పెళ్లి కోసం మతం మార్చుకున్న ధర్మేంద్ర

ABN , First Publish Date - 2022-12-10T06:20:11+05:30 IST

ఆ రోజుల్లో అంటే 70ల దశకంలో ‘డ్రీమ్‌గర్ల్‌’ హేమమాలిని అంటే కుర్రకారులో ఎంతో క్రేజ్‌.

పెళ్లి కోసం మతం మార్చుకున్న ధర్మేంద్ర

ఆ రోజుల్లో అంటే 70ల దశకంలో ‘డ్రీమ్‌గర్ల్‌’ హేమమాలిని అంటే కుర్రకారులో ఎంతో క్రేజ్‌. తెరపై ఆమెను చూస్తూ ఊహల్లో తేలిపోయిన ప్రేక్షకులు ఎందరో! సాధారణ ప్రేక్షకులే కాదు బాలీవుడ్‌ హీరోలు సైతం ఆమెతో నటించడానికి తహతహలాడేవారు. ఆమెతో పరిచయం పెంచుకుని ముగ్గులోకి దింపుదామని ప్రయత్నించిన హీరోలూ ఉన్నారు. అయితే ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతూ, హెల్దీ రిలేషన్స్‌ మెయింటైన్‌ చేసేవారు హేమమాలిని. ఎంతో స్ట్రిక్ట్‌గా ఉండే వ్యక్తి అప్పటికే పెళ్లయి, పిల్లలు ఉన్న ధర్మేంద్రకు ఎలా పడిపోయిందా అని ఆ రోజుల్లో చాలా మందికి ఆశ్చర్యం కలిగించిన అంశం. ధర్మేంద్ర, హేమమాలిని ‘తుమ్‌ హసీన్‌.. మే జవాన్‌’ (1970) చిత్రం షూటింగ్‌లో తొలిసారిగా కలిశారు. ఆ చిత్రంలో ప్రేమికులుగా నటించిన వాళ్లిద్దరూ నిజంగానే ప్రేమలో పడ్డారు. తొలి చూపులోనే ధర్మేంద్ర హేమమాలినిని ఆకర్షించారు. ‘ఇతను నా వాడు. ఇక ఇతనితోనే నా జీవితం’ అని ఆ సమయంలో హేమకు అనిపించిందట! అప్పటికే ధర్మేంద్రకు ప్రకాశ్‌ కౌర్‌తో వివాహం అయింది. ఇద్దరు ఆడపిల్లలు, ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. అయినా అవేమీ హేమమాలిని పట్టించుకోలేదు. అయితే ఆమె తల్లి మాత్రం వీరి ప్రేమకు, పెళ్లికి గట్టి అభ్యంతరం తెలిపారు. అందుకే ప్రేమించుకోవడం మొదలుపెట్టిన ఐదేళ్లకు కానీ వీరిద్దరూ పెళ్లి చేసుకోలేక పోయారు. 1980లో వీళ్ల పెళ్లి జరిగింది. భార్య ఉండగా మరో పెళ్లి చేసుకోవడానికి హిందూ సంప్రదాయం అనుమతించదు. అందుకే ఎవరికీ తెలియకుండా ధర్మేంద్ర ఇస్లాం మతంలోకి మరారు. ఆ మత సంప్రదాయం ప్రకారం ఎవరు ఎన్ని పెళ్లిళ్లయినా చేసుకోవచ్చు. అందుకే హేమమాలినిని పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత హేమమాలిని కోరిక మీద అయ్యంగార్‌ సంప్రదాయం ప్రకారం మళ్లీ పెళ్లి చేసుకున్నారు. అప్పటినుంచీ ఎంతో అన్యోన్యంగా ఉంటూ, ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు ధర్మేంద్ర, హేమమాలిని. ఇటీవల ధర్మేంద్ర 87వ పుట్టిన రోజును హేమమాలిని ఎంతో ఘనంగా నిర్వహించారు. ఆ ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ, భావోద్వేగంతో పోస్ట్‌ పెట్టారు హేమమాలిని. 

Updated Date - 2022-12-10T06:20:11+05:30 IST