సినిమా రివ్యూ : ‘చోర్‌ బజార్’ (Chor Bazar)

ABN , First Publish Date - 2022-06-24T19:21:15+05:30 IST

పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్.. గతేడాది ‘రొమాంటిక్’ చిత్రంతో ప్రేక్షకుల్ని మెప్పించాడు. ‘చోర్ బజార్’ అనే లవ్ అండ్ యాక్షన్ మూవీతో ఈ రోజే (జూన్ 24) థియేటర్స్ లోకి వచ్చాడు. ‘జార్జ్ రెడ్డి’ చిత్రంతో దర్శకుడిగా సత్తా చాటిన జీవన్ రెడ్డి.. ఈ సినిమాను తనదైన శైలిలో తెరకెక్కించాడు.

సినిమా రివ్యూ : ‘చోర్‌ బజార్’ (Chor Bazar)

చిత్రం : ‘చోర్ బజార్’ 

విడుదల తేదీ : జూన్ 24, 2022

నటీనటులు : ఆకాశ్ పూరి, గెహనా సిప్పి, సునీల్, అర్చన, ప్రవీణ్, సుబ్బరాజు, జబర్దస్త్ నవీన్, సంపూర్ణేష్ బాబు తదితరులు

సంగీతం : సురేశ్ బొబ్బిలి

నిర్మాణం : ఐవి ప్రొడక్షన్స్

దర్శకత్వం : జీవన్ రెడ్డి

పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్.. గతేడాది ‘రొమాంటిక్’ చిత్రంతో ప్రేక్షకుల్ని మెప్పించాడు. ‘చోర్ బజార్’ అనే లవ్ అండ్ యాక్షన్ మూవీతో ఈ రోజే (జూన్ 24) థియేటర్స్ లోకి వచ్చాడు. ‘జార్జ్ రెడ్డి’ చిత్రంతో దర్శకుడిగా సత్తా చాటిన జీవన్ రెడ్డి.. ఈ సినిమాను తనదైన శైలిలో తెరకెక్కించాడు. మరి ఈ సినిమా ప్రేక్షకుల్ని ఏ మేరకు ఎంటర్ టైన్ చేస్తుంది? ఆకాశ్ పూరీ చోర్ గా ప్రేక్షకుల మనసుల్ని ఏ విధంగా దోచుకున్నాడు? అనే విషయాలు తెలియాలంటే..రివ్యూలోకి వెళ్ళాల్సిందే.. (Chor Bazar movie review)


కథ

హైదరాబాద్‌లో దొంగసామాన్లు అమ్మే ఏరియా చోర్ బజార్. ఆ ప్రాంతం మొత్తం బచ్చన్ సాబ్ (ఆకాశ్ పూరీ) కంట్రోల్లో ఉంటుంది. సిమ్రాన్ (గెహనా సిప్పీ) అనే మూగమ్మాయిని చిన్నప్పటి నుంచి ప్రేమిస్తాడు. సిమ్రాన్‌కి కూడా అతడంటే ఇష్టం. బచ్చన్ సాబ్ తల్లి (అర్చన)కి కూడా ఆమె అంటే ఇష్టం. బచ్చన్ సాబ్ దందా మూడు పువ్వులు ఆరుకాయలుగా సాగుతుండగా.. నగరంలోని మ్యూజియమ్ లో రూ.200 కోట్లు విలువచేసే నిజాం వజ్రం మిస్ అవుతుంది. అది ఎవరు కొట్టేశారు? బచ్చన్ సాబ్ లవ్ స్టోరీ సక్సెస్ అయిందా? చోర్ బజార్ ను మూయించాలనుకుంటున్న గబ్బర్ సాబ్ (సుబ్బరాజు) కథేంటి? ఆ వజ్రానికి, హోమ్ మినిస్టర్ కు లింకేంటి? అన్నది మిగతా కథ. (Chor Bazar movie review)


