Dada Saheb Phalke Award: బాలీవుడ్ సీనియర్ నటి ఆశా పరేఖ్‌కి సినీ అత్యున్నత పురస్కారం

ABN , First Publish Date - 2022-09-27T21:12:06+05:30 IST

బాలీవుడ్ వెటరన్ నటి ఆశా పరేఖ్ అత్యున్నత సినీ అవార్డుని అందుకోనున్నారు. భారత సిని పరిశ్రమకి ఆమె చేసిన సేవలకి 2020కిగానూ కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డుని ఆ నటికి ప్రకటించింది...

Dada Saheb Phalke Award: బాలీవుడ్ సీనియర్ నటి ఆశా పరేఖ్‌కి సినీ అత్యున్నత పురస్కారం

బాలీవుడ్ వెటరన్ నటి ఆశా పరేఖ్ అత్యున్నత సినీ అవార్డు దాదా సాహెబ్ ఫాల్కేని అందుకోనున్నారు. భారత సిని పరిశ్రమకి ఆమె చేసిన సేవలకి 2020కిగానూ కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డుని ఆ నటికి ప్రకటించింది. దీనికి ముందు అంటే 2019కిగాను సూపర్‌స్టార్ రజనీకాంత్ ఈ అవార్డుని అందుకున్నారు. అనంతరం కోవిడ్-19 కారణంగా ఈ అవార్డులను ఇవ్వలేదు.


అయితే.. బాలనటిగా సినీరంగానికి ఎంట్రీ ఇచ్చిన ఆశా పరేఖ్ తనకంటూ ఓ గుర్తింపు సాధించుకున్నారు. 1950-60 మధ్య టాప్ నటీమణుల్లో ఒకరిగా ఉన్నారు. తీస్రీ మంజిల్, కటి పతంగ్, ప్యార్ కా మౌసమ్, దో బదన్, చిరాగ్ వంటి చిత్రాలతో నటిగా గుర్తింపు పొందారు. కథానాయికగా దేవ్ ఆనంద్, షమ్మీ కపూర్, రాజేష్ ఖన్నా వంటి నటులతో తెరను పంచుకున్నారు. అంతేకాకుండా.. మాతృభాష అయిన గుజరాతీతోపాటు పంజాబీ, కన్నడ చిత్రాలలో కూడా నటించింది. అనంతరం 1992లో ఈ నటిని భారత ప్రభుత్వం పద్మ శ్రీతో సత్కరించింది. కాగా.. 79 ఏళ్ల ఈ నటి పెళ్లి చేసుకోకుండా అవివాహితగానే మిగిలిపోయింది.


ఈ అవార్డు ప్రకటించిన తర్వాత కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ.. ‘ఆశా పరేఖ్‌కి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుని ఇవ్వడం సంతోషంగా ఉంది. ఆమె దాదాపు 95 చిత్రాల్లో నటించి గుర్తింపు పొందారు. 1998-2001 మధ్య సీబీఎఫ్‌సీ ఛైర్‌పర్సన్‌గా ఉన్నారు. ఈ అవార్డును సెప్టెంబర్ 30న జరిగే జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుకలో అందజేస్తాం’ అని చెప్పుకొచ్చారు. ఉదిత్ నారాయణ్, హేమా మాలిని, ఆశా భోంస్లే, పూనమ్ ధిల్లాన్, టీఎస్ నాగభరణతో కూడిన ఐదుగురు సభ్యుల జ్యూరీ ఆశా పరేఖ్‌ పేరుకి ఈ అవార్డుని ఇవ్వాలని నిర్ణయించింది.

Updated Date - 2022-09-27T21:12:06+05:30 IST