దివికేగిన ప్రముఖ దర్శకుడు

ABN , First Publish Date - 2022-01-04T15:20:48+05:30 IST

‘ఆంధ్రకేసరి’ టంగుటూరి ప్రకాశం పంతులు, ‘అమరజీవి’ పొట్టి శ్రీరాములు వంటి త్యాగశీలుల్ని ప్రత్యక్షంగా వీక్షించడమంటే మాటలా?.. అలాంటి మహానుభావుల్ని చూసిన అరుదైన వ్యక్తుల్లో ప్రముఖ సినీ దర్శకుడు పందిళ్లపల్లి

దివికేగిన ప్రముఖ దర్శకుడు

                 - ‘అమరజీవి’, ‘ఆంధ్రకేసరి’లను చూసిన పీసీ రెడ్డి


చెన్నై: ‘ఆంధ్రకేసరి’ టంగుటూరి ప్రకాశం పంతులు, ‘అమరజీవి’ పొట్టి శ్రీరాములు వంటి త్యాగశీలుల్ని ప్రత్యక్షంగా వీక్షించడమంటే మాటలా?.. అలాంటి మహానుభావుల్ని చూసిన అరుదైన వ్యక్తుల్లో ప్రముఖ సినీ దర్శకుడు పందిళ్లపల్లి చంద్రశేఖర్‌రెడ్డి (పీసీ రెడ్డి) ఒకరు. తెలుగు పరిశ్రమ తరలిపోయినా, వెండి వెలుగులు భాగ్యనగరికి మరలిపోయినా చెన్నైని వీడలేక ఇక్కడే ఉండిపోయిన వ్యక్తి పీసీ రెడ్డి. ఏడు దశాబ్దాలకు పైగా నగరంలో నివశించిన ఆయన.. చెన్నైని అభివృద్ధి నుంచి అధునాతనం వరకూ గమనించిన వ్యక్తి. సోమవారం ఉదయం స్థానిక వల్లువర్‌కోట్టం సమీపంలోని ప్రకాశం వీధిలో వున్న తన స్వగృహంలో కన్నుమూసిన పీసీ రెడ్డి భౌతికకాయానికి సాయంత్రం కొరట్టూరులోని శ్మశాన వాటికలో అంత్యక్రియలు ముగిశాయి. 


ఈ సందర్భంగా ఆయన స్మృతులు కొన్ని..

నెల్లూరు జిల్లా ఆత్మకూరు తాలూకాలోని అనుమ సముద్రం (ఏఎస్‌ పేట) ఆయన స్వస్థలం. సుబ్బమ్మ, నారపరెడ్డి దంపతుల పదిమంది సంతానంలో పీసీ రెడ్డి 8వ వారు. తండ్రి ఏఎస్‌ పేటకు మునసబుగా పని చేస్తూ స్వాతంత్ర్యానికి పూర్వమే కన్ను మూయగా, తన అన్న బియ్యం వ్యాపారం కారణంగా చిన్నతనంలోనే చెన్నై వచ్చిన పీసీ రెడ్డి.. 9వ తరగతి నుంచి ఎంఏ వరకు ఇక్కడే విద్యాభ్యాసం చేశారు. 9వ తరగతి కోసం చైనా బజారులో వున్న పచ్చయప్పా స్కూల్లో చేరారు. పీసీ రెడ్డి కుటుంబం ఆచారప్పన్‌ స్ట్రీట్‌లో ఉండేది. పచ్చయప్పా స్కూల్లోనే ఫోర్త్‌ ఫారం నుంచి ఎస్‌ఎల్‌సీ వరకూ చదివారు. పచ్చయప్పాస్‌ కాలేజీలో ఇంటర్మీడియేట్‌ చదివి, అదే కాలేజీలో బీఏ, ఎంఏ చేశారు.


