అవార్డులు వద్దని నాన్న ఎప్పుడూ అనలేదు

ABN , First Publish Date - 2021-11-14T07:58:51+05:30 IST

తన తండ్రి, ప్రముఖ నేపథ్యగాయకుడు డాక్టర్‌ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎప్పుడూ అవార్డులు వద్దని అనలేదని ఆయన తనయుడు ఎస్పీ చరణ్‌ స్పష్టంచేశారు. అయితే, దురదృష్టవశాత్తు దేశ అత్యున్నత పౌరపురస్కారాలు అందుకోకముందే...

అవార్డులు వద్దని నాన్న ఎప్పుడూ అనలేదు

తన తండ్రి, ప్రముఖ నేపథ్యగాయకుడు డాక్టర్‌ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎప్పుడూ అవార్డులు వద్దని అనలేదని ఆయన తనయుడు  ఎస్పీ చరణ్‌  స్పష్టంచేశారు. అయితే, దురదృష్టవశాత్తు దేశ అత్యున్నత పౌరపురస్కారాలు అందుకోకముందే ఆయన తిరిగిరాని లోకాలకు చేరుకోవడం తమ కుటుంబ సభ్యులే కాదు ఆయన అభిమానులూ  జీర్ణించుకోలేని విషయమని ఓ తమిళ పత్రికతో మాట్లాడుతూ చరణ్‌ చెప్పారు.  తన తండ్రి ‘శంకరాభరణం’ చిత్రానికి తొలి జాతీయ అవార్డును అందుకున్న నాటి నుంచి ఇపుడు పద్మ విభూషణ్‌ పురస్కారం వరకు ప్రభుత్వం ఇచ్చిన అవార్డులన్నీ స్వీకరించారని, ఆయన ఎప్పుడూ అవార్డులు వద్దని చెప్పలేదని ఆయన  పేర్కొన్నారు. తన తండ్రి సంగీతానికి  చేసిన సేవ, సాధించిన రికార్డులను గొప్పగా భావించేవారన్నారు. దేశంలోనే అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన పద్మవిభూషణ్‌ రావడం కంటే మరో గౌరవం ఏముంటుందని ప్రశ్నించారు. తన తండ్రి రికార్డులను చూసి తమ కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు ఎలా  గర్వపడుతున్నారో, ఆయన్ని  కోల్పోవడంతో అంతే దురదృష్టంగా భావిస్తున్నారని  చరణ్‌ చెప్పారు. 2021 సంవత్సరానికిగాను కేంద్ర ప్రభుత్వం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు ‘పద్మ విభూషణ్‌’ అవార్డును ప్రకటించగా, ఇటీవల ఎస్పీ చరణ్‌ అందుకున్న విషయం తెలిసిందే.  

ఆంధ్రజ్యోతి చెన్నై 


Updated Date - 2021-11-14T07:58:51+05:30 IST