Chiranjeevi: కంటెంట్ బావుంటే ప్రేక్షకులెప్పుడూ ఆదరిస్తారు..

ABN , First Publish Date - 2022-08-06T15:47:51+05:30 IST

"కంటెంట్ బావుంటే ప్రేక్షకులెప్పుడూ ఆదరిస్తారు"..అని మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) తాజాగా విడుదలైన 'సీతారామం' (Sitha Ramam), 'బింబిసార' (Bimbisara) సినిమాల బృందాన్ని

Chiranjeevi: కంటెంట్ బావుంటే ప్రేక్షకులెప్పుడూ ఆదరిస్తారు..

"కంటెంట్ బావుంటే ప్రేక్షకులెప్పుడూ ఆదరిస్తారు"..అని మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) తాజాగా విడుదలైన 'సీతారామం' (Sitha Ramam), 'బింబిసార' (Bimbisara)  సినిమాల బృందాన్ని అభినందిస్తూ ట్వీట్ చేశారు. 2020 కరోనా తర్వాత టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో చోటు చేసుకున్న తీవ్ర పరిణామాల గురించి అందరికీ తెలిసిందే. దాదాపు రెండేళ్ళ పాటు ప్రేక్షకులు కరోనా భయంతో థియేటర్స్ వైపుకు వెళ్ళాలంటేనే భయపడ్డారు. ఆ తర్వాత కాస్త పరిస్థితులు చక్కబడినప్పటికీ టికెట్ రేట్లు పెరగడం..సినిమా రిలీజైన కొద్ది రోజులకే ఓటీటీలో స్ట్రీమింగ్‌కి వచ్చేయడంతో జనాలు థియేటర్స్ వరకూ వెళ్ళడానికి అంతగా ఆసక్తి చూపించలేదు. 


అయితే, ఇది అన్ని సినిమాల విషయంలో కాదు. కంటెంట్ బావుంటే దేనికీ భయపడకుండా తమ అభిమాన హీరో సినిమా చూసేందుకు, మంచి సినిమాను ఆదరించేందుకు థియేటర్స్‌కి వచ్చిన వారూ లేకపోలేదు. దీనికి ఉదాహరణగా గత ఏడాది వచ్చిన పుష్ప: ది రైజ్, అఖండ, క్రాక్..ఈ ఏడాది వచ్చిన ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2, భీమ్లా నాయక్, సర్కారు వారి పాట లాంటి చిత్రాలే. సినిమా బావుందంటే ఖచ్చితంగా ప్రేక్షకులు థియేటర్స్‌కు వస్తారని ఈ సినిమాలు నిరూపించాయి.


అయితే, ఇటీవల ఇండస్ట్రీలో కొందరు అంత ఈజీగా ప్రేక్షకులు థియేటర్స్‌కు రావడం లేదంటూ మాట్లాడుకుంటున్నారు. చిన్న, మీడియం బడ్జెట్‌తో సినిమాలను నిర్మించే వారిలోనూ ధైర్యం తగ్గుతోంది. అలాంటి వారికి తాజాగా వచ్చిన బింబిసార, సీతారామం సినిమాలు ఊరటనిచ్చాయి. ఇదే విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో ప్రస్తావిస్తూ ట్వీట్ చేశారు. ఇందులో ఆయన.."ప్రేక్షకులు సినిమా థియేటర్లకి రావడం లేదని బాధపడుతున్న ఇండస్ట్రీ కి ఎంతో ఊరటనీ మరింత ఉత్సాహాన్ని స్తూ, కంటెంట్ బావుంటే ప్రేక్షకులెప్పుడూ ఆదరిస్తారని మరోసారి నిరూపిస్తూ నిన్న విడుదలయిన చిత్రాలు రెండూ విజయం సాధించటం ఎంతో సంతోషకరం. ఈ సంధర్భంగా 'సీతారామం', మరియు 'బింబిసార' చిత్రాల నటీనటులకు,నిర్మాతలకు, సాంకేతిక నిపుణులందరికీ నా మనః పూర్వక శుభాకాంక్షలు"..పేర్కొన్నారు.   

Updated Date - 2022-08-06T15:47:51+05:30 IST