అది ‘యమగోల’ కాదు.. ‘యమా గోల్‌’

ABN , First Publish Date - 2022-04-21T18:19:07+05:30 IST

ప్రముఖ తెలుగు సీనియర్‌ దర్శకుడు తాతినేని రామారావు (84) మృతితో దుఃఖసాగరంలో మునిగిన చలనచిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేసింది. తాతినేని ఒక్క

అది ‘యమగోల’ కాదు.. ‘యమా గోల్‌’

- తాతినేనిని శ్లాఘించిన సినీ పరిశ్రమ

- చెన్నైలో ముగిసిన అంత్యక్రియలు


అడయార్‌(చెన్నై): ప్రముఖ తెలుగు సీనియర్‌ దర్శకుడు తాతినేని రామారావు (84) మృతితో దుఃఖసాగరంలో మునిగిన చలనచిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేసింది. తాతినేని ఒక్క టాలీవుడ్‌కే పరిమితం కాకుండా బాలీవుడ్‌లోనూ సత్తా చాటిన దర్శకుడు. ముఖ్యంగా రెండు తరాలకు చెందిన నటులకు దర్శకత్వం చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది. అలాగే, రెండు తరాలకు చెందిన టెక్నీషియన్లతో పనిచేసిన అనుభవం తాతినేని రామారావు సొంతం. తమిళంలో సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, కమల్‌ హాసన్‌, తెలుగులో ఏఎన్నార్‌, ఎన్టీఆర్‌, కృష్ణ, శోభన్‌బాబు, హిందీలో అమితాబ్‌, ధర్మేంద్ర, గోవింద, జితేంద్ర నటించిన చిత్రాలకు దర్శకత్వం వహించిన ఘనత ఒక్క తాతినేనికే దక్కింది. తెలుగులో ‘యమగోల’ చిత్రంతో రికార్డులు మొదలుపెట్టిన ఆయన.. బాలీవుడ్‌లో రికార్డులన్నింటినీ తిరగరాశారు. నిజానికి ఆయన తొలి సూపర్‌డూపర్‌ హిట్‌ చిత్రం ‘యమగోల’ అయినా అది ఆయన ‘యమా గోల్‌’ అన్నది ఆయన అభిమానుల అభిప్రాయం. మంగళవారం అర్ధరాత్రి దాటాక నగరంలోని శ్రీరామచంద్రా మెడికల్‌ కళాశాల ఆస్పత్రిలో కన్ను మూసిన ఆయన భౌతికకాయానికి బుధవారం సాయంత్రం టి.నగర్‌లోని కన్నమ్మపేట శ్మశానవాటికలో అంత్యక్రియలు జరిగాయి. 

ఈ సందర్భంగా దక్షిణభారత ఫిలింఛాంబర్‌ అధ్యక్షుడు కాట్రగడ్డ ప్రసాద్‌, ఫైట్‌ మాస్టర్‌ విజయన్‌, నిర్మాత ఆర్‌బీ చౌదరి తదితరులు టి.నగర్‌లోని రామారావు స్వగృహంలో ఆయన భౌతికకాయానికి పుష్పమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రముఖుల అభిప్రాయాలు వారి మాటల్లోనే..


తనయుడిగా గర్విస్తున్నా: తాతినేని అజయ్‌ 

ఈ రోజు నాన్న మాతో లేకపోయినప్పటికీ ఆయన కుమారుడిగా గర్విస్తున్నా. ఆయన మృతికి బాలీవుడ్‌, టాలీవుడ్‌, కోలీవుడ్‌ సినీ ప్రముఖులు తమ సంతాపాలను తెలిపారు. దక్షిణాది నుంచి బాలీవుడ్‌లో అడుగుపెట్టి విజయపతాకం ఎగురవేశారు. ఇది ఎంతో గొప్పగా, గర్వంగా వుంది. ఆయన బిడ్డగా ఆయన పేరును నిలబెడతా. బాలీవుడ్‌ ప్రముఖులు జితేంద్ర, ధర్మేంద్ర, మిథున్‌, అనుపమ్‌ ఖేర్‌, నటి రేఖ, రజనీకాంత్‌, విక్రమ్‌, బాలకృష్ణ, మోహన్‌బాబు, ఎస్‌.ఏ.చంద్రశేఖర్‌, భానుప్రియ వంటివారు ఫోన్లు చేసి, వాట్సాప్‌ ద్వారా సంతాప సందేశాలు పంపారు. 

