Chiranjeevi: ఏడో తరగతిలోనే ఓ అమ్మాయితో ప్రేమలో పడ్డా!

ABN , First Publish Date - 2022-08-01T18:01:45+05:30 IST

నేను ఏడో తరగతిలో ఉండగానే నాకొక ప్రేమకథ ఉంది. అదే నా మొదటి ప్రేమకథ. అప్పట్లో నేనొక అమ్మాయిని ఎంతో ఇష్టపడ్డాను. అమ్మాయిలు సైకిల్ తొక్కడాన్ని మొగల్తూరులో..

Chiranjeevi: ఏడో తరగతిలోనే ఓ అమ్మాయితో ప్రేమలో పడ్డా!

‘‘నేను ఏడో తరగతిలో ఉన్నప్పుడే నా మొదటి ప్రేమకథ మొదలైంది.. అప్పట్లో ఓ అమ్మాయిని బాగా ఇష్టపడ్డాను..’’ అని మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi) తన మొదటి ప్రేమకథ గురించి చెప్పుకొచ్చారు. ఆమిర్ ఖాన్(Aamir Khan) ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘లాల్ సింగ్ చడ్డా’ (Laal Singh Chaddha). మెగాస్టార్ చిరంజీవి ఈ చిత్రాన్ని తెలుగులో సమర్పిస్తున్నారు. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా కింగ్ నాగార్జున (King Nagarjuna).. హీరో ఆమిర్ ఖాన్, సమర్పకుడు చిరంజీవి, సినిమాలో కీలక పాత్రలో నటించిన నాగచైతన్య (Naga Chaitanya)ను ‘మెగా లాల్ చడ్డా’ (Mega Lal Chadda) పేరుతో ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఈ ఇంటర్వ్యూలో చిరంజీవిని ఆమిర్ ఖాన్ ‘ఫస్ట్ లవ్’ (First Love) గురించి చెప్పాల్సిందిగా కోరారు.


అందుకు చిరంజీవి తన ఫస్ట్ లవ్ గురించి చెబుతూ.. ‘‘నేను ఏడో తరగతిలో ఉండగానే నాకొక ప్రేమకథ ఉంది. అదే నా మొదటి ప్రేమకథ. అప్పట్లో నేనొక అమ్మాయిని ఎంతో ఇష్టపడ్డాను. అమ్మాయిలు సైకిల్ తొక్కడాన్ని మొగల్తూరులో అందరూ ఆశ్చర్యంగా చూసేవారు. నేను సైకిల్ తొక్కడానికి ఆ అమ్మాయి ఎంతో సాయం చేసేది. అలా సైకిల్ తొక్కే సమయంలో.. సైకిల్ పై కంటే కూడా ఆమెపైనే నా దృష్టి ఎక్కువగా లీనమై ఉండేది. అది ఆ అమ్మాయి గమనించి.. అటు కాదు.. ఇటు చూడు అనేది..’’ అని చిరు తన చిన్ననాటి ప్రేమకథను చెప్పుకొచ్చారు.  


ఇంకా ఈ ఇంటర్వ్యూలో.. ముగ్గురు స్టార్స్‌ని ఇంటర్వ్యూ చేయడం అద్భుతంగా ఉందని నాగ్ అంటే.. ఓ స్టార్ ముందు ఇలా మేం ముగ్గురం కూర్చోవడం మాకెంతో ఆనందంగా ఉందని చిరు బదులిచ్చారు. అనంతరం ఆమిర్ ఖాన్ చిత్రాలలో ఏ చిత్రాన్ని మీరు రీమేక్ చేయాలని అనుకుంటున్నారు? అని చిరుని నాగార్జున అడుగగా.. ‘సమస్యే లేదు.. నేను ఏ చిత్రాన్ని  చేయలేను’ అని చిరు చెప్పారు. వెంటనే ఆమిర్ కల్పించుకుని.. ‘నేను మీతో సినిమా చేయాలని అనుకుంటున్నాను.. అది డైరెక్టర్‌గా అయినా ఓకే.. నిర్మాతగా అయినా ఓకే.. ’ అని అడుగగా.. ‘టేక్ 1 ఓకే కాదు కదా..’ అని చిరు అంటే.. ప్రొడక్షన్ వరకు ఓకే కానీ.. డైరెక్షన్ మాత్రం ఒప్పుకోవద్దని’ నాగ్ చెప్పుకొచ్చారు. ఇంకా ఈ కార్యక్రమంలో ‘లాల్ సింగ్ చడ్డా’కు సంబంధించిన అనేక విషయాలను ఆమిర్ తెలుపగా.. ‘ఒక నటుడిగా.. నేను పనిచేసే నటీనటులు, సాంకేతిక నిపుణుల దగ్గర ఎంతో కొంత నేర్చుకునేందుకు ప్రయత్నిస్తుంటాను’ అని నాగచైతన్య తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. లెజండ్స్‌ని ఇలా ఒకే వేదికపై చూడటం చాలా సంతోషంగా ఉందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.



Updated Date - 2022-08-01T18:01:45+05:30 IST