సినిమాలపై ప్రేమే.. మరణశయ్యపై ఉన్న నన్ను బతికించింది: దర్శకుడు

ABN , First Publish Date - 2021-12-06T23:29:02+05:30 IST

కరోనా వైరస్‌ సోకడంతో నా ఆరోగ్యం సీరియస్‌గా మారింది. దీంతో ఐసీయూ వార్డులో చేర్చారు. ఒక విధంగా మరణశయ్యపై ఉన్నాను. కానీ, సినిమా రంగంపై ఉన్న ప్రేమే నన్ను ప్రాణాలతో...

సినిమాలపై ప్రేమే.. మరణశయ్యపై ఉన్న నన్ను బతికించింది: దర్శకుడు

కరోనా వైరస్ బారినపడిన తనను సినిమాపై ఉన్న ప్రేమే మళ్లీ బతికించిందని ప్రముఖ దర్శకుడు వసంతబాలన్‌ పేర్కొన్నారు. ఆయన దర్శకత్వం వహించిన చిత్రం ‘జెయిల్‌’ ఈనెల 9వ తేదీన విడుదల కానుంది. జీవీ ప్రకాష్‌ - అపర్ణతి జంటగా నటించిన ఈ చిత్రాన్ని క్రికీస్‌ సినీ క్రియేషన్స్‌ పతాకంపై నిర్మాత శ్రీధరన్‌ మరియదాసన్‌ నిర్మించారు. హీరోగా నటించిన జీవీ ప్రకాష్‌ సంగీతం సమకూర్చారు. ఈ చిత్ర ఆడియో, ట్రైలర్‌ రిలీజ్‌ వేడుక తాజాగా చెన్నై నగరంలో జరిగింది. 


ఈ సందర్భంగా దర్శకుడు వసంతబాలన్‌ మాట్లాడుతూ.. ‘‘కరోనా వైరస్‌ సోకడంతో నా ఆరోగ్యం సీరియస్‌గా మారింది. దీంతో ఐసీయూ వార్డులో చేర్చారు. ఒక విధంగా మరణశయ్యపై ఉన్నాను. కానీ, సినిమా రంగంపై ఉన్న ప్రేమే నన్ను ప్రాణాలతో నిలబెట్టింది. చెన్నై నగరంలో మంచి పేరున్న మురికివాడలో ఈ చిత్ర షూటింగ్‌ పూర్తి చేశాం. కానీ, సినిమాను రిలీజ్‌ చేయడంలో అనేక కష్టాలు ఎదుర్కొన్నాం. కానీ, హీరో జీవీ ప్రకాష్‌ ఎంతో అండగా నిలిచారు. ఓటీటీలో మంచి ఆఫర్‌ కూడా వచ్చింది. కానీ, హీరో జీవీ ఏ మాత్రం నమ్మకం కోల్పోలేదు. థియేటర్‌లోనే రిలీజ్‌ చేయాలని పట్టుబట్టారు. అలాగే, నిర్మాత శ్రీధరన్‌ మరియదాసన్‌ కూడా థియేటర్‌లోనే రిలీజ్‌ చేయాలన్న సంకల్పంతోనే ఉన్నారు. పాత మహాబలిపురం రోడ్డు ప్రాంతానికి వెళితే రోడ్డుకు ఒకవైపున లక్ష రూపాయలు వేతనం తీసుకుని చేతిలో ఐఫోన్‌ పట్టుకుని వెళ్ళే ఒక కుర్రోడు కనిపిస్తాడు. అదే రోడ్డులో మరోవైపు బడికి వెళ్ళలేక, చదుకోలేక అష్టకష్టాలు పడుతుంటారు. ఇలాంటి పరిస్థితుల వెనుక ఉన్న కారణాలు ఏంటి అనే అంశంతో ఈ చిత్రం తెరకెక్కింది. జీవీ ప్రకాష్‌ అద్భుతంగా నటించారు. ఖచ్చితంగా మరో ‘వెయిల్‌’, ‘అంగాడి తెరు’ వంటి చిత్రాల తరహాలో అలరిస్తుందన్న నమ్మకం ఉంది’’ అని పేర్కొన్నారు. అలాగే, హీరో జీవీ ప్రకాష్‌, నిర్మాత శ్రీధరన్‌ తదితరులు ఈ కార్యక్రమంలో ప్రసంగించారు.

Updated Date - 2021-12-06T23:29:02+05:30 IST