రజనీకాంత్‌ను బాలీవుడ్‌కు తొలిసారి పరిచయం చేసింది కూడా మా నాన్నే. దర్శకత్వం నుంచి తప్పుకున్న తర్వాత తమిళంలో విజయ్‌, విక్రమ్‌, విశాల్‌ వంటి హీరోలతో సినిమాలను నిర్మించారు. ఒక చిత్ర దర్శకుడిగానే కాకుండా, ఇంజనీరింగ్‌ విభాగంలో కూడా రాణించారు. మద్రాస్‌ హైడ్రాలిక్‌ హోస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ స్థాపించి 350 మందికి వరకు ఉపాధి కల్పించిన గొప్ప విజన్‌ నాన్నది. 


నిర్మాతల దర్శకుడు: కాట్రగడ్డ ప్రసాద్‌

నిర్మాతల దర్శకుడిగా తాతినేని రామారావు పరిశ్రమలో గుర్తింపు పొందారు. తాతినేని మృతి భారతీయ చిత్రపరిశ్రమకే తీరని లోటు. అనుకున్న బడ్జెట్‌లో చిత్రాలను తెరకెక్కించి, నిర్మాతలకు అనుకూలమైన దర్శకుడిగా గుర్తింపు పొందారు. ఎంత పెద్ద హీరో అయినప్పటికీ కేవలం 30 నుంచి 35 రోజుల్లో సినిమా తెరకెక్కించేవారు. ఆయన మృతి తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని నష్టం. తాతినేనితో ప్రయాణం ఎంతో సాఫీగా సాగింది. 


నిరంతర శ్రమజీవి: ఫైట్‌ మాస్టర్‌ విజయన్‌

నిరంతర శ్రమజీవి తాతినేని రామారావు. ఒక సినిమా ప్రారంభిస్తే అదే పనిపై మనస్సు లగ్నం చేసేవారు. అందుకే భారతీయ చిత్రపరిశ్రమలో చెరగని ముద్ర వేశారు. ఇలాంటి హార్డ్‌వర్కింగ్‌ దర్శకులు వల్లే నాలాంటి కళాకారులకు మంచిపేరు వచ్చింది. ఎన్టీర్‌ వంటి మహానటుడిని డైరెక్ట్‌ చేయడం సామాన్య విషయం కాదు. 


కృష్ణాజిల్లా నుంచి వచ్చి.. 

కృష్ణా జిల్లా కపిలేశ్వరపురంలో 1938 నవంబరు 10న అజయ్‌ కుమార్‌, సలీన దంపతులకు జన్మించిన తాతినేని రామారావు 1966 నుంచి 2000 వరకు తెలుగు, తమిళం, హిందీ భాషల్లో దాదాపు 70కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఇందులో 40కిపైగా హిందీ చిత్రాలే ఉండటం గమనా ర్హం. సినీ దర్శకుడిగా స్థిరపడిన తన సమీప బంధువు టి.ప్రకాష్‌ రావుతో పాటు మరో దర్శకుడు కె. ప్రత్యగాత్మల వద్ద 1950లో అసిస్టెంట్‌ డైరెక్టరుగా పనిచేశాక, ‘నవరాత్రి’ అనే చిత్రం ద్వారా దర్శకుడుగా మారారు. తమిళంలో శివాజీ గణేశన్‌, సావిత్రి నటించిన మంచి విజయాన్ని అందుకున్న ఈ చిత్రాన్ని తెలుగులో అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రిలతో రూపొందించారు. ఆ తర్వాత 1977లో ఎన్టీఆర్‌-జయప్రద జంటగా ‘యమగోల’ తెరకెక్కించారు. ఇది విజయఢంకా మోగించింది. దీంతో ఈయన పేరు ‘యమగోల’ రామారావుగా స్థిరపడిపోయింది. 1979లో తొలిసారి బాలీవుడ్‌లోకి అడుగుపెట్టి అప్పటి నుంచి ఆయన వెనుదిరిగి చూసుకోవల్సిన అవసరం లేకపోయింది. 





Updated Date - 2022-04-21T18:19:07+05:30 IST