విశ్లేషణ 

రోబరీ, హైస్ట్ కథాంశాలతో గతంలో చాలా సినిమాలొచ్చాయి. ఒక విలువైన వజ్రమో, విలువైన రాయో, విగ్రహమో మ్యూజియమ్ నుంచి మిస్ అవడడం.. అది కొట్టేసిన వారి చేతుల్లోంచి ఎక్కడెక్కడికో ట్రావెల్ చేసి.. చివరికి హీరో చేతికి చిక్కడం... హీరో దాన్ని పోలీసులకు అప్పగించడం. ‘స్వామిరారా, మరకతమణి’ లాంటి చిత్రాలు అలాంటి కథాంశంతోనే ప్రేక్షకుల్ని మెప్పించాయి. ఈ నేపథ్యంలో ఇది వరకూ ఏ దర్శకుడూ టచ్ చేయని ‘చోర్ బజార్’ కాన్సెప్ట్ కు , నిజాం డైమాండ్ లింక్ పెట్టి.. దర్శకుడు జీవన్ రెడ్డి ఆసక్తికరమైన కథాకథనాలతో స్ర్కిప్ట్ రాసుకున్నాడు. దాన్ని పూర్తి స్థాయిలో కాకపోయినా.. వీలైంనత వరకూ వినోదాత్మకంగా మలిచి ప్రేక్షకుల్ని బాగానే ఎంగేజ్ చేశాడు. మ్యూజియమ్ లోని డైమండ్ దొంగతనంతో సినిమాను ఆసక్తికరంగా మొదలు పెట్టాడు. ఆ డైమండ్ విలువేంటో తెలియని వారి చేతికి చిక్కేలా.. కథకు మంచి లాక్ పెట్టి.. అది ఎవరి చేతుల్లోకి వెళుతుంది? అనే ఉత్కంఠను కలిగించాడు. ఇలాంటి క్రైమ్ కాన్సెప్ట్ ను మరీ సీరియస్ గా కాకుండా.. కామెడీ యాంగిల్ లో ఆవిష్కరించి ప్రేక్షకులకు మంచి ఎంటర్ టైన్ మెంట్ ఇవ్వడంలో కొంత మేరకు సక్సెస్ అయ్యాడు.


సినిమాలో మనకు చాలా పాత్రలు కనిపిస్తాయి. అన్ని పాత్రలతోనూ వినోదాన్ని పండించిన దర్శకుడు .. జబర్దస్త్ లాంటి కామెడీ షోస్ చేసే నవీన్ తో మాత్రం ఎమోషనల్ పాత్రను చేయించడం కొత్తగా అనిపిస్తుంది. ఆపాత్రలో నవీన్ బాగా నటించాడు. ఇంకా ఇందులో హీరోకి స్నేహితులుగా నటించిన బాల నటులు కూడా మంచి ఎంటర్ టైన్ మెంట్ అందించారు. ‘చోర్ బజార్’ నేపథ్యంలో హీరో కోర్ట్ లో పలికే డైలాగ్స్ . ఆలోచింపచేస్తాయి.  అసలు  హైదరాబాద్ లో చోర్ బజార్ లాంటిది ఒకటి ఉంటుందని అక్కడ దొంగ వస్తువులు అమ్ముతారన్న విషయం చాలా మందికి తెలియదు. ఈ సినిమాతో దాన్ని అందరికీ అర్ధమయ్యే రీతిలో చెప్పాడు దర్శకుడు. ఇంకా హీరో, హీరోయిన్స్ మధ్య లవ్ ట్రాక్ కొత్తగా అనిపిస్తుంది. మూగమ్మాయి .. టేప్ రికార్డర్ లో తన భావాన్ని హీరోకి వ్యక్త పరచడం, ఆమె డబ్ స్మాష్ వీడియోస్ ఆకట్టుకుంటాయి. 


బచ్చన్ సాబ్ గా ఆకాశ్ పూరీ .. అదరగొట్టాడు. లాంగ్వేజ్ , బాడీ లాంగ్వేజ్ పరంగా బాగా పరిణతి కనబరిచాడు.  ఎమోషనల్ సీన్స్ లోనూ, కోర్ట్ సన్నివేశాల్లో సత్తా చాటుకున్నాడు.  హీరోయిన్ గెహనా సిప్పీ స్ర్కీన్ ప్రెజెన్స్ ఆకట్టుకుంటుంది. ఆమె నటన మెప్పిస్తుంది. హీరో తల్లిగా నటించిన అర్చన తెలంగాణ స్లాంగ్ లో అదరగొట్టింది.  హోం మినిస్టర్ గా సునీల్.. తొలిసారిగా తెలంగాణ స్లాంగ్ లో డైలాగ్స్ పలికి ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరిచాడు. అయితే ఇందులో అతడు మంచివాడా, చెడ్డవాడా అనే విషయాన్ని దర్శకుడు క్లారిటీగా చెప్పలేదు. అసలు ఆ పాత్రకి ఎండింగ్ లాంటిదేమీ ఇవ్వలేదు. సురేశ్ బొబ్బిలి సంగీతం ఆకట్టుకుంటుంది. రెండు పాటలు అలరిస్తాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. మొత్తానికి క్రైమ్ థ్రిల్లర్స్ ను ఇష్టపడే ప్రేక్షకులకు చోర్ బజార్ బెటర్ ఆప్షన్. (Chor Bazar movie review) 

ట్యాగ్ లైన్ : ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ 

Updated Date - 2022-06-24T19:21:15+05:30 IST