Megastar Chiranjeevi: చిత్రపూరి కాలనీకి పుట్టినరోజు కానుక!

ABN , First Publish Date - 2022-08-20T07:03:25+05:30 IST

మనకు ఇంత అభిమానాన్ని పంచిన ప్రేక్షకులకు ఏమిచ్చాం? ఈ స్థాయిలో నిలబెట్టిన వారికి సేవ ప్రాథమిక బాధ్యత కొణిదెల వెంకట్రావు పేరుతో చిత్రపురిలో ఆసుపత్రి వచ్చే ఏడాది పుట్టినరోజుకి అందుబాటులో ఉంటుంది ఓ ముద్ద పెడితే కలిగే సంతృప్తి మాటల్లో చెప్పలేం ఆ తృప్తిని అనుభవించిన వాడిగా చెబుతున్నా – మెగాస్టార్‌ చిరంజీవి

Megastar Chiranjeevi: చిత్రపూరి కాలనీకి పుట్టినరోజు కానుక!

మనకు ఇంత అభిమానాన్ని పంచిన ప్రేక్షకులకు ఏమిచ్చాం? 

ఈ స్థాయిలో నిలబెట్టిన వారికి సేవ ప్రాథమిక బాధ్యత

కొణిదెల వెంకట్రావు పేరుతో చిత్రపురిలో ఆసుపత్రి

వచ్చే ఏడాది పుట్టినరోజుకి అందుబాటులో ఉంటుంది

ఓ ముద్ద పెడితే కలిగే సంతృప్తి మాటల్లో చెప్పలేం

ఆ తృప్తిని అనుభవించిన వాడిగా చెబుతున్నా

– మెగాస్టార్‌ చిరంజీవి (Megastar chiranjeevi)


‘‘చిత్రపురి కాలనీలో నివశించే సినీ కార్మికుల కోసం మా నాన్న కొణిదెల వెంక్రటావుగారి (KOnidela venkatrao hospital)పేరున ఆస్పత్రి కట్టాలనుకున్నా. ఈ ఆలోచన వచ్చినప్పటి నుంచీ దానిపై పనిచేస్తున్నా. ఎన్ని కోట్లు ఖర్చు అయినా పెట్టగలిగే శక్తి భగవంతుడు నాకు ఇచ్చాడు. ఎవరైనా సాయం చేయడానికి ముందుకొస్తే వారికి కూడా అవకాశం కల్పిస్తాం. ఈ  పుట్టినరోజు సందర్భంగా ఈ విషయాన్ని మీ ముందు ఉంచుతున్నారు. వచ్చే ఏడాదికి పుట్టినరోజుకి ఆ ఆస్పత్రి  సేవలు అందుబాటులోకి వస్తాయి’’ అని చిరంజీవి అన్నారు. సెలబ్రిటీ క్రికెట్‌ కార్నివాల్‌ (Celebrity cricket carnival)జెర్నీని చిరు (Chiranjeevi)ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడారు. 



కెరీర్‌ ప్రారంభంలో ఎవరి స్వార్థం వారు చూసుకుంటారు. ‘నేను పైకి రావాలి.. నా కుటుంబ సభ్యులు బావుండాలి.. విలాసవంతమైన భవంతిలో ఉండాలి, ఖరీదైన కార్లలో తిరగాలి అనుకుంటారు. దానికి తగ్గట్లు కష్టపడి సంపాదిస్తాం. కడుపు నిండుతుంది. మనము, మన చుట్టాలు అంటూ ఆలోచించే ఆ తరుణంలో సంతృప్తి కరువవుతుంది. ఎక్కడైతే తృప్తి ఉండదో అక్కడ మానసిక శాంతి కూడా ఉండదు. ఆ సమయంలో మనకు అనిపిస్తూ ఉంటుంది. ఎంతసేపు మన గురించి, మన చుట్టాల గురించి ఆలోచిస్తున్నాం కానీ నిజంగా మనం ఎవరమని చెప్పి ప్రేక్షకులు మనకు ఇంత అత్యున్నతమైన స్థానాన్ని కల్పిస్తున్నారు. ఇంత ప్రేమను మనపై కురిపిస్తున్నారు. మేమంతా పెద్దగా చదివింది లేదు. ఒకవేళ చదువుకు తగ్గ జాబ్‌లోకి వెళ్లుంటే నెలకి లక్షో, రెండు లక్షలో సంపాదించేవాళ్లమంతే! కానీ ఇవాళ్ల మేమంతా రోజుకి లక్షల్లో సంపాదిస్తున్నాం అంటే సినీ పరిశ్రమ మాకు ఇచ్చిన అవకాశమిది. ప్రేక్షకుల మమ్మల్ని ఆదరించడం వల్లనే కదా అనిపిస్తుంది.. ఇలాంటి వారికి మనం ప్రత్యుపకారంగా ఏం చేశాం అని ఆలోచిస్తే.. ఏమి చేయడం లేదనే భావన కలుగుతుంది. నాకూ ఆ భావన కలిగిన రోజే ప్రేక్షకులు, అభిమానుల కోసం ఏదో ఒకటి చేయాలనిపించింది. ఆ రోజు నుంచి నా వంతుగా సాయం చేస్తూ వస్తున్నా. వరదలు, విపత్తుల సమయంలో అవసరార్ధులకు చేయూతగా నిలిచాను. ‘అత్తకు యముడు అమ్మాయికి మొగుడు’ చిత్రం సమయంలో మరణించిన పత్తి రైతుల కుటుంబాలకు అండగా నిలవడం ఇలా ఒక్కోటి చేసుకుంటూ వచ్చా. మన కడుపు నిండిన తర్వాత లేనివారికి, అర్ధ ఆకలితో ఉన్నవారికి ఓ ముద్ద పెట్టడం, చేయుతనివ్వడం చేస్తే అందులో కలిగే సంతృప్తి మాటల్లో చెప్పలేం. ఆ తృప్తిని అనుభవించిన వాడిగా చెబుతున్నా. 


