‘ఆర్ఆర్ఆర్’ చిత్రానికి పనిచేసిన ప్రతి ఒక్కరి ప్రతిభను ట్విట్టర్ వేదికగా అభినందించారు దర్శకుడు గుణశేఖర్. ప్రపంచవ్యాప్తంగా శుక్రవారం విడుదలైన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం కలెక్షన్ల ప్రభంజనాన్ని సృష్టిస్తోంది. కొత్త కొత్త రికార్డులను నమోదు చేస్తూ.. గ్లోబల్‌గా బాక్సాఫీస్‌పై రామ్, భీమ్‌లు దండెత్తుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం మూడు రోజులలో కలెక్ట్ చేసిన వసూళ్లు 500 కోట్లకు పైనే అంటూ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. విడుదలైన అన్ని చోట్లా.. ప్రేక్షకులు, విమర్శకులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా ట్విట్టర్ ద్వారా చిత్రయూనిట్‌కు దర్శకుడు గుణశేఖర్ అభినందనలు తెలిపారు.
‘‘ప్రతి ఫ్రేమ్‌లోనూ మీరు (ఎస్. ఎస్. రాజమౌళి, తారక్, రామ్ చరణ్, ఎమ్ఎమ్ కీరవాణి, డిఓపీ సెంథిల్ కుమార్, సాబుసిరిల్, డీవీవీ దానయ్య) కనబరిచిన ప్రతిభ అద్భుతం! వర్ణనాతీతం!!. తిరిగి ప్రపంచ బాక్సాఫీస్‌కి కళ తెప్పించిన మీకు హృదయపూర్వక అభినందనలు..’’ అని గుణశేఖర్ ట్విట్టర్లో పేర్కొన్నారు. తన సినిమాలలో వేసే సెట్స్‌తో ప్రేక్షకులను అబ్బురపరుస్తుంటారు గుణశేఖర్. ఆయన కూడా ‘రుద్రమదేవి’ చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపును పొందారు. ఇప్పుడు ‘శాకుంతలం’ అంటూ మరో దృశ్యకావ్యాన్ని.. త్వరలోనే పాన్ ఇండియా వైడ్‌గా థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు. సమంత ఇందులో ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రాన్ని కూడా అత్యద్భుతమైన విజువల్ వండర్‌గా మలిచేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు.