Dil raju: రెండు మూడు రోజుల్లో కొలిక్కి వస్తాయి

ABN , First Publish Date - 2022-08-19T00:16:21+05:30 IST

ఆగస్ట్‌ 22 నుంచి చిత్రీకరణలు ప్రారంభమవుతాయంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని నిర్మాత దిల్‌ రాజు స్పష్టం చేశారు. ఫిల్మ్‌ ఛాంబర్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. నిలిచిపోయిన సినిమా చిత్రీకరణలు ఎప్పటి నుంచి ప్రారంభమయ్యేది త్వరలో తెలియజేస్తామన్నారు.

Dil raju: రెండు మూడు రోజుల్లో కొలిక్కి వస్తాయి

ఆగస్ట్‌ 22 నుంచి చిత్రీకరణలు ప్రారంభమవుతాయంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని నిర్మాత దిల్‌ రాజు (Dil raju)స్పష్టం చేశారు. ఫిల్మ్‌ ఛాంబర్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. నిలిచిపోయిన సినిమా చిత్రీకరణలు ఎప్పటి నుంచి ప్రారంభమయ్యేది త్వరలో తెలియజేస్తామన్నారు. ‘‘ఆగస్టు 1 నుంచి షూటింగ్‌లు అపేసి కమిటీలు వేసుకున్నాం. నిర్మాతలంతా కలిసి తీసుకున్న నిర్ణయమిది. పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై గత 18 రోజులుగా వివిధ విభాగాలతో జరుగుతున్న చర్చలు ఓ కొలిక్కి వస్తున్నాయి. నిర్మాతలుగా (Tollywood producers) కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. ఓటీటీల (OTT movies) విడుదలపై ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చాం.  థియేట్రికల్‌ రిలీజ్‌ తర్వాత 8 వారాలకు లేదా 50 రోజుల తర్వాత మాత్రమే ఓటీటీలో రిలీజ్‌ చేయాలని నిర్ణయం తీసుకున్నాం.ఇప్పటికే ఓటీటీలతో అగ్రిమెంట్‌ కుదుర్చుకున్న సినిమాలకు ఈ నియమం వర్తించదు. మిగిలిన సినిమాలు ఈ నిబంధన పాటించాల్సిందే! మల్టీప్లెక్స్‌ల యాజమాన్యాలతో జరిపిన చర్చలు ఫలప్రదం అయ్యాయి. సినిమా టికెట్‌ ధరలు, అలాగే ఆహార ఉత్పత్తుల ధరలు తగ్గించాలని కోరగా తమ సమ్మతిని తెలిపారు. సింగిల్‌ స్ర్కీన్‌ థియేటర్ల సమస్యలపై  చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే పరిష్కారం దొరుకుతుంది. అలాగే వీపిఎఫ్‌ చార్జీలకు సంబంధించిన అంశంపై ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి. నిర్మాణ ఖర్చులు వృధాపై మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌తో, చాంబర్‌తో ఒప్పందం కుదిరింది. దర్శకులు ఇతర విభాగాలతో కూడా చర్చలు జరుగుతున్నాయి. ఇంకో నాలుగు రోజులపాటు వరసగా మీటింగ్లు కొనసాగుతాయి. వీలైనంత త్వరగా ఈ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఫెడరేషన్‌తో ఇంకా రెండు మీటింగులున్నాయి. కార్మికులకు జీతాలు పెంచడానికి ఇబ్బంది లేదు. కానీ వర్కింగ్‌ కండీషన్స్‌ విషయంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. రెండ్రోజుల్లో ఏదో సినిమా షూటింగ్‌ మొదలవుతోంది అంటూ వచ్చిన వార్తలో నిజం లేదు. ఈరోజు హిందీ ఇండస్ర్టీ, దక్షిణాది చిత్ర పరిశ్రమల వైపు చూస్తున్నాయి. మనం తీసుకునే నిర్ణయాలను అధ్యయనం చేసి తమ పరిశ్రమలో అన్వయించుకోవాలనుకుంటున్నాయి. షూటింగ్‌లు ఎప్పుడు ప్రారంభించాలి అన్న నిర్ణయం ఇంకా తీసుకోలేదు. అన్ని సమస్యలకు పరిష్కారం దొరికాక వివరాలు మీడియాకు వెల్లడిస్తాం’’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో సి.కల్యాణ్‌, దామోదర ప్రసాద్‌ తదతరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-08-19T00:16:21+05:30 IST