ఆ రోజు Shah Rukh Khan ఒక ప్రాణం కాపాడాడు: డైరెక్టర్ హన్సల్ మెహతా

ABN , First Publish Date - 2021-11-03T16:48:49+05:30 IST

ఇటీవల వ్యక్తిగతంగా ఇబ్బందులు ఎదుర్కొన్న బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ మంగళవారం జన్మదినోత్సవం జరుపుకున్నాడు.

ఆ రోజు Shah Rukh Khan ఒక ప్రాణం కాపాడాడు: డైరెక్టర్ హన్సల్ మెహతా

ఇటీవల వ్యక్తిగతంగా ఇబ్బందులు ఎదుర్కొన్న బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ మంగళవారం జన్మదినోత్సవం జరుపుకున్నాడు. ఎప్పుడూ వైభవంగా బర్త్ డే వేడుకలు చేసుకునే షారూక్.. ఈ సారి మాత్రం నిరాడంబరంగా కుటుంబ సభ్యుల మధ్య సెలబ్రేట్ చేసుకున్నాడు. బాలీవుడ్ సినీ ప్రముఖులందరూ షారూక్‌కు సోషల్ మీడియా ద్వారా విషెస్ తెలియజేశారు. షారూక్‌కు విషెస్ చెబుతూ బాలీవుడ్ దర్శకుడు హన్సల్ మెహతా చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. 


`నేను ఇప్పటికి షారూక్‌తో మూడు సార్లు మాత్రమే ఇంటరాక్ట్ అయ్యాను. అయినా ఆయన ఎందుకంత సూపర్‌స్టార్ అయ్యారో, ఎంత గొప్ప మనిషో చెప్పగల అనుభవం నాకు ఎదురైంది. బ్రెయిన్ ట్యూమ‌ర్‌తో బాధపడుతున్న ఓ బాలుడకి అత్యవసరంగా ఆర్థిక సహాయం కావాలని కోరతూ నేను గతంలో ట్విటర్‌లో ఓ మెసేజ్ పెట్టాను. తర్వాతి రోజు ఉదయం నేను షూటింగ్ పూర్తి చేశాక నా ఫోన్ చూసుకుంటే తెలియని నెంబర్ నుంచి మూడు మిస్డ్ కాల్స్ ఉన్నాయి. షారూక్ నుంచి అని తెలిసి నేను ఫోన్ చేస్తే ఆయన బాలుడి గురించి అడిగారు. ఏం అవసరమైనా చేస్తానని చెప్పి ఆ బాలుడి వివరాలు అడిగారు. కొద్ది గంటల తర్వాత హాస్పిటల్ వారు నాకు ఫోన్ చేసి డబ్బులు అందాయని చెప్పారు. చాలా సైలెంట్‌గా, ఎలాంటి ప్రచారమూ ఆశించకుండా షారూక్ ఒక ప్రాణాన్ని కాపాడారు. మరి కొద్ది నెలల తర్వాత కూడా షారూక్ అలాగే స్పందించి మరో ప్రాణాన్ని కాపాడార`ని హన్సల్ పేర్కొన్నారు. 

Updated Date - 2021-11-03T16:48:49+05:30 IST