Chiranjeevi: ‘గాడ్‌ఫాదర్’కి అంతా రామ్ చరణే.. థ్యాంక్యూ చరణ్!

ABN , First Publish Date - 2022-09-29T16:54:39+05:30 IST

ఆయన మామూలు దర్శకుడు కాదు. ఆయనవి అన్నీ పెద్ద కోరికలు. ఈ సినిమాలో నాకు దళపతిగా వుండే ఒక పాత్ర వుంది, ఆ పాత్ర కోసం సల్మాన్ ఖాన్ అయితే బావుంటుందని చాలా సింపుల్‌గా చెప్పారు. రాజా అంత సింపుల్‌గా చెప్పారు కానీ.. అసలు సల్మాన్ ఖాన్‌

Chiranjeevi: ‘గాడ్‌ఫాదర్’కి అంతా రామ్ చరణే.. థ్యాంక్యూ చరణ్!

‘గాడ్‌ఫాదర్’ (God Father) సినిమా ముందుండి నడిపించింది అంతా రామ్ చరణే (Ram Charan) అని అన్నారు మెగాస్టార్ చిరంజీవి. ఆయన హీరోగా.. మోహన్ రాజా (Mohan Raja) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా బుధవారం అనంతపురంలో చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను గ్రాండ్‌గా నిర్వహించారు. అయితే వరుణుడు ఈ వేడుకను అడ్డుకున్నాడు. సగం ఈవెంట్ కూడా పూర్తి కాకముందే.. జోరున వాన పడటంతో.. కార్యక్రమాన్ని చిరంజీవి స్పీచ్‌తో ముగించారు. ఇక చిరంజీవి మాట్లాడుతూ.. వరుణ దేవుడికి థ్యాంక్స్ చెప్పారు. తను రాయలసీమకి వచ్చినప్పుడల్లా.. వర్షం పడుతుందని, అది మరోసారి రుజువైందని చెబుతూ.. ఇదొక శుభసూచకంగా భావిస్తున్నట్లుగా చిరు చెప్పుకొచ్చారు. ఇక ‘గాడ్‌ఫాదర్’ సినిమా గురించి చిరు మాట్లాడుతూ..


‘‘మలయాళంలో మోహన్‌లాల్ నటించి, విజయం సాధించిన ‘లూసిఫర్’ (Lucifer) చూడటం జరిగింది. ఇది ‘గాడ్‌ఫాదర్’గా మారడానికి, నేను చేయడానికి ప్రధానమైన కారణం రామ్ చరణ్. సినిమా బావుంది నాకు వైవిధ్యంగా ఉంటుందని అనుకున్నాను. అయితే ఎవరు చేస్తారని ఆలోచిస్తున్నపుడు.. రామ్ చరణ్ ముందుకు వచ్చి ‘మీ ఇమేజ్‌కి ఈ సమయంలో చేయాల్సిన సబ్జెక్ట్ లూసిఫర్’ అని చరణ్ చెప్పాడు. చరణ్ కోరిక మేరకు ఇది ‘గాడ్‌ఫాదర్’గా తెరకెక్కింది. ఈ సందర్భంగా రామ్ చరణ్‌కి కృతజ్ఞతలు. ఈ సినిమాకి దర్శకుడిగా మోహన్ రాజా పేరుని సూచించింది కూడా రామ్ చరణే. దర్శకుడు మోహన్ రాజా ఈ సినిమాని మనందరం గర్వపడేలా తీశారు. దాదాపు ఆరు నెలలు పాటు మిత్రుడు సత్యానంద్‌తో కలిసి.. ప్రేక్షకులు, ఫ్యాన్స్ ఆనందించేలా ఈ సినిమా స్క్రీన్‌ప్లే చేయడం జరిగింది. ఆ స్క్రీన్‌ప్లేని అత్యద్భుతంగా తెరకెక్కించారు మోహన్ రాజా. ఆయన మామూలు దర్శకుడు కాదు. ఆయనవి అన్నీ పెద్ద కోరికలు. ఈ సినిమాలో నాకు దళపతిగా వుండే ఒక పాత్ర వుంది, ఆ పాత్ర కోసం సల్మాన్ ఖాన్ అయితే బావుంటుందని చాలా సింపుల్‌గా చెప్పారు. రాజా అంత సింపుల్‌గా చెప్పారు కానీ.. అసలు సల్మాన్ ఖాన్‌ (Salman Khan)ని తీసుకురావడం సాధ్యమేనా అని ఆలోచిస్తున్నపుడు.. మళ్లీ రామ్ చరణే ఆ బాధ్యత తీసుకున్నాడు. ‘‘నాన్నగారి సినిమాలో ఒక పాత్ర వుంది మీరు చేస్తే బావుంటుంది’’ అని చరణ్ చెప్పడం.. ‘‘నేను చేయాలని చిరుసార్ కోరితే.. ఆ పాత్ర చేయడానికి నేను సిద్ధమే.. కథ కూడా చెప్పొద్దు. నేరుగా షూటింగ్‌కి వచ్చేస్తా’’ అని సల్మాన్ అన్నారు. మాపై ఇంత ప్రేమ చూపించిన సల్మాన్ భాయ్‌కి కృతజ్ఞతలు. (God Father Pre Release Event)


