జీవితాన్ని పరిపూర్ణంగా ఆస్వాదిస్తున్నా

ABN , First Publish Date - 2022-05-15T17:35:10+05:30 IST

వెండితెరపై దశాబ్దాల పాటు తన అద్భుతమైన నటనతో వెలుగొంది అసంఖ్యాక అభిమానులను సాంపాదించుకున్న ప్రఖ్యాత నటి రమాప్రభ కొద్దికాలంగా సినిమా రంగానికి కా

జీవితాన్ని పరిపూర్ణంగా ఆస్వాదిస్తున్నా

- శబరి లాంటి పాత్రలు వస్తే అంగీకరిస్తా 

- ప్రముఖ నటి రమాప్రభ


బెంగళూరు: వెండితెరపై దశాబ్దాల పాటు తన అద్భుతమైన నటనతో వెలుగొంది అసంఖ్యాక అభిమానులను సాంపాదించుకున్న ప్రఖ్యాత నటి రమాప్రభ కొద్దికాలంగా సినిమా రంగానికి కాస్త దూరంగా ఉంటున్నారు. తెలుగుతో పాటు తమిళ, తెలుగు భాషల్లో 1800 కు పైగా సినిమాల్లోనూ, 30కు పైగా బుల్లితెర సీరియల్స్‌లోనూ నటించిన రమాప్రభ ఇప్పుడు తాను ఎంతో సంతోషంగా ఉన్నానని పరిపూర్ణ జీవితాన్ని ఆస్వాదిస్తున్నానని చెప్పారు. ఏడు పదుల వయస్సులోనూ ఎంతో చలాకీగా నవ్వుతూ నవ్విస్తున్న రమాప్రభను చూసిన వారు సైతం ఎంతో ముగ్ధులవుతున్నారు. తాను నటించిన సినిమాల చిత్రీకరణ జరిగిన ప్రదేశాలను తిలకించేందుకు ఆమె శనివారం బెంగళూరుకు వచ్చారు. ఈ సందర్భంగా కొద్దిసేపు మీడియాతో మాట్లాడారు. తెలుగులో చిలుకా గోరింక తన తొలి చిత్రమన్నారు. తెలుగు సినిమాలలో తనకు దొరికినన్ని పాత్రలు మరే నటికీ లభించి ఉండవన్నారు. సినీజీవితంలో  తాను ఎంతో సంతృప్తిచెందానన్నారు. దర్శకుడు పూరి జగన్నాధ్‌కు తాను ఎంతగానో రుణపడి ఉన్నానని, ఆయన కోరితే మాత్రమే సినిమాల్లో నటిస్తానన్నారు. శబరి లాంటి పాత్రలు వస్తే చేసేందుకు సిద్ధమని రమాప్రభ ప్రకటించారు. సినిమాలలో ఇప్పుడు ఎందుకు నటించడం లేదని ప్రశ్నించగా ఇప్పుడు తాను సినిమాల్లో నటిస్తే పాత తరాన్ని అవమానించినట్లేనని భావిస్తున్నట్లు చెప్పారు. వండర్‌బాయ్‌ అనే సీరియల్‌ ద్వారా బుల్లితెరపైకి వచ్చాన ని, తాను నటించిన చక్రవాకం బాగా ప్రేక్షకాదరణ పొందిందన్నారు. తన బయోపిక్‌ తీసేందుకు కొందరు ఆసక్తితో ఉన్నారని దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. గతంలో ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా సినిమాలు వచ్చేవని సమాజానికి గొప్పసందేశం ఇచ్చే చిత్రాలు కూడా ఉండేవని ఇప్పుడు ఇలాంటి చిత్రాలు బాగా తగ్గాయని ఒకింత ఆవేదన వ్యక్తం చేశారు. 



Updated Date - 2022-05-15T17:35:10+05:30 IST