‘కోబ్రా’ రివ్యూ: ఈ కోబ్రా బుస కొట్టదు (Cobra Review)

ABN , First Publish Date - 2022-08-31T22:10:35+05:30 IST

చియాన్ విక్రమ్ (Chiyaan Vikram) సినిమా ‘కోబ్రా’ (Cobra) మూడేళ్ళ నిరీక్షణ తరువాత థియేటర్స్‌లో విడుదలైంది. అంతకు ముందు విక్రమ్ తన కుమారుడితో కలిసి నటించిన ‘మహాన్’ (Mahaan) అనే సినిమా..

‘కోబ్రా’ రివ్యూ: ఈ కోబ్రా బుస కొట్టదు (Cobra Review)

సినిమా పేరు: ‘కోబ్రా’

విడుదల తేదీ: 31, ఆగస్ట్ 2022

నటీనటులు: విక్రమ్, శ్రీనిధి శెట్టి, రోషన్ మాథ్యూ, ఇర్ఫాన్ పఠాన్, కె ఎస్ రవికుమార్, మ్రిణాలని రవి, మియా జార్జ్ తదితరులు

విడుదల: ఎన్వీఆర్ సినిమా

సినిమాటోగ్రాఫర్: హరీష్ కన్నన్

ఎడిటింగ్: భువన్ శ్రీనివాసన్

సంగీతం: ఏ ఆర్ రహమాన్

నిర్మాత: ఎస్ ఎస్ లలిత్ కుమార్

దర్శకుడు: ఆర్. అజయ్ జ్ఞానముత్తు


-సురేష్ కవిరాయని


చియాన్ విక్రమ్ (Chiyaan Vikram) సినిమా ‘కోబ్రా’ (Cobra) మూడేళ్ళ నిరీక్షణ తరువాత థియేటర్స్‌లో విడుదలైంది. అంతకు ముందు విక్రమ్ తన కుమారుడితో కలిసి నటించిన ‘మహాన్’ (Mahaan) అనే సినిమా 5 నెలల కిందట ఓటీటీలో డైరెక్ట్‌గా విడుదలైంది. విక్రమ్ గత కొన్ని సంవత్సరాల నుండి ఒక మంచి బ్రేక్ కోసం చూస్తున్నాడు. మరి ఈ ‘కోబ్రా’.. విక్రమ్‌ వేచి చూస్తున్న హిట్ ఇచ్చిందా? లేదా.. ఆయన ఇంకా నిరీక్షించాలా? అన్నది రివ్యూలో చూద్దాం.


కథ:

మది (విక్రమ్) ఒక మ్యాథ్స్ జీనియస్. ఆయన పోలీసులకు దొరక్కుండా తెలివిగా కొంతమందిని చంపుతూ ఉంటాడు. కానీ ఇంటర్ పోల్ ఆఫీసర్‌గా చేసిన క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ (Irfan Pathan) ఒక చిన్న ఆధారంతో ఈ హత్యల వెనుక ఎవరున్నారనే విషయం మీద కూపీ లాగటానికి.. మది ఉండే చెన్నై వస్తాడు. మరో పక్క రిషి (రోషన్ మాథ్యూ Roshan Mathew) అనే వ్యాపారవేత్తని కూడా మది టార్గెట్ చేస్తాడు. అసలు మది ఎందుకు ఈ హత్యలు చేస్తున్నాడు..? అసతలను ఒక్కడేనా? లేక అతనితో ఇంకెవరైనా వుంటారా? అన్నది తెరపైన చూడాల్సిందే.


విశ్లేషణ:

దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు ( Ajay Gnanamuthu) సరైన కథను ఎంచుకోలేదు. కథ అంతా అయోమయంగా ఉంటుంది, సినిమా కూడా చివరి వరకు అలాగే నడుస్తుంది. ఇందులో విక్రమ్ రెండు పాత్రల్లో కనిపిస్తాడు. అతనికి ఇంకా ఆ ‘అపరిచితుడు’ (aparichitudu) హ్యాంగోవర్ పోలేదేమో.. ఒక పాత్రలో అప్పుడప్పుడు ఆ అపరిచితుడులా కనిపిస్తాడు. అలాగే కమల్ హాసన్ నటించిన ‘దశావతారం’ (Dasavatharam) మాదిరిగా.. విక్రమ్ కూడా ఒకే సినిమాలో ఎన్నో పాత్రల్లో కనిపించాలని అనుకున్నాడో ఏమో, వివిధ రకాల పాత్రల్లో ఈ సినిమాలో కనబడతాడు. కానీ విక్రమ్ అన్ని పాత్రలు వేయాల్సిన అవసరమైతే లేదు.., కానీ అలా కనిపించటం వల్ల ప్రేక్షకులని ఇంకాస్త అయోమయానికి గురి చేశాడు. తెలుగులో ఇలా ఒకే నటుడు రెండు పాత్రలు పోషించిన సినిమాలు ఎన్నో వచ్చాయి. అయితే  అందులో చాలా సినిమాలు కామెడీగా కూడా ఉంటాయి, స్పష్టంగా కథలో చెప్తారు కూడా. ఒకరు వెళ్ళాక రెండోవాడు రావటం, వాడిని మొదటి వాడు అనుకోవటం.. ఇలాంటివి కామెడీ కోసం పెడతారు.


కానీ ఈ కోబ్రా సినిమాలో, కామెడీ లేదు.. అలా అని ఆసక్తికరంగా కూడా లేదు, అయోమయంగా ఉంటుంది. కాసేపు మది అంటాడు, ఇంకాసేపు కదిరి అని అంటూ ఉంటాడు. ఇలా కథ మొత్తం అయోమయంగా ఉండటమే కాకుండా.. ప్రేక్షకులని కూడా కన్ఫ్యూజ్ చేస్తుంది. దానికి తోడు మది పాత్ర ఒక రకమైన భ్రమలోకి వెళ్ళిపోయి తన చుట్టూ లేని మనుషుల్ని ఉన్నట్టు ఊహించుకుంటాడు. అలా ఊహించుకున్న సన్నివేశాలు వచ్చినప్పుడల్లా ప్రేక్షకులకి చాలా కష్టం అనిపిస్తూ ఉంటుంది. దర్శకుడు మొదట్లో అనుకున్న కథ ఒకటైతే.., చివరికి తెర మీదకి వచ్చేసరికి ఇలా అయిందేమో?. సినిమా చూస్తున్నంత సేపూ.. దర్శకుడికి విక్రమ్ ఫ్రీడమ్ ఇవ్వకుండా.. తానే సొంతంగా దర్శకత్వం చేశాడా?.. అనే అనుమానం కూడా వస్తుంది. వీటన్నిటికీ తోడు, సినిమా మూడు గంటలకు పైగా ఉండటంతో, ప్రేక్షకులు ఎప్పుడు అయిపోతుందా? అని చూస్తూ వుంటారు. తెలుగు భాషలో ఈ సినిమా విడుదల చేశారు కానీ, ఎందుకో గానీ.. పెద్దగా ప్రచారం చెయ్యలేదు. అలాగే ఇందులో నటీనటుల ముఖాలు కూడా అంతగా పరిచయం లేనివి కావడం.. తెలుగు ప్రేక్షకులకి కొంచెం కష్టంగానే ఉంటుంది. డబ్బింగ్ కూడా సరిగా చేయకపోవటం వల్ల,  కొన్ని పాత్రలకి డైలాగ్స్ సరిగా సింక్ అవ్వలేదు. (Cobra Movie Review)


ఏ ఆర్ రహమాన్ (A. R. Rahman) దీనికి సంగీతాన్ని అందించారు. కానీ ఆ ప్రభావం ఎక్కడా కనిపించదు, ఈ సినిమాకి అతను ఎటువంటి ప్లస్ కూడా అవ్వరు. పాటలు పక్కన పెడితే.. కనీసం బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బాగున్నా కొంచెం బాగుండేది. అసలీ సినిమాలో ఏమి జరుగుతోందో కూడా అర్థం కాదు. క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ఇంటర్ పోల్ ఆఫీసర్‌గా కనపడతాడు. మొత్తంగా చూస్తే.. మరో డబ్బింగ్ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడినట్లే.


చివరగా... ఈ సినిమాకి వెళ్లేముందు జాగ్రత్త సుమండీ! ఒక కోబ్రా కాదు రెండు కోబ్రాలుంటాయ్, కానీ బుస ఏమి వినిపించదు. విక్రమ్ విజయం కోసం ఇంకొంత కాలం నిరీక్షించాల్సిందే! (Vikram Cobra Review)

Updated Date - 2022-08-31T22:10:35+05:30 IST