చరణ్‌తో కలసి సూపర్ గుడ్ ఫిలింస్ ఆర్‌బి చౌదరిగారు, మా ఫ్యామిలీకి అత్యంత దగ్గరైనటువంటి ఎన్వీ ప్రసాద్‌గారు ఈ సినిమాని ఎంతో భారీగా నిర్మించారు. వారికి కృతజ్ఞతలు. నయనతార పాత్ర ఇందులో అత్యద్భుతంగా వచ్చింది. సెకండాఫ్‌లో అద్భుతమైన సెంటిమెంట్ గొప్పగా పండించారు. నయనతారకి హ్యాట్సాఫ్. ఇందులో ప్రతినాయకుడిగా సత్యదేవ్ చేశారు. నాకు ఎదురుగా నిలబడే పాత్ర తనది. సత్యదేవ్ అద్భుతమైన నటుడు. ఇందులో ఆయన నటనని పరిపూర్ణంగా వాడుకున్నాం. సత్యదేవ్‌కి చాలా మంచి భవిష్యత్ వుంది. మన కళ్ళముందే సత్యదేవ్ సూపర్ స్టార్‌గా ఎదుగుతాడు. మురళీ శర్మ పాత్ర చాలా వైవిధ్యంగా వుంటుంది. సముద్రఖని ఇందులో మరో ప్రతి నాయకుడి‌గా శభాష్ అనిపించారు. సునీల్, షఫీ, గెటప్ శ్రీను పాత్రలు కూడా ఆసక్తికరంగా వుంటాయి. ఇందులో దర్శకుడు పూరి జగన్నాధ్ యూట్యూబర్‌గా కనిపించి.. పాత్రలని, కథని పరిచయం చేస్తారు. ఆయన రాకతో కథలో ఒక ఫ్రెష్‌నెస్ వచ్చింది. వీరంతా కలిసి సినిమాని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్ళారు.  లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సల్మాన్ భాయ్ ఇందులో తన స్టయిల్, గ్రేస్, లుక్స్, ఫైట్స్‌తో నా తరపున మీ అందరినీ అలరిస్తాడు. చాలా అద్భుతంగా వచ్చింది సల్మాన్ పాత్ర. ఇందులో నేనూ, సల్మాన్ ఒక పాటకు డ్యాన్స్ చేశాం. ఇద్దరు స్టార్లని బ్యాలెన్స్ చేస్తూ ప్రభుదేవా అద్భుతంగా ఆ పాటని కొరియోగ్రఫీ చేశారు. 


మేమంత చేసింది ఒక ఎత్తు.. అయితే ఈ ‘గాడ్‌ఫాదర్’కి ఆరో ప్రాణం థమన్ మ్యూజిక్. రీ-రికార్డింగ్ మొత్తం అయ్యాక నేను సినిమా చూశాను. తమ్ముడు థమన్ మ్యూజిక్‌తో ఈ సినిమా నెక్స్ట్ లెవల్‌కి వెళ్ళింది. కేవలం కంటిచూపుతో.. గొప్ప హీరోయిజం తీసుకొచ్చే పాత్రని ఇందులో చేశాను. థమన్ అత్యద్భుతమైన రీరికార్డింగ్ చేశారు. గూస్ బంప్స్ వస్తాయి. రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ ఇందులో అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్‌లు చేశారు. ఇందులో నజబజజజర పాటని అద్భుతమైన ఫైట్‌గా తీర్చిదిద్దారు. ఈ సినిమాలో పొలిటికల్ డ్రామా, ఫ్యామిలీ డ్రామా కలిసి నడుస్తుంటాయి. ఈ రెండూ కలిసి ప్రేక్షకులని ఆద్యంతం అలరిస్తాయని హామీ ఇస్తున్నాను. సినిమాని చూశాను కాబట్టి ఇంత నమ్మకంగా చెబుతున్నాను. ‘గాడ్‌ఫాదర్’ అక్టోబర్ 5 విజయదశమి నాడు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించి గొప్ప విజయాన్ని ఇవ్వాలి. ఈ మధ్య చేసిన చిత్రం కాస్త నిరాశ పరిచింది. మిమ్మల్ని సరిగ్గా అలరించలేకపోయాననే అసంతృప్తి వుంది. దానికి సమాధానమే ఈ సినిమా. ‘గాడ్‌ఫాదర్’ నిశ్శబ్ద విస్పోటనం. మీ అందరి ఆశీస్సులు కావాలి. విజయదశమి మీ జీవితాల్లో కూడా విజయాన్ని తేవాలి..’’ అని చిరంజీవి చెప్పుకొచ్చారు. (GodFather pre Release Event)

Updated Date - 2022-09-29T16:54:39+05:30 IST