నా సినిమాని పోల్చడం చాలా ఆనందాన్ని క‌లిగిస్తోంది. అయితే.. ఆ రెండు చిత్రాల‌కు థ్యాంక్యూ భిన్నంగానే ఉంటుంది.


‘24’ సీక్వెల్ చేయాల‌ని ఎప్పటి నుంచో అనుకుంటున్నా.. మొన్నోసారి చిన్న క‌థ కూడా అనుకొన్నాను. ఆ స్క్రిప్టుపై ప‌క‌డ్బందీగా ప‌ని చేయాలి. అప్పుడే తెర‌పైకి తీసుకెళ్లాలి.


 చైతూతో ఓ హార‌ర్ వెబ్ సిరీస్ చేస్తున్నా. అది షూటింగ్ పూర్తి కావొచ్చింది. త్వర‌లో.. ఓ హిందీ సినిమా చేస్తున్నా. అది యాక్షన్ జోన‌ర్‌లో సాగుతుంది. మైత్రీ మూవీస్‌లో ఓ సినిమా చేస్తున్నాను..’’ అని విక్రమ్ కె కుమార్ చెప్పుకొచ్చారు.

Updated Date - 2022-07-15T01:37:52+05:30 IST