చందనసీమపై కర్ఫ్యూ ఎఫెక్ట్‌

ABN , First Publish Date - 2022-01-07T18:27:18+05:30 IST

కరోనా కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం విధించిన ‘వీకెండ్‌ కర్ఫ్యూ’ చందనసీమకు ఆశనిపాతంలా తగిలింది. పైగా సినిమా థియేటర్లలో మళ్ళీ 50 శాతం ప్రేక్షకుల నిబంధన అమల్లోకి తీసుకురావడంతో చాలా మంది నిర్మాతలు తమ

చందనసీమపై కర్ఫ్యూ ఎఫెక్ట్‌

- పలు సినిమాల విడుదల వాయిదా 

- నిర్మాతల్లో ఆందోళన


బెంగళూరు: కరోనా కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం విధించిన ‘వీకెండ్‌ కర్ఫ్యూ’ చందనసీమకు ఆశనిపాతంలా తగిలింది. పైగా సినిమా థియేటర్లలో మళ్ళీ 50 శాతం ప్రేక్షకుల నిబంధన అమల్లోకి తీసుకురావడంతో చాలా మంది నిర్మాతలు తమ సినిమాల విడుదలను వాయిదా వేసుకుంటున్నారు. చందనసీమ వర్గాల కథనం ప్రకారం జనవరిలో విడుదల కానున్న ‘ఏక్‌ లవ్‌యూ’ చిత్రం మినహా మిగిలినవన్నీ బడ్జెట్‌ చిత్రాలేనని తెలుస్తోంది. వారాంతపు లాక్‌డౌన్‌ నిర్ణయం వెలువడుతూనే ‘ఏక్‌ లవ్‌యూ’ చిత్రవిడుదలను వాయిదావేస్తున్నట్లు దర్శకుడు ప్రేమ్‌ ప్రకటించారు. కాగా ఈ నెల 7న విడుదల కావాల్సిన ‘డీఎన్‌ఏ’ చిత్రాన్ని కూడా వాయిదావేస్తున్నట్లు దర్శకుడు ప్రకాష్‌రాజ్‌ మేహు తెలిపారు. ఈ నెల 7న విడుదల కావాల్సిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కన్నడ వెర్షన్‌ చిత్రం విడుదల కూడా వాయిదాపడింది. జనవరి 14న సంక్రాంతికి విడుదల కావాల్సిన ప్రభాస్‌ సినిమా ‘రాధే శ్యామ్‌’ కూడా వాయిదాపడింది. ఈ నెల 14న విడుదల కావాల్సిన మరో కన్నడ చిత్రం ‘ఒంబత్తనే దిక్కు’ విషయంలో ఏమిచేయాలో పాలుపోక దర్శకుడు దయాళ్‌పద్మనాభన్‌ గందరగోళంలో ఉన్నారు. ఈనెల 21న విడుదల కావాల్సిన ఫోర్‌వాల్స్‌, 28న విడుదల కావాల్సిన ‘దమాక’ చిత్రాల విడుదలను వాయిదా వేశారు. ఇప్పటికే సింపల్‌ సుని దర్శకత్వంలోని అవతార పురుష చిత్రాన్ని వాయిదా వేశారు. నటుడు రక్షిత్‌ శెట్టి నటించిన చార్లి 777 విడుదలపై ఇంకా సస్పెన్స్‌ కొనసాగుతోంది. ఈ తాజా పరిణామాలపై సీఎంతో చర్చించాలని కర్ణాటక చలనచిత్ర వాణిజ్యమండలి నిర్ణయించింది. మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండంతో భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టిన నిర్మాతలు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.

Updated Date - 2022-01-07T18:27:18+05:30 IST