మా చిత్రం విడుదలకు సాయం చేయండి

ABN , First Publish Date - 2022-03-19T16:11:37+05:30 IST

తాము తెరకెక్కించిన ‘కల్లన్‌’ చిత్రాన్ని దక్షిణ తమిళనాడులో ప్రదర్శించకుండా ఓ వర్గం వారు ఆటంకాలు కలిగిస్తున్నారని ఈ విషయంలో సీఎం స్టాలిన్‌ జోక్యం

మా చిత్రం విడుదలకు సాయం చేయండి

                     - ‘కల్లన్‌’ దర్శకనిర్మాతల వినతి 


అడయార్‌(చెన్నై): తాము తెరకెక్కించిన ‘కల్లన్‌’ చిత్రాన్ని దక్షిణ తమిళనాడులో ప్రదర్శించకుండా ఓ వర్గం వారు ఆటంకాలు కలిగిస్తున్నారని ఈ విషయంలో సీఎం స్టాలిన్‌ జోక్యం చేసుకుని చిత్ర ప్రదర్శన అడ్డుకునే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ చిత్ర దర్శకురాలు చంద్ర తంగరాజ్‌, నిర్మాత మదియళగన్‌ విజ్ఞప్తి చేశారు. కల్లన్‌ చిత్రం శుక్రవారం విడుదలవ్వగా, ఇది ఓ వర్గాన్ని కించపరిచేలా ఉందంటూ దక్షిణ తమిళనాడులోని మదురై, తేని వంటి జిల్లాల్లో చిత్ర ప్రదర్శనను అడ్డుకున్నారని వారు వెల్లడించారు. ఈ చిత్రంలో ఏ ఒక్క వర్గాన్ని కించపరిచేలా సన్నివేశాలు, డైలాగులు లేవన్నారు. హైకోర్టు న్యాయమూర్తులు, సెన్సార్‌ బోర్డు సభ్యులతో పాటు మీడియాకు కూడా విడుదలకు ముందే చిత్రాన్ని చూపించామన్నారు. వీరిలో ఏ ఒక్కరూ ఒక్క అభ్యంతరం లేవనెత్తలేదన్నారు. కానీ, ‘కల్లన్‌’ అనే వర్గం వారు మాత్రమే చిత్రం టైటిల్‌ను మార్చాలని డిమాండ్‌ చేస్తున్నారన్నారు. ప్రభుత్వం కూడా తక్షణం జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని వారు ప్రాధేయపడ్డారు. 

Updated Date - 2022-03-19T16:11:37+05:30 IST