ఆ తప్పు నాదే.. 

ఇక్కడున్న శ్రీకాంత్‌, తరుణ్‌ టీమ్‌..ఈ యంగ్‌స్టర్స్‌ అందరిదీ మంచి మనసే! అందరిలో సేవాగుణం ఉంది. వీళ్లంతా ఇదివరకు ఎందుకు ముందుకు రాలేదు అంటే.. ఆ తప్పు నాదే! నేను సమాచారం ఇవ్వకపోవడం వల్లనే. ఎక్కడో ఓ పెద్ద మనిషి అన్నారు. చిరంజీవి చేసే సేవలకు ప్రచారం అక్కర్లేదయ్యా.. కానీ సమాచారం కావాలి అని. ఎవరికన్నా ఆపద అంటే సైలెంట్‌గా వెళ్లి ఇచ్చేయడం తప్ప పబ్లిసిటీ చేసుకోవడం అలవాటు లేదు. మనకు ఉండే డబ్బులో ఏదో ఊడతా భక్తితో ఇచ్చేది కొంతే! దానికి పబ్లిసిటీ అవసరం లేదు. కానీ సమాచారం ఉంటే పదిమంది స్ఫూర్తి పొందుతారు. ఆ పదిమంది మరో పదిమందికి సేవలు అందిస్తారు అన్నది నిజం. 

ఒక్క అడుగుకి పది అడుగులు తోడవుతాయి...

‘‘మా ఎదుగుదలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా కారణమైన సినీ కార్మికులందరికీ ఉపయోగపడేలా ఏదైనా చేయడం నా ప్రాథమిక బాధ్యత. అందుకే పది పడకల ఆస్పత్రి కట్టాలనుకున్నా. నేను ఈ విషయాన్ని బయటపెట్టగానే పెద్దపెద్ద ఆస్పత్రుల్లో డాక్టర్లైన నా స్నేహితులందరూ ‘మేమొచ్చి సేవలందిస్తాం, స్పెషలిస్ట్‌లైనా డాక్టర్లను వారాంతంలో పంపిస్తాం’ అని మాటిచ్చారు. అలాగే కొందరు డయాగ్నస్టిక్‌ సెంటర్‌ వాళ్లు అక్కడ కావలసిన ల్యాబ్‌ ఎక్విప్‌మెంట్‌ సమకూరుస్తామని చెప్పారు. ఓ మంచి పని మొదలుపెడితే పది మంది మన వెంట ఉంటారని మరోసారి రుజువైంది. ఇవన్నీ కూడా భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి ఉత్సాహాన్ని ఇస్తుంది. అందుకు నాందిగా తమ్ముడు శ్రీకాంత్‌ అండ్‌ క్రికెట్‌ టీమ్‌ రూ. 20లక్షలు ప్రకటించారు. భవిష్యత్తులో వారు మరెన్నో సేవా కార్యక్రమాలు చేయాలి.  

Updated Date - 2022-08-20T07:03:25+05:30 IST