Love Today: అల్లు అరవింద్‌లా దిల్ రాజు మ్యాజిక్ చేస్తాడా?

ABN , First Publish Date - 2022-11-08T22:09:01+05:30 IST

రిషభ్ శెట్టి (Rishab Shetty) నటించి, దర్శకత్వం వహించిన కన్నడ చిత్రం ‘కాంతార’ (Kantara)ను తెలుగులో ‘గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్’ ద్వారా..

Love Today: అల్లు అరవింద్‌లా దిల్ రాజు మ్యాజిక్ చేస్తాడా?

రిషభ్ శెట్టి (Rishab Shetty) నటించి, దర్శకత్వం వహించిన కన్నడ చిత్రం ‘కాంతార’ (Kantara)ను తెలుగులో ‘గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్’ ద్వారా అల్లు అరవింద్ (Allu Aravind) విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర నిజంగా మ్యాజిక్కే చేసింది. తెలుగులో ఈ చిత్రం రూ. 50 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి.. అందరినీ ఆశ్చర్యపరిచింది. కన్నడలో భారీ విజయం సాధించడమే కాకుండా.. ఈ చిత్రం విడుదలైన అన్ని చోట్ల మంచి విజయం సాధించింది. ఇప్పుడు అల్లు అరవింద్ మార్గంలోనే మరో నిర్మాత దిల్ రాజు (Dil Raju) కూడా నడిచేందుకు రెడీ అవుతున్నారు. ఇటీవల తమిళంలో విడుదలై ఘనవిజయం సాధించిన ‘లవ్‌టుడే’(Love Today) చిత్రాన్ని ఎస్‌విసి ప్రజంట్స్‌లో దిల్ రాజు తెలుగు ప్రేక్షకులకు అందించబోతున్నారు. న‌వంబ‌ర్ మూడో వారంలో తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను భారీగా విడుద‌ల చేయ‌టానికి దిల్ రాజు స‌న్నాహాలు చేస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. మరి ఈ చిత్రంతో అల్లు అరవింద్‌లా.. దిల్ రాజు ఎటువంటి మ్యాజిక్‌కు క్రియేట్ చేస్తాడో చూడాల్సి ఉంది.


‘లవ్‌టుడే’ విషయానికి వస్తే.. 2019లో రిలీజై బ్లాక్‌బ‌స్ట‌ర్ అయిన ‘కోమాలి’ సినిమాను ప్ర‌దీప్ రంగ‌నాథ్ (Pradeep Ranganathan) తెర‌కెక్కించారు. ‘ల‌వ్‌టుడే’ ఆయ‌న రెండో సినిమా. ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌టంతో పాటు హీరోగానూ ఆయ‌నే న‌టించారు. త‌మిళంలో గ‌త శుక్ర‌వారం విడుద‌లైన ఈ చిత్రం హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. స‌త్య‌రాజ్‌, రాధికా శ‌ర‌త్ కుమార్ పోషించిన పాత్ర‌లు ఈ సినిమాకు ప్ర‌ధాన బ‌లంగా చెప్పుకుంటున్నారు. సినిమా బ‌డ్జెట్ కంటే ప‌ది రెట్లు లాభాన్ని సాధిస్తుంద‌ని కోలీవుడ్ సినీ వ‌ర్గాలంటున్నాయి. యూత్‌, ఫ్యామిలీ ఆడియెన్స్‌కు ఈ రొమాంటిక్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్ బాగా క‌నెక్ట్ అయ్యింది. ఎ.జి.ఎస్‌. ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై క‌ల్పతి అఘోరాం, క‌ల్పతి ఎస్‌. గ‌ణేష్ నిర్మించారు. మ్యూజిక్ సంచ‌ల‌నం యువ‌న్ శంక‌ర్ రాజా (Yuvan Shankar Raja) సంగీతం అందించారు.

Updated Date - 2022-11-08T22:09:01+05:30 IST