‘ఆంధ్రకేసరి’ కోసం ప్రచారం

దేశానికి స్వాతంత్య్రం వచ్చేనాటికి ఆయన పచ్చయప్పా స్కూల్లో వున్నారు. స్వాతంత్య్రం వచ్చిన మరునాడు స్కూల్లో తోటి విద్యార్థులతో కలిసి పీసీ రెడ్డి సంబరం చేసుకున్నారు. తరువాత టంగుటూరి ప్రకాశం పంతులు హార్బర్‌ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అప్పుడు ఆయన పదిపదిహేను రోజులు స్కూలు ఎగ్గొట్టి ప్రచారం చేశారు. ‘‘ప్రకాశం పంతులుగారు చాలా గొప్ప వ్యక్తి. ఇంగ్లాండ్‌లో ఉద్యోగం వచ్చినా కాదనుకుని దేశం కోసం ఇక్కడికి వచ్చారు. బ్రిటీషోళ్లకి ఎదురొడ్డి నిలబడ్డారు. అలాంటి వ్యక్తి మన నియోజకవర్గంలో పోటీ చేయడం మన అదృష్టం. ఆయనకు మన మంతా అండగా నిలబడాల్సిన అవసరముంది. మీరంతా ప్రచారం చేయండ్రా’’ అని ఓ మాస్టారు చెప్పిన మాటల తో ఉత్తేజితుడైన పీసీ రెడ్డి జెండా పట్టుకుని ప్రకాశం పంతుల కోసం వాడవాడలా ప్రచారం చేశారు. 


బ్రాడ్వే శ్మశానంలో పొట్టి శ్రీరాములు అంత్యక్రియలు...

1952 ఏడాది చివర్లో మైలాపూర్‌లో పొట్టి శ్రీరాములు నిరాహారదీక్ష గురించి తెలిసి, స్నేహితులతో కలిసి వెళ్లి చూశారు పీసీ రెడ్డి. అమరజీవి డిసెంబర్‌ 15వ తేదీన కన్నుమూశారు. ఆయన తెలుగువాడైనా ఆ రోజు అందరూ స్వచ్ఛందంగా దుకాణాలు మూసేసి బంద్‌ పాటించారు. పొట్టి శ్రీరాములు అంత్యక్రియలు బ్రాడ్వేలోని శ్మశానంలోనే జరిగాయి. ఆ సందర్భంగా మైలాపూర్‌ నుంచి బ్రాడ్వే వరకు జరిగిన ర్యాలీలో పీసీ రెడ్డి కూడా పాల్గొన్నాను. 


 పరిశీలనే ఆయన్ని దర్శకుడిని చేసింది..

మొదటి నుంచీ ఆయనకు ప్రతి విషయాన్ని పరిశీలించే గుణం వుంది. బహుశా అదే ఆయన్ని డైరెక్టర్ని చేసింది. ఆయన మద్రాసుకి వచ్చిన కొత్తలో ట్రామ్‌లు ఉండేవి. ఒకే టిక్కెట్‌తో నగరమంతా తిరిగే అవకాశముండడంతో స్నేహితులతో కలిసి పీసీ రెడ్డి ఊరంతా తిరిగేవారు. అలా తిరిగేటప్పుడు నగరాన్ని, ఇక్కడి మనుషుల్ని నిశితంగా గమనించేవారు. ఆ పరిశీలనే ఆయన్ను తరువాతికాలంలో డైరెక్టర్ని చేసింది. 


భారతమాతకు జేజేలు పాట ఆయన సినిమాలోదే..

స్వాతంత్య్రదినోత్సవం, గణతంత్ర దినోత్సవం వంటివి వచ్చాయంటే చాలు.. మనకు నిత్యం వినిపించే పాట ‘భారత మాతకు జేజేలు...’ ఆ పాట పీసీ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ‘బడిపంతులు’ చిత్రంలోదే. 

పీసీ రెడ్డి మృతి వార్త తెలియగానే సీనియర్‌ నిర్మాత, దక్షిణ భారత చలనచిత్ర మండలి అధ్యక్షుడు కాట్రగడ్డ ప్రసాద్‌, తమిళనాడు చలనచిత్ర దర్శకుల సంఘం అధ్యక్షుడు ఆర్‌.వి.ఉదయకుమార్‌, యువ హీరో వైభవ్‌, నిర్మాత రామ్‌ ప్రముఖ్‌ రెడ్డి, సీనియర్‌ నిర్మాత శాఖమూరి మల్లిఖార్జున రెడ్డి తదితరులు వెళ్లి ఆయన భౌతికకాయానికి అంజలి ఘటించారు.

Updated Date - 2022-01-04T15:20:48+05:30 IST